సీఎంగారూ.. ప్రాణాలు నిలపరూ..!

ABN , First Publish Date - 2023-03-19T00:50:40+05:30 IST

రాష్ట్రంలో మరో ఉద్ధానంగా మారిన ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బాధితులు తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరువూరు వస్తున్న సందర్భంగా మండలంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి గాలిలో కలిసిపోతున్న ప్రాణాలను నిలపాలని కోరారు.

సీఎంగారూ.. ప్రాణాలు నిలపరూ..!
తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం నేతలు, బాధితులు

ఎ.కొండూరు, మార్చి 18 : రాష్ట్రంలో మరో ఉద్ధానంగా మారిన ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బాధితులు తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరువూరు వస్తున్న సందర్భంగా మండలంలో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి గాలిలో కలిసిపోతున్న ప్రాణాలను నిలపాలని కోరారు. మండలంలో కిడ్నీవ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తు, ప్రజలు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం గాఢనిద్రలో ఉండటం బాధాకరమన్నారు. మండలానికి కృష్ణాజలాల సరఫరా, ప్రత్యేక అసుపత్రి, డయాలసిస్‌ యూనిట్‌ నిర్మాణం, రోగులకు రూ. 5వేలు పింఛన్‌, కిడ్నీ వ్యాధితో మృతి చెందిన కుటుంబాలకు నష్ట పరిహారం అందిస్తామన్న ప్రభుత్వ హామీలు నేటికీ అమలు కాలేదన్నారు. ఇంటింటికి కృష్ణాజలాలపై నిర్ధిష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత ఆరేళ్లుగా కిడ్నీ వ్యాధితో 300 మంది చనిపోయారని, ఇప్పటికీ 2500 మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా సీపీఎం కార్యదర్శి డీవీ కృష్ణ, నేతలు జె.వెంకటేశ్వరావు, ఆనందరావు, అమ్మిరెడ్డి, నాయక్‌, మురళికృష్ణ, జమలమ్మ, కిడ్నీ బాధితులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:50:40+05:30 IST