‘సున్నా’యాసంగా..
ABN , First Publish Date - 2023-07-25T01:05:55+05:30 IST
తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక శంకరమఠం వీధి మొదటి లైన్లో తల్లీకొడుకులు దుంగల రమణ, వీరవెంకట మణికంఠబాబు నివాసం ఉంటున్నట్టు ఓటర్ల జాబితాలో చూపించారు. కానీ, వీరి అడ్రసులో డోర్ నెంబరు 0000 అని పేర్కొన్నారు. ఇలా ఒకటో రెండో కాదు... రెండు జిల్లాల్లో సుమారు 17,282 ఇళ్లు జీరో డోర్ నెంబర్లు కలిగి ఉన్నాయి. వీటిలో వేలసంఖ్యలో ఓటర్లు పేర్కొన్నారు. ఇవన్నీ దొంగ ఓట్లేనన్న ఆరోపణలు వస్తున్నాయి.
వేల సంఖ్యలో దొంగ ఓట్లుగా అనుమానాలు
రెండు జిల్లాల్లో 17,282 వరకూ జీరో డోర్ నెంబర్లు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, కృష్ణాజిల్లా గన్నవరంలో అధికం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ఓటరుగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమా 265వ నెంబరు బూతులో ఓట్లను పరిశీలించారు. ఆ ఒక్క బూతులోనే 66 ఓట్లు జీరో డోర్ నెంబరుతో ఉన్నట్లు గుర్తించారు. ఎన్నికల్లో అడ్డదారిలో గెలుపు కోసమే వైసీపీ నాయకులు అధికారులతో కలిసి ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
మరీ ఇంత నిర్లక్ష్యమా..?
ఏ ఇంటికైనా డోర్ నెంబరు ఉండటం సహజం. అలాంటిది జీరో డోర్ నెంబరుతో వేల సంఖ్యలో ఇళ్లను చూపడం ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘పొరపాటు జరిగితే ఒకటో రెండో ఇళ్లకు జీరో డోర్ నెంబరు ఉంటుంది. కానీ, ఇలా వేల సంఖ్యలో జీరో డోర్ నెంబరు ఉన్న ఇళ్లను సృష్టించడం అంటే అది భారీ కుట్రను సూచిస్తోంది’ అని టీడీపీ నేత దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. తన పరిశీలనలోనే 300కిపైగా దొంగ ఓటర్లను ఇలా జీరో డోర్ నెంబరుతో ఉన్న ఇళ్లలో గుర్తించామన్నారు. గొల్లపూడిలోని 257వ బూత్‌లో 185 ఓట్లు, 259వ బూత్‌లో 195 ఓట్లు, 264వ బూత్‌లో 65 ఓట్లు 277వ బూత్‌లో 12 ఓట్లు జీరో డోర్ నెంబరుతో ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి బూత్ పరిధిలో డోర్ నెంబర్లు వరుస క్రమంలో ఉండాలి. ఆ నిబంధనలను ఎక్కడా పాటించకపోగా, జీరో డోర్ నెంబర్లను సృష్టించి లక్షల సంఖ్యలో దొంగ ఓటర్లను ఎక్కించారు. ఇది కొందరు అధికారులతో కలిసి వైసీపీ నాయకులు చేసిన కుట్రగా టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ నేత బొండా ఉమా వ్యాఖ్యానించారు.
సెంట్రల్‌లో..
సెంట్రల్ నియోజకవర్గంలోని వాంబేకాలనీ వాటర్ ట్యాంకు వద్ద ఉండే చిలకమ్మ, సాల్మన్‌రాజు దంపతుల ఇంటి నెంబరును కూడా జీరోగా చూపారు. ఇలాంటి జీరో డోర్ నెంబరు ఇళ్లు సెంట్రల్‌లో 29 ఉన్నాయి. వీటిలోనే సుమారు 10 వేల వరకు దొంగ ఓట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే, కొన్ని డోర్ నెంబర్లు ‘నో’ అని ఉన్నాయి ఇలా ఉన్న ఇళ్లలో మరో 10 వేల వరకు దొంగ ఓట్లను నమోదు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. 24వ డివిజన్‌లో 152వ బూత్ నంబరులో ఒకే ఇంట్లో 506 ఓట్లు ఉండగా, ఆ ఇంటి డోర్ నెంబరు ఎదురుగా ‘నో’ అని పేర్కొనడం గమనార్హం.