తప్పని జాగారం!
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:54 AM
చిత్రంలో కిక్కిరిసిపోయిన బోగీలు చూసి ప్రయాణాలు పతాక స్థాయిలో జరుగుతున్నాయనుకుంటే పొరపాటే.. ఇటీవల కొంతకాలంగా రైల్వేలో రైళ్ల రద్దుతో ఎదురవుతున్న సమస్య ఇది. ఎప్పుడు ఏ రైలు రద్దు చేస్తారో తెలియని పరిస్థితి. సామాన్య, మధ్య తరగతి వర్గాలు ప్రయాణించే బోగీల కుదింపు ఫలితమే ఈ రద్దీ.. కనీసం నిలుచునే జాగా దొరికితే చాలనుకుంటూ ప్రయాణికులు రేయింబవళ్లు జాగారం చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్, ఛత్తీ్‌సఘడ్ వెళ్లే రైళ్లలో సాధారణంగా ఉండే దృశ్యాలు.. ఇపుడు విజయవాడ స్టేషన్‌లో తరచూ కనిపిస్తున్నాయి. రైళ్లు అందుబాటులో లేక.. తగినన్ని బోగీలు వేయక.. ఏ రైలు వస్తే ఆ రైలు.. ఏ బోగీ పడితే ఆ బోగీలోకి దూరి బతుకు జీవుడా అనుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. కిటకిటలాడిపోతున్న బోగీల్లోకి టీసీలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. రిజర్వేషన్ బోగీల్లోనూ ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఎవరు. అశక్తతతో బతుకు జీవుడా అని సర్దుకుపోతున్న ప్రయాణికులదా.. డిమాండ్‌కు అనుగుణంగా రైళ్లను నడపకుండా సామాన్యుడిని దూరం చేసే అజెండాతో దూసుకుపోతున్న రైల్వే అధికారులదా..
కిటకిటలాడిపోతున్న రైళ్లు
విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-విశాఖపట్నం, విజయవాడ-బెంగళూరు, విజయవాడ-తిరుపతి ఇలా ఏ రైలు చూసినా ఇదే పరిస్థితి. తిరుపతికి వెళ్లే రైళ్లు కూడా తరచూ రద్దు చేస్తున్నారు. వందే భారత్ కోసం రద్దు చేయగా ఉన్న కొద్ది పాటి రైళ్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్లే రైళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఆదివారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఊపిరి సలపనంతగా ప్రయాణికులతో కుక్కేసినట్టుగా ఉంటోంది. ఇలాంటి దుస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ప్రయాణికులు చెబుతున్నారు.
భోగీల కుదింపుతోనూ సమస్యలు
కిటకిట పరిస్థితికి ప్రధాన కారణం బోగీలను కుదించటమే. గతంలో రైలుకు 15 స్లీపర్ బోగీలు, ఆరు జనరల్ బోగీలు ఉండేవి. ఇప్పుడు ఐదు స్లీపర్ బోగీలను తీసుకువచ్చారు. రెండు జనరల్ బోగీలు చేశారు. తాజాగా చాపకింద నీరులా కొన్ని రైళ్లలో మూడు స్లీపర్ బోగీలు, ఒక జనరల్ బోగీ మాత్రమే ఉంచుతున్నారు. మిగిలిన వాటన్నింటినీ ఏసీలుగా చేస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు బోగీలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికంటే ముందు నిరుపేదలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను మూడొంతులు రద్దు చేసి వాటిని ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇలా అప్‌గ్రేడ్ చేసిన రైళ్లలో సామాన్యుల బోగీలను కుదించేస్తున్నారు. బోగీలు తగినన్ని లేక స్లీపర్ కోచ్‌లు కూడా జనరల్‌గా మారిపోయాయి. రిజర్వేషన్ బోగీల్లోకి ప్రయాణికులు చొచ్చుకువస్తున్నారు. ఎనభై మంది ప్రయాణం చేయాల్సిన కంపార్ట్‌మెంట్లలో 350 మందికి పైగా ఉంటున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
మూడు నెలలుగా రైళ్ల రద్దు
బాలాసోర్ దుర్ఘటన నాటి నుంచి మెయింటినెన్స్ పేరుతో రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. మెయింటినెన్స్ వర్క్‌లకు గతంలో ఎప్పుడూ రైళ్లను ఆపింది లేదు. బ్రిడ్జిలు మార్చిన సందర్భంలో కూడా ఒక్క రైలు ఆలస్యం కాకుండా నడిపిన చరిత్ర రైల్వేకు ఉంది. ఇప్పుడే ఎందుకు రైళ్లను రద్దు చేయాల్సి వస్తుందన్న వాస్తవాలు వారే చెప్పాలి. వందేభారత్ రైళ్లకు ఆక్యుపెన్సీ తేవటం కోసం మిగిలిన రైళ్లను బలి చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. వందేభారత్ రైళ్లు వచ్చిన తర్వాతే రైళ్లు ఎక్కువుగా రద్దవుతున్నాయి. వీటికి ఆక్యుపెన్సీ తీసుకు రావటం కోసం ఎంతో డిమాండ్ ఉన్న, ఆదాయం వచ్చే రైళ్లను కూడా రద్దుచేసేందుకు వెనుకాడటంలేదు. ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ మీద వేటు వేసిన తర్వాత, విశాఖ ఎక్స్‌ప్రె్‌సను కూడా బలి చేయటానికి చూస్తున్నారు.