బయట ఒకటి... లోపల మరొకటి!

ABN , First Publish Date - 2023-02-07T00:48:54+05:30 IST

బయటకు ఓ పేరుతో బోర్డు కనిపిస్తుంది. ఆ పేరుతోనే అనేక వెబ్‌సైట్లు గూగుల్‌లో ప్రత్యక్షమవుతాయి. బోర్డుపై కనిపించే పేరుకు కార్యాలయంలో జరిగే కార్యకలాపాలకు ఎలాంటి సంబంధమూ ఉండదు. కరపత్రాలపై పథకాలు ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి వెళ్లిపోతాయి.

 బయట ఒకటి... లోపల మరొకటి!

రాజధాని ప్రాంతంలో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ మాయలు

ప్రజల బలహీనతలను అవకాశంగా మార్చుకుంటున్న సంస్థలు

బోర్డులపై పేర్లకు సంబంధంలేని కార్యకలాపాలు

సులభ ఆదాయం నినాదంలో ఇరుక్కుపోతున్న ప్రజలు

బయటకు ఓ పేరుతో బోర్డు కనిపిస్తుంది. ఆ పేరుతోనే అనేక వెబ్‌సైట్లు గూగుల్‌లో ప్రత్యక్షమవుతాయి. బోర్డుపై కనిపించే పేరుకు కార్యాలయంలో జరిగే కార్యకలాపాలకు ఎలాంటి సంబంధమూ ఉండదు. కరపత్రాలపై పథకాలు ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి వెళ్లిపోతాయి. ఈ పథకాలను సామాజిక మాధ్యమాలు మరింత వేగంగా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాయి. అంగడిలో కొంత పెట్టుబడి పెట్టండి, సులభంగా కొండంత ఆదాయాన్ని వెనుకేసుకోండి అన్న నినాదంతో ప్రజల కష్టార్జితాన్ని ఆకర్షిస్తున్నాయి. రాజధాని ప్రాంత జిల్లాలో మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ సంస్థలు అనుసరిస్తున్న విధానం ఇది. కరోనా తర్వాత ప్రజల ఆర్థిక రూపం, సంపాదన స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో సులభంగా ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషించే వారి సంఖ్య పెరిగిపోయింది. దీన్ని మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థలు అవకాశంగా మార్చుకుంటున్నాయి. బయటకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను తలపించేలా బోర్డులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు చాపకింద నీరులా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ పథకాలను అమలు చేస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : ప్రజల నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి, వారిని సంస్థలో సభ్యులుగా చేరడానికి నిర్వాహకులు కంపెనీల ముసుగును బాగా ఉపయోగించుకుంటున్నారు. ట్రేడింగ్‌ కంపెనీల బ్రాండ్లను ఉపయోగించుకుని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే సంకల్పసిద్ధి ఈ కార్ట్‌ అండ్‌ మల్టీలెవర్‌ మార్కెటింగ్‌ సంస్థ. ఈకార్ట్‌ మార్కెటింగ్‌ పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుంచి పెట్టుబడులు ఆకర్షించింది. దీని కోసం ఐదు రకాల పథకాలను ప్రవేశపెట్టింది. ఏడాది క్రితం నుంచి కార్యకలాపాలను విస్తృతంగా పెంచింది. ఇందులో సభ్యులుగా ఉన్న వారికి పథకాలకు సంబంధించిన డబ్బులను కంపెనీకి చెందిన యాప్‌లో ఉన్న వ్యాలెట్‌లో జమ చేసింది. సంకల్పంలో చేరిన సభ్యులకు వారం, నెలవారీగా నగదు అంకెల రూపంలో జమకావడంతో సభ్యుల్లో విశ్వాసం మరింత పెరిగింది. దీన్ని మరింత అవకాశంగా మార్చుకుని ప్రజల నుంచి ఇంకా ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించడానికి సంకల్పసిద్ధి స్కెచ్‌ వేసింది. ఈ సంస్థ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఎప్పటికైనా ఈ పడవ మునిగిపోవడం ఖాయమని గ్రహించారు. బాధితులు రోడ్డు ఎక్కడానికి ముందే విజయవాడ పోలీసులు సంకల్పసిద్ధి నిర్వాహకుల చేతులకు సంకెళ్లు వేశారు. ఇప్పటి వరకు తేలిన లెక్కల ప్రకారం సంకల్పసిద్ధి నిర్వాహకులు సుమారుగా రూ.70కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఈ కంపెనీ తరహాలోనే గుంటూరు కేంద్రంగా ఓ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీ వ్యవహారాలను ప్రారంభించింది. ట్రేడింగ్‌ కంపెనీ పేరును ఉపయోగించుకుని బంగారు ఆభరణాలకు సంబంధించిన పథకాలను అమలు చేస్తోంది. ప్రతినెల సభ్యుల నుంచి ఆయా పథకాలకు ఉన్న పరిమితిని బట్టి నగదును వసూలు చేస్తోంది. నిర్ధిష్ట నెలల తర్వాత చెల్లించిన డబ్బుకు రెట్టింపు గానీ, ఆ మొత్తానికి సంబంధించిన బంగారు ఆభరణం గానీ ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తాలకు రశీదులు ఇస్తున్నారు. ఈ సంస్థలో రాజధాని ప్రాంత జిల్లాలకు చెందిన అనేక మంది సభ్యులుగా ఉన్నారు.

