Share News

పోరు బాట!

ABN , Publish Date - Dec 29 , 2023 | 01:12 AM

తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. దీనిలో భాగంగా స్థానిక ధర్నాచౌక్‌లో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడేషన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా గురువారం మూడోరోజు కొనసాగింది.

పోరు బాట!
పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న నేతలు

ధర్నాచౌక్‌, డిసెంబరు 28 : తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. దీనిలో భాగంగా స్థానిక ధర్నాచౌక్‌లో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడేషన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా గురువారం మూడోరోజు కొనసాగింది. తొలుత అధిక సంఖ్యలో వివిధ విభాగాల్లోని మున్సిపల్‌ కార్మికులు స్థానిక ప్రెస్‌క్లబ్‌ నుంచి భారీ ప్రదర్శనగా ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని నినదించారు. ఽసీపీయం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. కొవిడ్‌ సమయంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు మున్సిపల్‌ కార్మికులు ప్రజలకు సేవలందించారని కొనియాడారు. డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేసే మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించలేరా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించేంత వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఒక్కరోజు మున్సిపల్‌ కార్మికులు వారి విధులను ఆపివేస్తే రోడ్లన్ని భ్రస్టు పట్టుకుపోతాయన్నారు. మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రజలను మభ్య పెట్టేందుకు పైపులైన్లు బాగోలేవని అధికారులు చెబుతున్నారన్నారు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటానికి తమ పార్టీతో పాటు ప్రజా, కార్మిక సంఘాలు అండగా ఉంటాయన్నారు. సీఐటీయూ రాష్ట్రనేత సీహెచ్‌ బాబురావు, ఫెడరేషన్‌ నగర నేతలు దోనేపూడి కాశీనాథ్‌, జ్యోతిబాసు అధిక సంఖ్యలో మున్సిపల్‌ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు అమలు కోరుతూ భవన కార్మికుల ధర్నా

ధర్నాచౌక్‌ : బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తూ ఇచ్చిన మెమో 1214ను రద్దు చేసి యఽథాతథంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక ధర్నాచౌక్‌లో గురువారం ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పనిచేయించి పథకాలను అమలు చేసి పెండింగ్‌ క్లెయిమ్‌లు చెల్లించాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులందరికి గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు. ఇసుక, సిమెంట్‌, స్టీల్‌ తదితర నిర్మాణ మెటీరియల్‌ ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నేతలు పిల్లి వెంకటేశ్వరరావు, బి.బెనర్జీ, పుట్టెపు అప్పారావు తదతరులు పాల్గొన్నారు.

జీవో 35 రద్దు కోరుతూ..

ధర్నాచౌక్‌ : పాదయాత్ర సందర్బంగా సీఎం జగన్‌ తమకిచ్చిన హామీ మేరకు కనీస వేతనం ఇవ్వాలని జీవో 35ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ఎయిడెడ్‌ కళాశాల పార్ట్‌టైం లెక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆరిగ జోషి కోరారు. స్థానిక ధర్నాచౌక్‌లో ఈ మేరకు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఎయిడెడ్‌ కళాశాలల పార్ట్‌టైం లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ అధ్యాపకులతో సమానంగా తాము విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లోని వెనుకబడిన విధ్యార్ధులు ఈ ఎయిడెడ్‌ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. మినిమమ్‌ టైమ్‌స్కేల్‌ వర్తింపజేయాలన్నారు. ఎయిడెడ్‌ కళాశాలలను పరిరక్షించాలన్నారు. పలువురు పార్ట్‌టైం లెక్చరర్లు పాల్గొన్నారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ వీరికి సంఘీభావం తెలిపారు.

ముఖ్యమంత్రికి పోస్టు కార్డులు

పంపిన అంగన్వాడీలు

ధర్నాచౌక్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని స్థానిక ధర్నాచౌక్‌లో గురువారం 16వ రోజు నిరసన కార్యక్రమాన్ని అంగన్వాడీలు కొనసాగించారు. ఈ సందర్భంగా పోస్టు కార్డుల ద్వారా తమ సమస్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీక్షా శిబిరాన్ని టీడీపీ మహిళా నేత గద్దె అనురాధ సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలకు న్యాయం చేస్తామన్నారు. కనీస వేతనం పెంచే వరకు తమ పోరాటం ఆగదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. సీఐటీయూ నేతలు సీహెచ్‌.బాబురావు, ఎ.వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

మచిలీపట్నం టౌన్‌ : ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లాకార్యదర్శి ఎ.రమాదేవి అన్నారు. జీతాలు పెంచాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్న సమ్మె 17వ రోజుకు చేరుకుంది. సమస్యలపై ముఖ్యమంత్రికి పెద్ద సంఖ్యలో పోస్ట్‌కార్డులు రాసారు. వివిధ రాజకీయ వర్గాల నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. శిబిరంలో జిల్లా కార్యదర్శి ఎ. రమాదేవి, ప్రాజెక్టు కార్యదర్శి రెజీనారాణి, సీఐటీయూ నాయకులు పోలినాయుడు, బి. సుబ్రహ్మణ్యం, సీహెచ్‌. జయరావులు మాట్లాడారు. ప్రభుత్వం ఉదాసీన వైఖరి కారణంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో కరగ్రహారం మాజీ సర్పంచ్‌ నాగుల్‌మీరా, సీపీఎం నాయకులు కొడాలి శర్మ తదితరులు మాట్లాడారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని..

ధర్నాచౌక్‌ : ఉద్యోగాలను రెగ్యులర్‌ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యాశాఖ సమగ్ర శిక్షాలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి నిరవధిక సమ్మె చేపట్టారు. దీనిలో భాగంగా స్థానిక ధర్నాచౌక్‌లో తొమ్మిది రోజులుగా చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్‌ సెలవులు మంజూరు చేయాలని కోరారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పలువురు సీఐటీయూ నేతలు, ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు టి.విజయ సుగుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 01:12 AM