ఉత్తరం.. దక్షిణం..

ABN , First Publish Date - 2023-03-02T00:13:34+05:30 IST

జిల్లా కేంద్రమైన మచిలీపట్నాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది ఏప్రిల్‌ 4వ తేదీన కృష్ణాజిల్లాను ఎన్టీఆర్‌ విజయవాడ, కృష్ణా జిల్లాలుగా విభజించారు. ఈ నేపథ్యంలో మెరుగైన పరిపాలన అందించేందుకుగాను మచిలీపట్నాన్ని ఉత్తర, దక్షిణ మండలాలుగా విభజిస్తున్నట్టు బుధవారం పేర్కొన్నారు.

ఉత్తరం.. దక్షిణం..

రెండు మండలాలుగా బందరు విభజన

రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ఉత్తర మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, 1-19, 40- 50 వరకు డివిజన్‌లు

దక్షిణ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు, 20 - 39 వరకు డివిజన్‌లు

నెల రోజుల్లోగా కలెక్టర్‌కు అభ్యంతరాలు తెలియజేయవచ్చు

జిల్లా కేంద్రమైన మచిలీపట్నాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది ఏప్రిల్‌ 4వ తేదీన కృష్ణాజిల్లాను ఎన్టీఆర్‌ విజయవాడ, కృష్ణా జిల్లాలుగా విభజించారు. ఈ నేపథ్యంలో మెరుగైన పరిపాలన అందించేందుకుగాను మచిలీపట్నాన్ని ఉత్తర, దక్షిణ మండలాలుగా విభజిస్తున్నట్టు బుధవారం పేర్కొన్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన మచిలీపట్నంలో రెండు తహసీల్దార్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలపగా, తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. మచిలీపట్నం మండలంలోని రెవెన్యూ గ్రామాలను, మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని డివిజన్‌లను ఉత్తర, దక్షిణ మండలాలుగా విభజిస్తున్నట్టు గెజిట్‌ను విడుదల చేశారు. నోటిఫికేషన్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే నెల రోజుల్లోగా కలెక్టర్‌కు తెలియజేసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మండలంగా మచిలీపట్నం మండలం ఉండేది. మచిలీపట్నం మండలంలోని 34 పంచాయతీలు, మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పరిధిలోని 50 డివిజన్‌లు ఒకే తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలో ఉన్నాయి. ఎంతోకాలంగా రెండు తహసీల్దార్‌ కార్యాలయాలుగా విభజించాలని ప్రతిపాదనలు చేసినా ఆచరణలోకి రాలేదు.

ఉత్తర మండలం పరిధిలో..

మచిలీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 50 డివిజన్‌లున్నాయి. మండలంలో 34 పంచాయతీలున్నాయి. నియోజకవర్గంలో మొత్తంగా 2.38 లక్షల మంది జనాభా ఉన్నారు. ఉత్తర మండలంలో పెదపట్నం, కానూరు, తాళ్లపాలెం, గోకవరం, మంగినపూడి, బుద్దాలపాలెం, తపసిపూడి, కొత్తపూడి, పొట్లపాలెం, బొర్రపోతుపాలెం, పోతేపల్లి, గోపువానిపాలెం, అరిసేపల్లి, హుస్సేన్‌పాలెం, కరగ్రహారం, మాచవరం, చిలకలపూడి రెవెన్యూ గ్రామాలు ఉంటాయి. మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 1 నుంచి 19 డివిజన్‌లు, 40 నుంచి 50 డివిజన్‌లు ఉంటాయి. పాత తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలో ఇవి కొనసాగుతాయి. ఉత్తర తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలో 99,354 మంది జనాభా ఉన్నట్టుగా అధికారులు లెక్కలు తేల్చారు.

దక్షిణ మండలం పరిధిలో

బందరు రూరల్‌, ఎస్‌ఎన్‌ గొల్లపాలెం, గుండుపాలెం, రుద్రవరం, కోన, పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, చిన్నాపురం, భోగిరెడ్డిపల్లి, పెదయాదర, నెలకుర్రు రెవెన్యూ గ్రామాలను చేర్చారు. మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 20వ డివిజన్‌ నుంచి 39వ డివిజన్‌ వరకు చేర్చారు. దక్షిణ తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలో 1,39,378 మంది జనాభా ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. దక్షిణ మండలానికి కాలేఖాన్‌పేట, చింతగుంటపాలెం ప్రాంతాల్లో నూతన తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో మచిలీపట్నాన్ని రెండు మండలాలుగా విభజిస్తే మేజర్‌ పంచాయతీగా చిన్నాపురం గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉండేది. సౌత్‌ మండల పరిధిలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 20 డివిజన్‌లను కలుపుతుండటంతో అందరికీ అందుబాటులో ఉండేలా నగర పరిధిలోనే తహసీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-03-02T00:13:34+05:30 IST