బంద్ స్వచ్ఛందం.. సంపూర్ణం
ABN , First Publish Date - 2023-09-12T01:17:07+05:30 IST
ఎమ్మెల్యే గద్దె, బుద్ధాతోపాటు పలువురు టీడీపీ, జనసేన నాయకుల అరెస్టు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సోమవారం సంపూర్ణమైంది. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, విద్యాసంస్థలు ఇతర వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారు. బంద్‌ను అడ్డుకునేందుకు పలుచోట్ల అధికార పార్టీ నేతలు పోలీసులను ఉసిగొల్పి అరెస్టులకు, లాఠీచార్జీలకు పాల్పడ్డా నిరసనలు ఆగలేదు. టీడీపీ, జనసేన శ్రేణులు సీఎం దిష్టిబొమ్మల దహనాలు, నిరసనలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో బంద్‌కు వామపక్షాలు మద్దతు తెలిపాయి.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు
విద్యా సంస్థలు , దుకాణాలు, బ్యాంకుల మూత
144 సెక్షన్ ఉన్నా రోడ్లపైకొచ్చి తెలుగు తమ్ముళ్ల నిరసనలు
టైర్లు, సీఎం దిష్టిబొమ్మల దహనం
బంద్‌కు మద్దతు ప్రకటించిన జనసేన, వామపక్షాలు
ఎమ్మెల్యే గద్దె, బుద్ధాతోపాటు పలువురు టీడీపీ, జనసేన నాయకుల అరెస్టు
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సోమవారం సంపూర్ణమైంది. వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, విద్యాసంస్థలు ఇతర వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారు. బంద్‌ను అడ్డుకునేందుకు పలుచోట్ల అధికార పార్టీ నేతలు పోలీసులను ఉసిగొల్పి అరెస్టులకు, లాఠీచార్జీలకు పాల్పడ్డా నిరసనలు ఆగలేదు. టీడీపీ, జనసేన శ్రేణులు సీఎం దిష్టిబొమ్మల దహనాలు, నిరసనలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో బంద్‌కు వామపక్షాలు మద్దతు తెలిపాయి.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : బెజవాడలో ఉదయమే ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బస్సులను నిలిపివేసేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో బస్టాండ్ వద్దే టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో గద్దె రామ్మోహన్‌ను, టీడీపీ కార్పొరేటర్లను, జనసేన మహిళా నేత రావి సౌజన్యను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బంద్‌ను పర్యవేక్షిస్తున్న బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమ ఇంటి నుంచి ఉమ, కేశినేని చిన్ని బంద్ పర్యవేక్షణకు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు వారు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ‘వైసీపీ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు. జైలుకు పంపుతారు. ఇదే వైసీపీ నాయకుల పాలన తీరు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’ అని చిన్ని పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలిపేందుకు టైర్లు దహనం చేస్తుండగా టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజును పోలీసులు అరెస్టు చేశారు. గద్దె రామ్మోహన్‌తోపాటు పలువురు టీడీపీ నాయకులను అరెస్టు చేసి గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఉన్న వారిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, బాబూరావు తదితరులు పరామర్శించారు.
సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలతో కలిసి మైలవరం పోలీసుస్టేషన్‌కు బయలుదేరిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యాలయం వద్దే ఆయన నిరసనకు దిగారు. సుమారు రెండు గంటలకుపైగా ఉమా నిరసన కొనసాగించారు. జి.కొండూరులో జాతీయ రహదారిపై షామియానా వేసేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. రోడ్డుకు వాహనాలు అడ్డుపెట్టి వాహనాలు వెళ్లకుండా నిలుపుదల చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇబ్రహీంటప్నం దొనబడం వద్ద విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిని టీడీపీ శ్రేణులు దిగ్బంధించాయి.
తిరువూరులో ఆర్టీసీ బస్టాండ్‌లో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులను అడ్డుకున్నారు. పట్టణంలో స్వచ్ఛందంగా హోటళ్లు, వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. స్వామిదాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తిరువూరు టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్ దీక్షకు అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. తిరువూరు బస్టాండ్ వద్ద నిరసనకు దిగిన జనసేన నేత అమ్మిశెట్టి వాసు, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
జగ్గయ్యపేటలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను బంద్‌లో పాల్గొనకుండా పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. దీంతో నాయకులు, కార్యకర్తలే బంద్‌ను పర్యవేక్షించారు. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి.
ఆర్టీసీ బస్సులు నడిపేందుకు పోలీసుల చర్యలు
మొన్న చంద్రబాబు అరెస్టు సందర్భంగా బస్సులను బలవంతంగా నిలుపుదల చేయించిన పోలీసులు... టీడీపీ తలపెట్టిన బంద్ సందర్భంగా బస్సులను ఆగనీయకుండా పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ 144 సెక్షన్ విధించటం, టీడీపీ నేతలను ముందస్తు హౌస్ అరెస్టులు చేయటం, కార్యకర్తలను ఆర్టీసీ డిపోలు, బస్‌స్టేషన్ల ప్రాంతాలకు రాకుండా అడ్డుకోవటంతో బంద్ ప్రభావం ఆర్టీసీ బస్సులపై పెద్దగా పడలేదు. అక్కడికీ పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు బస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళనలు చేయటానికి ప్రయత్నించినా.. పోలీసులు ముందస్తుగా వారిని అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్‌ను పూర్తిగా పాటించాయి. కృష్ణా యూనివర్సిటీలో మధ్యాహ్నం నుంచి విద్యార్థులు బయటకు వచ్చేశారు. బందరు బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరకుండా టీడీపీ శ్రేణులు కొద్దిసేపు అడ్డుకున్నాయి. తరువాత పోలీసుల పర్యవేక్షణలో బస్సు సర్వీసులను నడిపారు. ఎల్‌ఐసీ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. గుడివాడలో ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేశారు. బ్యాంకులు పనిచేయలేదు. గుడివాడ బస్సు డిపో నుంచి బస్సులు తిరగలేదు. పెడనలో ప్రైవేటు పాఠశాలలను, విద్యాసంస్థలను, వ్యాపారసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు.
అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి, నాగాయలంక మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. అవనిగడ్డలో టీడీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు మండలి వెంకట్రామ్(రాజా), జనసేన నేత గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో బంద్ పాటించారు. అవనిగడ్డ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు, మైనారిటీ విభాగం నాయకుడు షేక్ బాబావలి, మరికొందరు యువకులను సోమవారం ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకుని మఽధ్యాహ్నం విడుదల చేశారు. అవనిగడ్డ డిపో నుంచి బస్సు సర్వీసులను పోలీసులు దగ్గరుండి నడిపించారు. నియోజకవ ర్గంలోని ప్రైవేట్ విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు పని చేయలేదు. చల్లపల్లిలో మండలంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను సైతం మూసివేశారు.
పెడనలో మంత్రి ఆదేశం... పోలీసుల అత్యుత్సాహం
పెడనలో మంత్రి జోగి రమేష్ తన కార్యాలయంలో కూర్చుని టీడీపీ, జనసేనల ఆధ్వర్యంలో బంద్ జరగకుండా పర్యవేక్షించారు. మూసివేసిన దుకాణాలను తెరవాలని, ఏం జరిగినా తామున్నామని పోలీసులతో చెప్పించారు. ఉదయం బంద్‌కు సహకరించాలని కోరుతున్న పెడనకు చెందిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తపసిపూడి పోలీస్ ట్రైనింగ్ సెంటరుకు తరలించారు. కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. టీడీపీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాద్‌ను పోలీసులు గృహనిర్భందం చేశారు. జనసేన నాయకులు యడ్ల రామ్‌సుధీర్ కాగితను కలిసి సంఘీభావం తెలిపారు. బంటుమిల్లి మండలం అర్తమూరు, గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. పలుగ్రామాల్లో టీడీపీ జనసేన నాయకులు టైర్లు తగులబెట్టి నిరసన తెలియజేశారు.
పామర్రులో జనసేన నాయకులు శీలం ధనరాజ్, పామర్రు నియోజకవర్గ జనసేన నాయకులు తాడిశెట్టి నరేష్, కూరాటి నిరంజన్, జనసేన ఎంపీటీసీ సభ్యుడు కూనపరెడ్డి సుబ్బారావు, టీడీపీ కార్యకర్తల దాలిపర్తి ప్రసాద్ పలువురు కార్యకర్తలు పామర్రులో తెరచి ఉన్న దుకాణాలు, బ్యాంకుల వద్దకు వెళ్లి బంద్‌కు సహకరించాలని కోరుతుండగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తోట్లవల్లూరులో టీడీపీ బీసీ ఫెడరేషన్ కార్యదర్శి వీరంకి గురుమూర్తిని పోలీసులు గృహనిర్భందం చేశారు. ఇక్కడ వ్రైవేట్ పాఠశాలలను స్వచ్చందంగా మూసివేశారు.
పెనుమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు సెంటరులో టీడీపీ, జనసేన నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసంలో నిరసన దీక్ష చేశారు. కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా తన ఇంటివద్దనే రిలే నిరహార దీక్ష చేశారు. నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను, బ్యాంకులను మూసివేశారు. బస్సులు తిరగలేదు.
చంద్ర బాబు అరెస్టు వార్త విని గుడివాడ మండలం మోటూరుకు చెందిన యార్లగడ్డ శ్రీనివాసరావు గుండెపోటుకు గురై సోమవారం ఉదయం మృతిచెందడంతో అతని మృతదేహా నికి నివాళులర్పించి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తున్న వెనిగళ్ల రామును టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
గుడివాడలో లాఠీచార్జి
గుడివాడలో బంద్ సందర్భంగా వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఆర్టీసీ బస్సును నిలిపేందుకు జనసేన నాయకులు ప్రయత్నించారు. దీంతో టూటౌన్ సీఐ తులసీధర్ జనసేన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, జనసేన నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో పోలీసులు జనసేన కార్యకర్తలను రోడ్డుపై ఈడ్చిపడేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును పోలీసులు గృహనిర్భందం చేశారు.
నందిగామలో ఉద్రిక్తత
నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం నుంచి ఆమెను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆమె ఇంటికి చేరుకున్నారు. సౌమ్యను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చేం దుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో పోలీసులు, టీడీపీ శ్రేణులకు నడుమ తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో సౌమ్య కిందపడిపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. సౌమ్యకు జనసేన, ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు.