పోలీసుల అదుపులో ఏఆర్ కానిస్టేబుల్!
ABN , First Publish Date - 2023-02-03T00:42:58+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దూషించాడన్న ఆరోపణతో ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సేకరించిన సమాచారం ప్రకారం.
నందిగామ, ఫిబ్రవరి 2 : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దూషించాడన్న ఆరోపణతో ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. సేకరించిన సమాచారం ప్రకారం.. చిల్లకల్లు స్టేషన్ పరిధిలో హైవే పెట్రోలింగ్ విభాగంలో తన్నీరు వెంకటేశ్వరరావు ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గౌరవరంలోని ఒక హోటల్ వద్ద తరచుగా పెట్రోలింగ్ సిబ్బంది టీ తాగుతారు. ఇటీవల గౌరవరం గ్రామానికి చెందిన సామినేని సతీష్ టీస్టాల్ వద్ద ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావును బాగున్నారా అని పలకరించాడు. మీకు జీతాలు వస్తున్నాయా సార్.. జగన్ ఇస్తున్నాడా అని సతీష్ ప్రశ్నించడంతో వస్తున్నాయని వెంకటేశ్వరరావు సమాధానం ఇచ్చాడు.. ఈ క్రమంలో ప్రభుత్వంపై బూతులు మాట్లాడాడు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న కానిస్టేబుల్ జగన్‌పైన వ్యాఖ్యలు చేస్తుండగా.. తన సెల్ వీడియాను ఆన్‌చేసి ఉంచిన సతీష్ ఆ మాటలను రికార్డు చేశాడు. ఆ వీడియో పోలీసు ఉన్నతాధికారులకు పంపడంతో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును గురువారం అదుపులోకి తీసుకొని ఏసీపీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ ఘటన ఇటు ప్రజల్లోనూ, అటు పోలీసుల్లోనూ కలకలం రేపింది. ఎవరో రెచ్చగొట్టేలా మాట్లాడి ఉద్దేశపూర్వకంగానే వెంకటేశ్వరరావును ఇరికించారని, దీనిపై ఉన్నతాధికారులు ఇంతలా స్పందించడం ఏమిటని దిగువస్థాయి పోలీసులు ఆవేదన చెందుతున్నారు. వైసీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్న సతీ్‌షకు కానిస్టేబుళ్ల జీతాల గురించి అడగాల్సిన అవసరం ఏమిటని, దీని వెనుక ఏదో కథ ఉందని చర్చ సాగుతుంది. కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు నిజాయితీ పరుడని, కావాలనే ట్రాప్ చేసి ఉంటారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. వెంకటేశ్వరరావు అరెస్టు విషయం బయటకు రావడంతో ఆయన్ను నందిగామ స్టేషన్ నుండి వేరే ప్రాంతానికి తరలించారు.