జీజీహెచ్‌కు వెళ్తే గుండెదడ

ABN , First Publish Date - 2023-04-03T00:31:07+05:30 IST

పేదలకు పెద్దదిక్కుగా ఉన్న కొత్త ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేట్‌ పెత్తనం పెరిగింది. గుండెనొప్పి అని వెళ్లినా, పొరపాటున బైపాస్‌ చేయాల్సి వచ్చినా ఆరోగ్యశ్రీ అధికారుల సహకారంతో ప్రైవేట్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. ఉన్నవి, లేనివి చెప్పి, రోగిని భయపెట్టి, సర్జరీ చేయాలంటున్నారు. ఆరోగ్యశ్రీ పేరుచెప్పి ప్రైవేట్‌ ఆసుపత్రికి పంపుతున్నా, అక్కడికి వెళ్లాక రోగులకు ‘చుక్కలు’ చూపిస్తున్నారు. జీజీహెచ్‌ కార్డియా లజీ విభాగంలో సేవలందించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న ప్రైవేట్‌ సిబ్బందే ఈ తతంగమంతా నడిపిస్తున్నా, ఇవేమీ తెలియని పేదలు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

జీజీహెచ్‌కు వెళ్తే గుండెదడ

ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థదే పెత్తనం

రోగులకు ఉన్నవి, లేనివి చెప్పి తమ ఆసుపత్రికి రిఫర్‌

నమ్మి వెళ్లిన వారికి ‘చుక్కలే’

యాంజీయోగ్రామ్‌కు ఆరోగ్యశ్రీలో రూ.11,500లట..!

దోచిపెడుతున్న ఆరోగ్యశ్రీ అధికారులు

రక్తానికి సపరేటు రేటు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ‘మీకు బైపాస్‌ సర్జరీ చేయాలి. ఏ హాస్పిటల్లో చెబితే అక్కడ చేరండి. అంతా ఫ్రీగానే చేస్తారు. మీకేం ఖర్చు ఉండదు..’ అని ఓ చీటీ మీద డాక్టర్‌ పేరు, ఫోన్‌ నెంబరు, రోగి నెంబరు రాస్తారు. అలా కాదు.. తాము వేరే ఆసుపత్రిలో చూపించుకుంటామని రోగి చెప్పినా వినరు. ‘మీకు ఇక్కడ యాంజీయోగ్రామ్‌ తీశాం కదా. ఇక్కడ చేసే డాక్టర్‌దే ఆ ఆసుపత్రి. అక్కడికే వెళ్లాలి..’ అని గట్టిగా చెబుతారు. ‘రోగి పరిస్థితి చాలా విషమంగా ఉంది. మా దగ్గర అన్ని టెస్టులు అయ్యాయి. వాటిని ఆయనకు పంపించాం. అక్కడకు వెళ్లగానే మీకు సర్జరీ ఎప్పుడు చేస్తారో చెబుతారు..‘ అని పేర్కొంటారు. ప్రభుత్వాసుపత్రి కార్డియాలజీ విభాగంలోని క్యాథ్‌ల్యాబ్‌ వద్ద నిత్యం జరిగే తంతు ఇది. తమ వారిని కాపాడుకోవాలనే ఆత్రుతలో వారు చెప్పిన హాస్పిటల్‌కు వెళ్తున్నారు రోగులు.

అసలు కథ ఇదీ..

జీజీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ విభాగంలో పదేళ్లపాటు సేవలు అందించాలని ఓ ప్రైవేట్‌ సంస్థతో 2019లో ఆరోగ్యశ్రీ ఎంవోయూ కుదుర్చుకుంది. దీని ప్రకారం గుండె సంబంధ వ్యాధితో బాధపడే రోగులకు యాంజీయోగ్రామ్‌ దగ్గర నుంచి, వారికి స్టంట్‌ వేసే వరకు ఆయా సంస్థే బాధ్యతలు తీసుకుంటుంది. ఈ ఎంవోయూ చేసుకున్న సంస్థకు పుష్ప హోటల్‌ సెంటర్‌ సమీపంలో గుండె సంబంధిత ఆసుపత్రి ఉంది. దీంతో జీజీహెచ్‌లోని ఆరోగ్యశ్రీలో చూయించుకున్న రోగికి ఒకవేళ బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు సూచిస్తే, వారిని తమ హాస్పిటల్‌కే రిఫర్‌ చేయాలని ఆయా విభాగంలోని డాక్టర్లతో చీటీ రాసి ఇచ్చే చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రోగులను తరలించే బాధ్యతను ప్రైవేట్‌ సంస్థకు చెందిన వ్యక్తులు తీసుకున్నారు.

