భవానీపురం పీఎస్‌ అంటే భయం భయం..!

ABN , First Publish Date - 2023-03-21T01:10:38+05:30 IST

విజయవాడ పశ్చిమ డివిజన్‌ పరిధిలోని భవానీపురం పోలీసుస్టేషన్‌ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఐ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరి తీరుపైనా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. న్యాయం చేయమని పోలీసుస్టేషన్‌కు వెళ్లిన న్యాయవాదిపైనే ఎదురు కేసు పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ పోలీస్‌ స్టేషన్‌ పనితీరుపై మండిపడుతున్నారు. పొరుగు జిల్లాల్లో సైతం న్యాయవాదులు రోడ్డెక్కారు. దీంతో అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు భవానీపురం పోలీసుస్టేషన్‌ సీఐ ఉమర్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టడంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

భవానీపురం పీఎస్‌ అంటే భయం భయం..!

ఫిర్యాదు చేసిన బాధితులకు బెదిరింపులు

సీఐ ఆధ్వర్యంలో భారీ సెటిల్‌మెంట్లు

అవమానకరంగా మాట్లాడుతున్న సిబ్బంది

న్యాయవాది కేసులో అడ్డంగా బుక్కయిన సీఐ

న్యాయం చేయమని స్టేషన్‌కు వచ్చిన లాయర్‌పైనే కేసు

అధికార పార్టీ వారి అడుగులకు మడుగులు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి/ వన్‌టౌన్‌/విజయవాడ లీగల్‌) : ఈనెల 5వ తేదీన భవానీపురంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉంటున్న ఓ న్యాయవాది కుమార్తె (పదేళ్లు) దగ్గర్లోని పార్కులో ఆడుకుంటుండగా, అదే కాలనీకి చెందిన ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. దీంతో అదేరోజు రాత్రి 10 గంటలకు న్యాయవాది పాపను తీసుకుని భవానీపురం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రాత్రి 12.30 గంటల వరకు ఆయన్ను, పాపను స్టేషన్‌లో కూర్చోబెట్టి ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. ఆ తరువాత దిశ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని పంపేశారు. అదే సమయంలో బాలికను లైంగికంగా వేధించిన వ్యక్తిని పోలీసుస్టేషన్‌కు పిలిపించి న్యాయవాదికి వ్యతిరేకంగా ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. దీంతో సదరు న్యాయవాదిపై ఐపీసీ సెక్షన్‌ 354 కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతోనే ఈ విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి గొల్లపూడికి చెందిన ఓ వైసీపీ నేత అనుచరుడని, ఆ కారణంగానే ఈ కేసును పక్కదారి పట్టించారని తెలుస్తోంది.

అందరూ మోనార్కులే..

భవానీపురం పోలీసుస్టేషన్‌లో కిందిస్థాయి సిబ్బంది మొదలు అధికారుల వరకు అందరి తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ స్టేషన్‌లో పనిచేసే ఎస్‌ఐ ఒకరు సుదీర్ఘకాలంగా ఇక్కడే తిష్ట వేసుకుని ఉండిపోయి చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సెటిల్‌మెంట్లన్నీ ఈయన, సీఐ కలిసి చేస్తుంటారని సమాచారం. బాధితులు ఎవరైనా తమ సమస్యలపై వెళ్తే కిందిస్థాయి సిబ్బంది నుంచి సరైన స్పందన ఉండదని బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌ మొదటి ఫ్లోర్‌లో సీఐ, ఇతర అధికారులు ఉంటారు. వారిని కలవాలంటే ఓ గేటు ఉంటుంది. ఆ గేటు దాటి లోపలికి వెళ్లాలంటే చెప్పులు బయటే విడిచి పెట్టాలి, ఫోన్లు బయటే వదిలేయాలంటూ కానిస్టేబుళ్లు సవాలక్ష నిబంధనలు పెడుతుంటారు. స్టేషన్‌కు వచ్చిన బాధితుల పట్ల మర్యాద, మన్ననలతో ఉండాలని ఉన్నతాధికారులు చెబుతున్నా, వాటిని పక్కనపెట్టి ఇక్కడి సిబ్బంది అవమానకరంగా వ్యవ హరిస్తుంటారని పేరు. సీఐ వ్యవహారశైలి కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు లేదా వారు సిఫారసు చేసిన వ్యక్తులకు కొమ్ముకాసేలా ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరిపైన అయితే ఫిర్యాదులు వస్తాయో వారు అధికార పార్టీకి చెందిన వారైతే వారి ముందే బాధితులను ప్రశ్నించడం, అవమానకరంగా తిట్టడం వంటివి చేస్తుంటారని చెబుతున్నారు. ఈ స్టేషన్‌ పరిధిలో భూ వివాదాలు అధికంగా జరుగుతున్నాయి. సివిల్‌ తగాదాల్లో జోక్యం చేసుకోకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ సీఐ అత్యుత్సాహం ప్రదర్శించి సెటిల్‌మెంట్లు చేస్తుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి స్టేషన్‌లో ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోక పోవడంతో స్పందనలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు.

ఇవిగో ఉదాహరణలు

  • భవానీపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల చాలామందిపై గంజాయి కేసులు నమోదు చేశారు. వీరిలో అమాయక విద్యార్థులు కూడా ఉన్నారని బాధితులు పేర్కొంటున్నారు. భవానీపురానికి చెందిన ఓ డిగ్రీ చదివే యువకుడిని అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంట్లో నుంచి తీసుకెళ్లారు. చిత్రం ఏమిటంటే తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న యువకుడిపై అదేరోజు సాయంత్రం 7 గంటలకు కేజీ వంద గ్రాముల గంజాయి విక్రయిస్తున్నట్లు కేసు నమోదు చేయడం.

  • క్రాంబ్వే రోడ్డులో గొల్లపూడికి చెందిన ఒక వ్యక్తికి ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలాన్ని పక్కనే ఉండే మరో వ్యక్తి ఆక్రమించడానికి ప్రయత్నించి స్థలం చుట్టూ ఉన్న రేకుల ప్రహరీకి వేసిన తాళాన్ని పగలగొట్టారు. దీనిపై బాధితుల ఫిర్యాదు స్వీకరించకుండా అసభ్యకరంగా దూషించి పంపిన ఘనత ఈ సీఐ సార్‌ది. ఎక్కువ మాట్లాడితే గంజాయి కేసు పెట్టి లోపల వేస్తానంటూ ఆక్రమించిన వ్యక్తి ఎదుటే బాధితులకు హెచ్చరికలు జారీ చే యడంతో వారు కిమ్మనకుండా వెళ్లిపోయారు.

  • తనను బెదిరిస్తున్నారంటూ ఇటీవల విద్యాధరపురానికి చెందిన ఓ వృద్ధురాలు జి.కొండూరులోని తన స్థలానికి సంబంధించిన ఒరిజినల్‌ కాగితాలతో కృష్ణలంకకు చెందిన కోగంటి సత్యంపై స్పందనలో సీపీ కాంతిరాణాకు ఫిర్యాదు చేసింది. అంతకంటే ముందు భవానీపురం స్టేషన్‌లోనే ఆమె ఫిర్యాదు చేసింది. అయితే, కేసు నమోదు చేయకుండా ఆమెను తిప్పి పంపేశారు. ఈ ఉదంతం పత్రికల్లో రావడంతో ఎట్టకేలకు కోగంటి సత్యంను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-03-21T01:10:38+05:30 IST