చెక్‌..పోస్టు

ABN , First Publish Date - 2023-07-11T00:28:32+05:30 IST

రూ.లక్షలు లంచాలిచ్చి రవాణా శాఖలో పోస్టులు కొంటున్నారు. ఇక ఉద్యోగాలు వచ్చాక ఊరికే ఉంటారా? చెక్‌పోస్టులు, నచ్చిన ప్రాంతాల్లో పోస్టింగ్‌లు వేయించుకుని ‘విశ్వరూపం’ చూపిస్తున్నారు. భారీగా దండుకుంటు న్నారు. అంతే స్పీడుగా ఏసీబీకీ దొరికిపోతున్నారు. మూడు రోజుల కిందట ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో ముగ్గురు రవాణా శాఖ అధికారులు పట్టుబడటం, భారీగా డబ్బు బయటపడటం ‘రవాణా’లో అవినీతిని తెలియజేస్తోంది.

చెక్‌..పోస్టు

మూడు రోజుల్లో మూడు చెక్‌పోస్టులపై దాడులు

అధికారులకు చిక్కుతున్న రవాణా శాఖ అధికారులు

ఇన్‌స్పెక్టర్లపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు

గన్నవరం తాత్కాలిక చెక్‌పోస్టులో కాసులు

గరికపాడు చెక్‌పోస్టువైపు కన్నెత్తి చూడరు..!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు రవాణా శాఖ అధికారులు ఏసీబీకి పట్టుబడటంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో కలకలం రేగింది. అయితే, కొందరు అవినీతి అధికారులు త్రుటిలో తప్పించుకున్నారు. రెండు జిల్లాల్లో కొందరు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ), అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఏఎంవీఐ) మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్టు, కృష్ణాజిల్లాలో గన్నవరంలోని తాత్కాలిక చెక్‌పోస్టు, కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు అయిన జీలుగుమిల్లి చెక్‌పోస్టులో జరుగుతున్న అవినీతిపై లెక్కకు మించి ఫిర్యాదులు వస్తున్నాయి. ఏసీబీ దాడుల్లో జీలుగుమిల్లి చెక్‌పోస్టులో ఏఎంవీఐ ఒకరు దొరికిపోయారు. కృష్ణాజిల్లాలో 16వ నెంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)పై గన్నవరం దాటాక ఏర్పాటుచేసిన తాత్కాలిక చెక్‌పోస్టులోనూ ప్రణీత్‌ అనే ఏఎంవీఐ పట్టుబడ్డాడు. వాస్తవానికి ప్రవీణ్‌ స్థానంలో విజయవాడకు చెందిన మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ దొరికిపోవాల్సింది. ఆయన త్రుటిలో తప్పించుకున్నాడు. ఏసీబీ అధికారులు వచ్చే అరగంట ముందు ఆయన స్పాట్‌ నుంచి వెళ్లిపోయాడు. సత్యనారాయణపై లెక్కకు మిక్కిలిగా ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. లారీ డ్రైవర్లను బండ బూతులు తిట్టడంతో పాటు చేయి కూడా చేసుకుంటున్నాడన్న సమాచారంతో సత్యనారాయణపై ఏసీబీ దృష్టిపెట్టింది. ఏసీబీ దాడులు జరిగిన మూడుచోట్ల కూడా ఎంవీఐలు, హోంగార్డు, కారు డ్రైవర్లు, వీరి దగ్గర ఉన్న మరికొందరి వ్యక్తుల వద్ద కూడా డబ్బు బయటపడింది. కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దు అయిన జీలుగుమిల్లి చెక్‌పోస్టులో కల్యాణి అనే ఏఎంవీఐ కూడా ఏసీబీకి పట్టుబడ్డారు.

గన్నవరం తాత్కాలిక చెక్‌పోస్టులో డబ్బే డబ్బు

గన్నవరంలోని తాత్కాలిక చెక్‌పోస్టు కొందరు అవినీతి రవాణా శాఖ అధికారులకు కొంగు బంగారంగా మారింది. జిల్లావ్యాప్తంగా ఎంవీఐలు, ఏఎంవీఐలు ఇక్కడ డ్యూటీలు చేయటానికి పోటీ పడుతున్నారు. 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై కలపర్రు, పొట్టిపాడు వద్ద రెండు టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. వీటి మీదుగా వచ్చే వాహనాలు ఎలాంటివి? అందులో ఏం రవాణా చేస్తున్నారు? అన్నవి చెక్‌ పోస్టు పాయింట్ల దగ్గర ఉన్న వీరి ప్రైవేట్‌ సిబ్బంది పసిగట్టి గన్నవరంలోని చెక్‌పోస్టు డ్యూటీలో ఉన్న వారికి ఫోన్‌ చేసి చెబుతారు. రేషన్‌ బియ్యం, గంజాయి, మద్యం, గుట్కా ప్యాకెట్ల అక్రమ తరలింపు, మూగజీవాలతో పాటు అనేక రకాల నిషేధిత వస్తువుల రవాణాకు సంబంధించి సమాచారం రావటమే తరువాయి.. చెక్‌పోస్టు దగ్గర పట్టేస్తున్నారు. నిషేధిత వస్తువుల రవాణాను అడ్డం పెట్టుకుని భారీగా రేట్లు పెడుతున్నారు. అక్రమంగా ఇసుక, మట్టి, గ్రావెల్‌ రవాణా చేసే వారి దగ్గర కూడా దండుకుంటున్నారు. బియ్యం, మద్యం అక్రమ వ్యాపారులు, మూగజీవాల తరలించే వారి నుంచి నెలవారీ మామూళ్లు అందుకుంటున్నారు. ఇక ఓవర్‌ లోడింగ్‌కైతే డబ్బే డబ్బు. చేయి తడిపిన వారికి జరిమానాలు రాయట్లేదు.

గరికపాడును వ దిలేశారెందుకు..?

ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని గరికపాడు చెక్‌పోస్టు దగ్గర కూడా విధులు నిర్వహించే రవాణా శాఖ సిబ్బందిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. లంచాలు అడగటంపై రవాణా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అలాగే, విజిలెన్స్‌, ఏసీబీ అధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ప్రతి చెక్‌పోస్టులోనూ అవినీతి ఇన్‌స్పెక్టర్లు అడ్డంగా దొరుకుతుంటే, గరికపాడు చెక్‌పోస్టును మాత్రం వదిలేస్తు న్నారు. రాష్ట్ర ఫ్రభుత్వంలో కీలక మంత్రికి చెందిన ఇసుక లారీలు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండటమే ఈ దాడులు జరగకపోవటానికి కారణమని తెలుస్తోంది. రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా ఈవైపు కన్నెత్తి చూడట్లేదు.

Updated Date - 2023-07-11T00:28:32+05:30 IST