ఆ హాస్పిటల్‌కు వెళితే అంతే సంగతులు

సదరు ప్రైవేట్‌ సిబ్బంది ఇచ్చిన చీటీ పట్టుకుని ఆ హాస్పిటల్‌కు వెళ్లిన రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. రక్తపరీక్షలని, ఈసీజీ, 2డీ ఎకో అంటూ సుమారు రూ.15 వేలకు పైగా బిల్లు వేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో యాంజీయోగ్రామ్‌ చేయించుకుంటే బిల్లుల రూపంలో సదరు సంస్థకు రూ.11,500 ముడుతుంది. బయట కొంతమంది యాంజీయోగ్రామ్‌ను రూ.4వేలకే చేస్తున్నారు. మరికొంతమంది రూ.11 వేలకు చేస్తున్నారు. ఒకవేళ రోగికి స్టంట్‌ వేయాలని సూచిస్తే, ఆపరేషన్‌కు సుమారు రూ.40వేలకు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులే వస్తాయి. ఇక సదరు సంస్థకు రోజుకు జీజీహె చ్‌లో సుమారు 15 నుంచి 18 వరకు యాంజీయోగ్రామ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెలకు 450 నుంచి 540 యాంజీయోగ్రామ్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఈవిధంగా చూసుకుంటే నెలకు సుమారు రూ.62 లక్షల వరకు ఆ సంస్థకు ఆరోగ్యశ్రీ చెల్లిస్తుంది.

బైపాస్‌ అయితే ‘చుక్కలు’ చూపిస్తారు..

జీజీహెచ్‌లో నిర్వహించే యాంజీయోగ్రామ్‌ పరీక్షలో రోగికి బైపాస్‌ సర్జరీ చేయాలని డాక్టర్‌ సూచిస్తే వెంటనే సంస్థ ప్రతినిధులు అక్కడ వాలిపోతారు. రోగి బంధువులను ప్రలోభాలకు గురిచేసి వారిని ఆ ఆసుపత్రిలో చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. ఉన్నవి, లేనివి చెప్పి అక్కడకు పంపిస్తారు. వారి మాటలు నమ్మి సదరు ఆసుపత్రికి వెళ్లిన రోగులకు ‘చుక్కలు’ చూపించి జేబులు ఖాళీ చేస్తున్నారు. గతంలో సంస్థ ప్రతినిధుల ప్రలోభాలను గుర్తించిన అధికారులు హెచ్చరించారు. కానీ, ప్రైవేట్‌ సంస్థ యాజమాన్యం రాజకీయ నాయకుల అండతో అధికారుల మాటను పెడచెవిన పెట్టింది. దీంతో రోగులను సులువుగా వారి హాస్పిటల్‌కు తరలిస్తున్నారని జీజీహెచ్‌ అఽధికార సిబ్బందే చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ అధికారులతోనూ మంచి బంధాలు కొనసాగుతున్నాయంటున్నారు.

రక్తాన్ని పిండేస్తున్నారు

ఆరోగ్యశ్రీలో గుండె సర్జరీలకు రక్తం ఉచితంగా అందించాలి. కానీ, ఆ హాస్పిటల్‌ మాత్రం డోనర్స్‌ ఇచ్చే రక్తానికి నగదు వసూలు చేస్తున్నారు. అదేంటని అడిగితే స్ర్కీనింగ్‌కయ్యే ఖర్చును రక్త కేంద్రానికి చెల్లించాలని సమాధానం ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీలో నాలుగు ప్యాకెట్ల వరకు ఉచితంగా రక్తాన్ని అందించాలి. వాటికయ్యే స్ర్కీనింగ్‌ ఖర్చును ఆసుపత్రి రక్తా కేంద్రానికి చెల్లించాలి. కానీ, ఆరోగ్యశ్రీలో బిల్లులు సమయానికి అందడం లేదని, ఆ మొత్తాన్ని రోగుల వద్ద నుంచే వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా గుండె సర్జరీలకు అత్యవసరమైతేనే రక్తం నాలుగు ప్యాకెట్లు వినియోగిస్తారు. కాకపోతే అదనంగా మరో రెండు ప్యాకెట్ల వరకు తీసుకురావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. రక్త కేంద్రాల్లో ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.1,500 ఉంటుంది. దీనికి అదనంగా ఓ డోనర్‌ రక్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందని రక్త కేంద్రాలు రోగి తరఫు బంధువులకు చెబుతున్నారు. దీంతో డోనర్స్‌ను సమకూర్చుకున్నా.. అదనంగా నగదు చెల్లించాల్సి వస్తోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-04-03T00:31:07+05:30 IST