అమరావతిని అభివృద్ధి చేసేవారికే పట్టం..!

ABN , First Publish Date - 2023-07-20T01:03:00+05:30 IST

అమరావతి రైతులు పిడికిలి బిగించారు. రాజధానిని కర్కశంగా కూల్చేస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అడుగడుగునా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నగరంలో బుధవారం భారీ ధర్నా నిర్వహించారు. ఉద్యమ రైతులతో పాటు అన్ని పార్టీల నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

అమరావతిని అభివృద్ధి చేసేవారికే పట్టం..!
ధర్నాలో నాయకుల సంఘీభావం

అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమైనది

ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా రాజధాని అమరావతే

సీఎం జగన్‌ ఆంధ్ర గడాఫీ : దేవినేని ఉమా

భూ అక్రమాల కోసమే విశాఖ రాజధాని : వడ్డే

త్వరలో అమరావతికి ప్రియాంకాగాంధీ : సుంకర పద్మశ్రీ

ధర్నాచౌక్‌, జూలై 19 : రాష్ట్రాన్ని రాజఽధానిలేని రాష్ట్రంగా మార్చిన పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని, రాబోయేది అమరావతిని అభివృద్ధి చేసే ప్రభుత్వమని వక్తలు ఢంకా మోగించి మరీ చెప్పారు. అమరావతి అసైన్డ్‌ రైతుల వార్షిక కౌలు నిలుపుదల, భూపత్రాల పరిశీలన నెపంతో కౌలు చెల్లింపులో జాప్యం, ఎల్‌పీఎస్‌ లే అవుట్ల కనీస మౌలిక వసతుల కల్పనలో సీఆర్డీయే, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌లో బుధవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుందని దీన్ని మార్చే అధికారం ఎవరికీలేదని వక్తలు ఉద్ఘాటించారు. 1,300 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమైందని కొనియాడారు. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న అమరావతి మహిళా రైతులను అభినందించారు. రాష్ట్రం ఒక మూర్ఖుడి పాలనలో ఉందని ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధికి కృషి చేసే పార్టీలను రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.

  • మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్‌ను ఆంధ్ర గడాఫీగా అభివర్ణిం చారు. ప్రాజెక్టుల నిర్మాణాల్లో రూ.వేల కోట్ల అవినీతి జరుగుతోందన్నారు. సీఆర్‌డీయే చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం చేపట్టాలన్నారు. అమరావతిలో పేదలకు నిర్మించిన టిడ్కో ఇళ్లను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, దీంతో ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన రైతులు కౌలు కోసం కూడా న్యాయస్థానాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయకుండా కక్ష సాధిస్తున్నారన్నారు.

  • మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ సీఎం జగన్‌ తన తండ్రి హయాంలో విశాఖపట్నంలో బినామీ పేర్లతో కొన్న భూముల రేట్లు పెంచుకునేందుకే విశాఖ రాజధాని అని ప్రకటించారన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అమరావతి అంశంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారం అయ్యేదన్నారు.

  • కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఉద్యమానికి మద్దతుగా త్వరలో తమ పార్టీ నాయకురాలు ప్రియంకా గాంధీ అమరావతి సందర్శిస్తారన్నారు. జేఏసీ నేత పువ్వాడ సుధాకర్‌ మాట్లాడుతూ అమరావతి రైతులు, మహిళలను కించపరిచిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి, బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటయ్య, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, రైతు సంఘం నేత కృష్ణయ్య, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్‌, గోపాలకృష్ణ, జేఏసీ నేతలు, అధిక సంఖ్యలో అమరావతి రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-20T01:03:00+05:30 IST