‘వరి’ంచేనా..

ABN , First Publish Date - 2023-06-01T00:14:05+05:30 IST

జిల్లాలో రైతులు సార్వా సాగుకు సిద్ధమవుతున్నారు. మేలైన వరి వంగడాల కోసం ఎదురు చూస్తున్నారు. వరి వంగడాలను వ్యవసాయ శాఖాధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేదు. సార్వా సాగుకు పూర్తి ప్రణాళికను రూపొందించలేదు. అధికారులందరూ బదిలీల హడావుడిలో మునిగిపోయారు. ఇంకా పచ్చిరొట్ట విత్తనాలు కూడా పంపిణీ చేయలేదు. దీంతో రైతులు వరి వంగడాల కోసం వేట మొదలు పెట్టారు. జూన్‌ ప్రారంభమవుతున్నా ఇంకా సాగునీటి కాల్వల ఆధునికీకరణ పనులు పూర్తికాకపోడం గమనార్హం.

‘వరి’ంచేనా..

మేలైన వరి వంగడాల కోసం రైతుల ఎదురుచూపులు

సాగుకు సమాయత్తం

జిల్లాలో లక్షా 58 వేల హెక్టార్లలో సాగు అంచనా

జిల్లాలో రైతులు సార్వా సాగుకు సిద్ధమవుతున్నారు. మేలైన వరి వంగడాల కోసం ఎదురు చూస్తున్నారు. వరి వంగడాలను వ్యవసాయ శాఖాధికారులు పూర్తిస్థాయిలో సిద్ధం చేయలేదు. సార్వా సాగుకు పూర్తి ప్రణాళికను రూపొందించలేదు. అధికారులందరూ బదిలీల హడావుడిలో మునిగిపోయారు. ఇంకా పచ్చిరొట్ట విత్తనాలు కూడా పంపిణీ చేయలేదు. దీంతో రైతులు వరి వంగడాల కోసం వేట మొదలు పెట్టారు. జూన్‌ ప్రారంభమవుతున్నా ఇంకా సాగునీటి కాల్వల ఆధునికీకరణ పనులు పూర్తికాకపోడం గమనార్హం.

మచిలీపట్నం టౌన్‌ : జిల్లాలో ఈ సార్వాలో లక్షా 58 వేల హెక్టార్లలో వరి సాగుకానుంది. ఇందుకు 8,936 క్వింటాళ్ల వరి వంగడాలు కావాల్సి ఉంది. వ్యవసాయ శాఖ 6,690 క్వింటాళ్లు అందించేందుకు సిద్ధమవుతోంది. షాపుల్లో దొరికే వరి వంగడాల కన్నా రైతులు నిల్వ చేసిన మేలైన వరి వంగడాలు సార్వా పంటకు అనువుగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది రైతుల వద్ద మేలైన వరి వంగడాలు తక్కువగా ఉన్నందున సబ్సిడీపై వ్యవసాయ శాఖ ఇచ్చే వరి వంగడాలపై ఆధారపడక తప్పడం లేదు.

వ్యవసాయ శాఖ రైతుల అవసరాలకు సరిపడా వరి వంగడాలు ఇచ్చే పరిస్థితిలో లేదు. రైతు భరోసా కేంద్రం వద్ద నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే వరి వంగడాలు, ఎరువులు ఇస్తామని ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. గతేడాది నాణ్యత గల విత్తనాలు లభించక రైతులు అగచాట్లు పడ్డారు. బీపీటీ 5704, ఎంటీఎం 1061 విత్తనాలు సాగుచేసుకోవాలని వ్యవసాయశాఖాధికారులు సూచిస్తున్నారు. అయితే చౌడు భూముల్లో తుపానులను తట్టుకునే వరి వంగడాలను రైతులు ఆశిస్తున్నారు. ఇందుకు వ్యవసాయ పరిశోధనా క్షేత్రం, ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం రైతులకు కావలసిన వరి వంగడాలను సిఫార్సు చేయవలసి ఉంది. జిల్లాలో వేరుశనగ, చెరకు, పసుపు పండించే రైతుల సమస్యలపైనా సార్వా వార్షిక ప్రణాళికలో పరిష్కారాలను పొందుపరచవలసి ఉంది.

విత్తనాల కోసం ఇబ్బందులు

రైతులు వరి వంగడాలు ఆర్బీకేల్లో తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నప్పుడు సెల్‌ఫోనులో ఓటీపీ వస్తుందని చెపుతున్నారు. గతేడాది సార్వా సీజన్‌లో చదువుకోని రైతులు, ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌లు లేని రైతులు వరి వంగడాలు తీసుకునేందుకు పడిగాపులు పడాల్సి వచ్చింది. ఏరువాక రాకమునుపే రైతులకు పచ్చిరొట్ట ఎరువు, పిల్లిపెసర, జీలుగ విత్తనాలు అందిస్తే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. జూన్‌ మొదటి వారంలో రైతులు నారుమళ్లు పోసుకుంటే జులైలో ఊడుపులకు అవకాశముంటుంది.

- గోపు సత్యనారాయణ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు

పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తాం

రైతులకు ముందుగా పచ్చిరొట్ట ఎరువులకు కావలసిన విత్తనాలు సరఫరా చేస్తాం. 50 శాతం సబ్సిడీతో ఇస్తాం. జీలుగ 3655, జనుము 680, పిల్లిపెసర 1530 క్వింటాళ్లు ఇచ్చేందుకు సిద్ధం చేశాం. సార్వాకు 89,368 క్వింటాళ్ల ఎరువులు రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఆర్‌బీకేల ద్వారా 31,364 క్వింటాళ్లు అందించదలిచాం. మిగిలిన ఎరువులను రైతులు బహిరంగ మార్కెట్‌లో కొనుక్కుంటారు. ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తాం. ఈ సార్వాలో రైతులకు కావలసిన వరి వంగడాలు సిద్ధం చేస్తున్నాం. విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు వాడవద్దని చెబుతున్నాం. కాలువలు విడుదలయ్యే నాటికి వరి వంగడాలు, ఎరువులు ఆర్‌బీకేల్లో ఉంచుతాం.

- ఎం.విజయ భారతి, జేడీ, వ్యవసాయ శాఖ

Updated Date - 2023-06-01T00:14:05+05:30 IST