నిర్బంధాలను తెంచుకుని..
ABN , First Publish Date - 2023-09-20T00:45:33+05:30 IST
నేతలు గృహనిర్బంధంలో ఉన్నప్పటికీ టీడీపీ కార్యకర్తలు వెనుకడుగు వేయలేదు. పండుగ రోజూ విశ్రమించలేదు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సోమ, మంగళవారాల్లోనూ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు. వినాయకచవితి రోజు కూడా టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించాయి. అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, ఆయనను విడుదల చేసేందుకు ప్రభుత్వ పెద్దలకు భగవంతుడు మంచిబుద్ధిని ప్రసాదించాలని కోరుతూ పలు ఆలయాల్లో, చర్చిల్లో టీడీపీ నాయకులు పూజలు, ప్రార్థనలు చేశారు.

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఉమ్మడి కృష్ణాలో కొనసాగుతున్న ఆందోళనలు
పండగ రోజూ రిలే నిరాహార దీక్ష శిబిరాల్లోనే శ్రేణులు
ఎన్టీఆర్ జిల్లాలో నాయకులను నిర్బంధించిన పోలీసులు
గుడ్లవల్లేరులో టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి
ఆలయాల్లో పూజలు, రిలేదీక్ష శిబిరాల వద్ద అభిప్రాయ సేకరణ
నేతలు గృహనిర్బంధంలో ఉన్నప్పటికీ టీడీపీ కార్యకర్తలు వెనుకడుగు వేయలేదు. పండుగ రోజూ విశ్రమించలేదు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సోమ, మంగళవారాల్లోనూ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగించారు. వినాయకచవితి రోజు కూడా టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు కొనసాగించాయి. అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, ఆయనను విడుదల చేసేందుకు ప్రభుత్వ పెద్దలకు భగవంతుడు మంచిబుద్ధిని ప్రసాదించాలని కోరుతూ పలు ఆలయాల్లో, చర్చిల్లో టీడీపీ నాయకులు పూజలు, ప్రార్థనలు చేశారు.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : విజయవాడ వన్‌టౌన్ వినాయకుని గుడి నుంచి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దేవస్థానం వరకు వెళ్లి అమ్మవారికి సారే సమర్పించే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాలని జిల్లా టీడీపీ నాయకులు నిర్ణయించారు. అయితే పోలీసులు టీడీపీ నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధంలోకి తీసుకున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అమ్మవారి గుడికి బయలుదేరిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వెంకన్న వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు వెంకన్నను అరెస్టు చేసి వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదేశాల మేరకు కనకదుర్గమ్మకు సారే సమర్పించేందుకు బయలుదేరిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత ఎంఎస్ బేగ్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. అయినా పోలీసుల కళ్లు గప్పి ఎంఎస్ బేగ్ వినాయకుడి గుడికి చేరుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించారు.
విజయవాడ సెంట్రల్ పార్టీ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో సెంట్రల్ బీసీ సెల్, 58వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పైపుల రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద 516 కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షల శిబిరంలో పాల్గొన్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ నేతల నేతృత్వంలో నగరంలోని పప్పుల మిల్ సెంటర్లో శ్రీ అభయ ఆంజనేయస్వామి గుడి వద్ద చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, గద్దె అనురాధ, టీడీపీ కార్పొరేటర్లు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కనకదుర్గమ్మ గుడికి బయలుదేరిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను పోలీసు కంట్రోలు రూం దగ్గర అరెస్టు చేసి గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌కి తరలించారు.
నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయాన్నే పోలీసులు పెద్ద ఎత్తున ఆమె నివాసం చేరుకుని కార్యకర్తలు ఎవరూ ఆమెను కలవనీయకుండా చూశారు. ఆమె ఇంటికి వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసివేశారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం జగ్గయ్యపేట నుంచి విజయవాడ బయలుదేరగా మార్గమధ్యలో నిలిపివేసి గృహనిర్బంధంలో ఉంచారు. అనంతరం జగ్గయ్యపేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, ఆయన సతీమణి అమ్మాజి, ఆచంట సునీత తదితరులు పాల్గొన్నారు.
