గుట్టుగా.. గట్టు దాటించారు!
ABN , First Publish Date - 2023-01-18T01:00:33+05:30 IST
కుర్చీ కనపడకపోతే ఆరాలు తీస్తారు.. కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై వత్తిడి చేస్తారు. చివరకు ఏదో విరిగిపోయిన కుర్చీల లెక్కల్లో రాసేస్తారు. అటువంటిది మచిలీపట్నం కార్పొరేషన్‌కు చెందిన హెల్త్ సెక్షన్ వినియోగించే లక్షల విలువ చేసే రెండు వాహనాలు మాయమైన సంఘటన నగర పాలక సంస్థ కార్యాలయంలో సంచలనం రేకెత్తించింది. చెబితే ఎవరి మీదకు వస్తుందో అని ఎవరికీ తెలియకుండా దాచేశారు.
బాధ్యులపై చర్యలు తప్పవు : కమిషనర్
మచిలీపట్నం టౌన్ : కుర్చీ కనపడకపోతే ఆరాలు తీస్తారు.. కింది స్థాయి అధికారులు, సిబ్బందిపై వత్తిడి చేస్తారు. చివరకు ఏదో విరిగిపోయిన కుర్చీల లెక్కల్లో రాసేస్తారు. అటువంటిది మచిలీపట్నం కార్పొరేషన్‌కు చెందిన హెల్త్ సెక్షన్ వినియోగించే లక్షల విలువ చేసే రెండు వాహనాలు మాయమైన సంఘటన నగర పాలక సంస్థ కార్యాలయంలో సంచలనం రేకెత్తించింది. చెబితే ఎవరి మీదకు వస్తుందో అని ఎవరికీ తెలియకుండా దాచేశారు.
స్పందనలో ఫిర్యాదుతో వెలుగులోకి..
ఒక వ్యక్తి వాహనాల మిస్సింగ్‌పై కలెక్టరుకు స్పందనలో ఫిర్యాదు చేయడమే కాకుండా సమాచార హక్కు చట్టం కింద నగర పాలక సంస్థ కమిషనర్ జి.చంద్రయ్యకు అర్జీ సమర్పించారు. దీంతో అధికారులు వాహనాల లెక్కలు తీసారు. దాంతో చెత్త తరలించే రెండు వాహనాల లెక్క తేలలేదు. ఈ స్కాం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెల్త్ ఆఫీసరు యార్లగడ్డ బాలసుబ్రహ్మణ్యం ప్రాథమిక విచారణలో వాహనాలు కనబడటంలేదని తేలింది. ఆ రెండు వాహనాలపై ఎవరికి వారు తెలియదని నెట్టుకుంటూ వచ్చారు. ఈ లెక్కలు ఇంజనీరింగ్ సెక్షన్ పరిధిలోనివని హెల్త్ సెక్షన్ వారు అంటే, హెల్త్ సెక్షన్ వారిదని ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ అంటున్నారు. వాహనాల లెక్కలు చూసే హెల్త్ ఇన్‌స్పెక్టరు విలాన్ చనిపోవడంతో వివరాలు తెలియవని కొందరు కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. మరో హెల్త్ ఇన్‌స్పెక్టరు రఘు రిటైరయ్యారు. గత కమిషనర్లు శివరామకృష్ణ, ఎంఈ త్రినాథ్ బదిలీ అయ్యారు.
విజిలెన్స్ విచారణ..
ఈ స్కాం విజిలెన్స్ దృష్టికి వెళ్లడంతో.. అధికారుల సూచన మేరకు నగరపాలక సంస్థ పరిధిలో చెత్తను తొలగించే రెండు కాంపాక్ట్ లారీలు అదృశ్యంపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఇటీవల నగరపాలక సంస్థ కమిషనర్‌గా జి.చంద్రయ్య, ఎంఈగా పి.శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. గత రిజిస్టర్లపై దృష్టి సారించగా.. 2017లో రెండు లారీలు మరమ్మతులకు వచ్చాయి. ఆ సమయంలో పనిచేసిన అధికారులు ఒకరు చనిపోతే, కొందరు రిటైరయితే, మరి కొందరు బదిలీ అయ్యారు. దీనిపై ప్రస్తుతం ఏఈగా ఉంటున్న వెంకటేశ్వరరావును అధికారులు విచారిస్తున్నారు. ఏదైనా వాహనం రిపేర్లకు ఇస్తే ఎప్పుడు ఇచ్చిందీ, ఎవరికీ ఇచ్చిందీ రిజిస్టర్లలో నమోదు చేస్తారు. రిజిస్టర్లలో వాహనాల వివరాలు నమోదయ్యాయా లేదా అనే అశంపై విచారణాధికారి శ్రీనాథ్ విచారణ జరుపుతున్నారు. రిపేరు చేసిన కాంట్రాక్టర్‌కు ఎంత చెల్లించినది, ఆ వాహనాలను తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకున్నది అధికారుల రికార్డుల పరిశీలనలో ఉంది.
రిజిస్టర్లు మాయం..!
వాహనాలు ఏ వార్డులో తిరుగుతున్నాయో రిజిస్టర్లలో నమోదు చేస్తారు. ఈ రెండు వాహనాలు రిపేరుకు ఎవరికి ఇచ్చారు, రిపేరు చేయించిన తరువాత తిరిగి తీసుకు వచ్చామని ఏఈ వెంకటేశ్వరరావు అంటున్నారు. అయితే తిరిగి వచ్చిన వాహనాలు ఎవరికి విక్రయించారు.. అపహరణకు గురయ్యాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. దీనికి చెందిన కొన్ని రిజిష్టర్లు కనబడటం లేదని నగర పాలక సంస్థ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్కాం నుంచి తప్పించుకునే మార్గాలను కొందరు అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం - కమిషనర్ చంద్రయ్య
చెత్త తరలించే వాహనాలు కనబడకపోవడం వాస్తవమే.. దీనిపై ఎంఈ పి.శ్రీకాంత్‌ను విచారణాధికారిగా నియమించాం. నివేదికను ఒకటి రెండు రోజుల్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.