CM JAGAN: ముంబై, చెన్నైకి దీటుగా బందరు
ABN , First Publish Date - 2023-05-23T03:42:57+05:30 IST
బందరు పోర్టును అభివృద్ధి చేస్తే ముంబై, చెన్నై మాదిరిగా బందరు ప్రాంతం మహానగరంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
పదవీ గండం భయంతోనేనా?!
24 నెలల్లో పోర్టు పనులు పూర్తి అనుబంధ పరిశ్రమలు ప్రారంభిస్తాం
వేలాదిమందికి ఉద్యోగాలు వస్తాయి
26న అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ
చంద్రబాబు పేదలకు ఒక్కసెంటూ ఇవ్వలేదు
పేదల కష్టాలు ఆయనకు తెలియవు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో జగన్
మచిలీపట్నం, మే 22(ఆంధ్రజ్యోతి): సోమవారం కృష్ణా జిల్లాలో బందరు పోర్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. తపసిపూడిలో సముద్రుడికి పూజలు చేసిన అనంతరం, పోర్టు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. భారత్ స్కౌట్స్ గ్రౌండులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘బందరు పోర్టును అభివృద్ధి చేసేందుకు రూ.5,156 కోట్లతో అంచనాలు రూపొందించాం. పోర్టు పనులను 24 నెలల్లో పూర్తి చేస్తాం. మరో నాలుగువేల ఎకరాల్లో పోర్టు అనుబంధ పరిశ్రమలను రానున్న రోజుల్లో ప్రారంభిస్తాం. వేలాదిమందికి ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయి.
బందరు పోర్టుకు అనుసంధానంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న 216 నంబరు జాతీయ రహదారిని, 7.5 కి.మీ. దూరంలో ఉన్న మచిలీపట్నం–విజయవాడ రైల్వే లైనును కలుపుతున్నాం. రోడ్ కమ్ రైలు మార్గం అభివృద్ధి కోసం 246 ఎకరాల భూమి కొనుగోలు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టుల ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం ఏడాదికి 320 మిలియన్ టన్నులుగా ఉంది. 2025–26 నాటికి 1.16 మిలియన్ టన్నులు అదనంగా పెంచుతాం. రూ.16 వేల కోట్ల అంచనాలతో మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, మూలపేట పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఈ నాలుగు పోర్టుల ద్వారా భవిష్యత్తులో లక్ష మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి’’ అని జగన్ అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి పేరుతో బందరు పోర్టు నిర్మాణం చేయకుండా చంద్రబాబు కాలయాపన చేశారన్నారు. ‘‘మచిలీపట్నం మెడికల్ కళాశాలను రూ.550 కోట్లతో నిర్మిస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబరులో తరగతులు ప్రారంభిస్తాం. నాగుల్‌మీరా సాహెబ్ ఆశీస్సులతో గిలకలదిం డి హార్బర్‌ను రూ.420కోట్లతో నిర్మిస్తున్నాం. 4 నెలల్లో మత్స్యకారులకు అందుబాటులోకితెస్తాం’’ అన్నారు.

అమరావతిలో 50 వేళ ఇళ్ల స్థలాలు
‘‘గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 50వేలమంది పేదల తలరాతను మార్చేలా అమరావతిలో ఈ నెల 26న ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. రాజధానిలో పేదలు పని చేసేవారిగానే ఉండాలని, అక్కడ నివాసం ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఈ తరహా భావాలున్న పార్టీకి, దత్తపుత్రుడికి ఎలా మద్దతు తెలియజేస్తాం? తాను అధికారంలో ఉన్నపుడు పేదలకు ఒక్కసెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు.. పేదలకు సొంతింటి కల నెరవేరుతుంటే నయా పెత్తందారీగా వ్యవహరిస్తున్నారు. దుష్టచతుష్టయం ఆయనకు మద్దతు తెలియజేస్తోంది. పేదల సొంతింటి కలను నేరవేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే... పేదల ఇళ్ల స్థలాలను శ్మశానాలుగా అభివర్ణించి చంద్రబాబు పేదలను అవమానపరిచారు. పేదల కష్టాలు ఆయనకు తెలియవు’’ అని జగన్ అన్నారు.
సీఎం సభలో సగం కుర్చీలు ఖాళీ
● జగన ప్రసంగిస్తుండగానే జనం బయటకు
అవనిగడ్డ టౌన్, మే 22: సభా ప్రాంగణం సగానికి పైగా ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ముఖ్యమంత్రి వేదికపైకి వచ్చిన వెంటనే పలువురు మహిళలు ఉక్కపోత భరించలేక బయటికి వెళ్లిపోయారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. ఆ సమయంలో కొందరు వెళ్లిపోయారు. తర్వాత జగన్ ప్రసంగం ప్రారంభించాక గ్యాలరీల్లో ఉన్నవారు బయటకు వెళ్లిపోయారు. ప్రాంగణంలో 19వ నంబర్ గ్యాలరీ నుంచి 30వ నంబర్ గ్యాలరీ వరకు మొత్తం 11 గ్యాలరీల్లో సభికులు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. చాలినన్ని ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవటంతో ఉక్కపోత భరించలేక మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. బయటకు వెళ్లిపోతున్న వారిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఉక్కపోతలో ఎలా కుర్చుంటామంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు చేసేదేమీ లేక వారికి దారి వదలాల్సి వచ్చింది. మరికొందరు సభా వేదిక వద్దకు కూడా రాకుండా కిలోమీటర్ దూరంలోని వార్డు సచివాలయం, ఇతర బిల్డింగుల వద్ద సేదతీరుతూ ఉండిపోయారు.