తిరువూరు పట్టణంలోని కుమ్మరిబజార్ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ నేతలు మంగళవారం ప్రత్యేక పూజలు చేయించారు. తెలుగుమహిళల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తిరువూరు బోసుబొమ్మ సెంటర్‌లో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తు నియోజకవర్గ టీఎన్‌టీయూసీ నాయకులు రీలేదీక్షలు చేపట్టారు.
మైలవరం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూజలు నిర్వహించారు.
కొండపల్లిలో టీఎన్‌టీయూసీ విజయవాడ పార్లమెంటు అధ్యక్షుడు సుంకర విష్ణు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టగా ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు పాల్గొన్నారు. మైలవరం మండలం అనంతవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బొందలపాటి సుధాకర్ రావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. నందిగామ పట్టణంలో రిలే దీక్షా శిబిరం వద్ద సోమవారం గణపతికి పూజలు నిర్వహించారు. మంగళవారం కూడా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు దీక్షలలో పాల్గొన్నారు.
కృష్ణాలో ఉధృతమవుతున్న ఉద్యమం
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : గుడ్లవల్లేరు మండలంలో జరిగిన దీక్షలో పాల్గొన్న అంగలూరుకు చెందిన చేబ్రోలు కోటేశ్వరరావు(66) గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. కార్యకర్తలు ఆయనను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యుడు ధ్రువీకరించారు. పెనమలూరు నియోజకవర్గంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడ్లవల్లేరు టీడీపీ కార్యాలయం (రైస్‌మిల్) వద్ద మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో రిలే దీక్షా శిబిరం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గుడివాడ పట్టణం నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈ దీక్షకు తరలివచ్చారు. మాజీమంత్రి కొల్లు రవీంద్ర, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ శాయన పుష్పావతి, వల్లభనేని బాబురావు తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్ద చంద్రబాబు అరెస్ట్టుపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ప్రజలకోసం మీరు, మీతోనే మేము అనే ఫ్లెక్సీలను ప్రద ర్శించారు. వెనిగండ్ల రాము నేతృత్వంలో వేమవరంలోని కొండాలమ్మ గుడిలో, కౌతవరం మసీదులో, గుడ్లవల్లేరు చర్చిలో ప్రత్యేకపూజలు, ప్రార్థనలు చేశారు. గుడివాడ అర్బన్‌బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాజ్జి పలువురు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మచిలీపట్నం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద మంగళవారం నాటికి రిలేదీక్షలు ఎనిమిదోరోజుకు చేరాయి. మాజీమంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ, గొర్రెపాటి గోపిచంద్ ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ముఖానికి నల్లటివస్ర్తాలు కట్టుకుని మహిళలు రిలేదీక్షలో పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్నవారికి కొల్లు రవీంద్ర నిమ్మరసం దీక్ష విరమింపచేశారు. రైలుపేటలోని నాగాంజనేయస్వామి ఆలయంలో టీడీపీ కార్యకర్తలు పూజలు చేశారు. 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈడేపల్లి జోడుగుళ్లలో వేమూరి రామకృష్ణ, పీవీ ఫణికుమార్ పూజలు చేశారు. పక్కనే ఉన్న అమ్మవారి గుడిలో చిత్తజల్లు నాగరాము, అక్కుమహాంతి రాజా తదితరులు చంద్రబాబు విడుదలకోసం ప్రత్యేక పూజలు చేశారు.
పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు వద్దఉన్న వెలగపూడి కోల్డ్‌స్టోరేజీ ఆవరణలో వెలగపూడి శంకరబాబు ఆధ్వర్యంలో మంగళవారం రిలేదీక్షలు చేశారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, అనుమోలు ప్రభాకరరావు, గొట్టిపాటి వెంకటరామకృష్ణప్రసాద్, యార్లగడ్డ సుచిత్ర తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో యనమలకుదురు మండపం సెంటరు నుంచి లాకులమీదుగా జన్మభూమి వంతెన వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. పెదపులిపాకవద్ద కరకట్టపై ముసునూరు నిర్మల్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కాగడాల ప్రదర్శన చేశారు. మంగళవారం ఉదయం పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను పోలీసులు గృహనిర్భందం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు పట్టణపార్టీ నేత్వత్వంలో ఆంజనేయస్వామి గుడిలో పూజలుచేసి 108 కొబ్బరికాయలు కొట్టారు. మండలపార్టీ అధ్యక్షుడు వెనిగండ్ల కుటుంబరావు ఆధ్వర్యంలో కాటూరులో జరిగిన దీక్షలో ఎంపీటీసీ సభ్యురాలు సజ్జా అనూష, పార్టీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు దేవినేని గౌతం, స్మిత సంఘీభావం తెలిపారు. పమిడిముక్కల మండలం గడ్డిపాడు అడ్డరోడ్డువద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడిలో టీడీపీ నాయకులు వెంకటసుబ్బయ్య, నారాయణ తదితరుల నేతృత్వంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టారు. ప్రత్యేక పూజలు చేశారు.
అవనిగడ్డలో గాంధీక్షేత్రం వద్ద దీక్షలో పలువురు ముస్లీంలు దీక్షలో పాలొన్నారు. జిల్ల్లా టీడీపీ రైతువిభాగం అధ్యక్షుడు గోపు సత్యనారాయణ దీక్షా శిబిరంవద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. అవనిగడ్డ ఆంజనేయస్వామి గుడిలో, వినాయకచవితి పందిరిలో మండలి వెంకట్రామ్(రాజా)నేతృత్వంలో ప్రత్యేకపూజలు చేశారు. నాగాయలంక సెంటరులో జనసేన, టీడీపీ నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు. మండవ బాలవర్థిరావు, తరలశిల స్వర్ణ్ణలత, దున్నా రాజేష్, టీడీపీ నాయకుల నేతృత్వంలో ఈ దీక్ష జరిగింది. మండలి వెంకట్రామ్ నాగాయలంక దీక్ష శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలియజేశారు. చల్లపల్లి మండలంలో రామామానగరం నుంచి చల్లపల్లిలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు టీడీపీ నాయకులు, మహిళలు పాల్గొని పాదయాత్ర చేశారు. కోడూరు గంగానమ్మ గుడిలో చందబ్రాబు విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు.
పామర్రులో నియోజకవర్గంలోని పామర్రు మండలం అడ్డాడ వద్ద రిలేదీక్షలు జరిగాయి. పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి తాడిశెట్టి నరేష్ దీక్షలో కూర్చుని సంఘీభావం తెలియజేశారు. దీక్షలో పాల్గొన్నవారికి వారు నిమ్మరసం ఇచ్చి దీక్షవిరమింపజేశారు.
పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండల టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రిలేదీక్ష జరిగింది. పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సాదరబోయిన ఏడుకొండలు, బంటుమిల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కూనపరెడ్డి వీరబాబు, శలపాటి ప్రసాద్, ఒడుగు తులసీరావు, జనసేన నాయకులు ఆర్ సత్యనారాయణ, ముప్పాళ్ల నాగమల్లి తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు విడుదల కోసం టీడీపీ పిలుపు మేరకు దుర్గగుడిలో పూజలు చేసేందుకు బయలుదేరిన కాగిత కృష్ణప్రసాద్ ఆదివారం ఉదయం పోలీసులు గృహనిర్భందం చేశారు.
చంద్రబాబు అరెస్టుతో ఆహారం మానేసిన కార్యకర్త
ఇబ్రహీంపట్నం : చంద్రబాబు అరెస్టు వార్త విన్న దగ్గర నుంచి దాములూరుకు చెందిన సీనియర్ కార్యకర్త ఉప్పులూరి దావీదు పూర్తిగా ఆహారం మానేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు ఆహారం ముట్టనని భీష్మించాడు. మంగళవారం మండల పార్టీ అధ్యక్షుడు రామినేని రాజశేఖర్ దావీదును పరామర్శించారు.