ఏజెన్సీలు ఏం చేస్తున్నట్టు?

ట్రేడింగ్‌ కంపెనీల పేర్లతో ఏర్పాటవుతున్న సంస్థల్లో మేనేజింగ్‌ డైరెక్టర్లు ఉంటున్నారు. వారికి సంబంధించిన బంధువులను, బినామీలను డైరెక్టర్లుగా నియమించుకుంటున్నారు. మూలధన పెట్టుబడిని కోట్ల రూపాయాల్లో చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా నిర్వహించిన సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో కచ్చితంగా సంస్థ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి, అందులో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలను ఆర్వోసీకి అందజేయాలి. ఇది ఎక్కడా జరగడం లేదు. ట్రేడింగ్‌ కంపెనీల పేర్లతో పట్టణాలు, నగరాల్లో బోర్డులు వెలుస్తున్నా వాటి వెనుక జరిగే వ్యవహారాల గురించి ఆరా తీసే తీరిక ఆర్వోసీలోని అధికారులకు ఉండడం లేదు. గూడ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు కచ్చితంగా జీఎస్టీలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. రూ.40 లక్షల లోపు వ్యాపారం చేసే సంస్థలు కాంపొజిషన్‌ కిందకు వస్తాయి. రూ.40 లక్షలకు పైబడిన సంస్థలు రెగ్యులర్‌ కేటగిరీ కిందకు వెళ్తాయి. ఈ ట్రేడింగ్‌ కంపెనీలు జీఎస్టీ, సిన్‌ నంబర్లను తీసుకుంటున్నాయి. జీఎస్టీ అధికారులకు కిరణా, జనరల్‌ స్టోర్స్‌లో సోదాలు నిర్వహించడానికి ఉన్న ఓపిక ఈ ట్రేడింగ్‌ కంపెనీల్లో చేయడానికి ఉండటం లేదు. ఒకపక్క ఆర్వోసీ, జీఎస్టీ అధికారులు తమ జోలికి రారన్న ధీమా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థలను నెలకొల్పేవారిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కారణంగా బయటకు కనిపించేలా ఏదోఒక బోర్డును ఏర్పాటు చేసి అంతర్గతంగా మల్టీలెవల్‌ వ్యవహారాలను నడుపుతున్నారు.

మల్టీలెవల్‌ జోలికి వెళ్లొద్దు

మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థలను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. ప్రజలు ఈ సంస్థలు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ స్కీంలు ఒక పథకం ప్రకారం అమలు చేస్తారు. ఈ స్కీంలో ముందు చేరిన వారికి ఆదాయం అందుతుంది. ఇది ఒక స్థాయి వరకు ఉంటుంది. ఆ తర్వాత సభ్యులుగా చేరిన వారికి చాలా నష్ట ంకలుగుతుంది. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ ఒక మాయ. ప్రజలు ఇలాంటి సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో చేరవద్దు. కొద్దిరోజులపాటు నడిచిన ఈ సంస్థలు ఏదోఒక రోజు బోర్డు తిప్పేస్తాయి. ఫలితంగా చేరిన వాళ్లు, చేర్పించిన వాళ్లు నష్టపోతారు.

- కాంతిరాణా, పోలీసు కమిషనర్‌

Updated Date - 2023-02-07T00:48:55+05:30 IST