85 శాతం పోలింగ్ లక్ష్యంగా అవగాహన
ABN , Publish Date - Dec 22 , 2023 | 01:21 AM
వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 85 శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు తెలిపారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు వద్ద గురువారం నగరపాలక సంస్థ అధ్వర్యంలో కలెక్టర్ నేతృత్వంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ర్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కింద అవగాహన కార్యక్రమం జరిగింది.
కృష్ణలంక, డిసెంబరు 21 : వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో కనీసం 85 శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు తెలిపారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు వద్ద గురువారం నగరపాలక సంస్థ అధ్వర్యంలో కలెక్టర్ నేతృత్వంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ర్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కింద అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీని కలెక్టర్ దిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ ఆదితిసింగ్, వాకర్స్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈసీఐ, రాష్ట్ర చీఫ్ ఎలక్ర్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటరు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2019లో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సగటు పోలింగ్ శాతం 85 కాగా, విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో 66 శాతంగా వుందని, అందువల్ల దీనిని కూడా 85 శాతానికి చేర్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసి, ఓటు హక్కును వినియోగించుకొనేలా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 కింద ఓటర్ల జాబితా ప్రక్రియ దాదాపు పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్సు) కేవీ సత్యవతి, కలెక్టరేట్, వీఎంసీ అధికారులు, సిబ్బంది, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ర్టానిక్ ఓటింగ్ మిషన్‌పై పూర్తి అవగాహన
ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రం సహాయంతో ఎలాంటి తడబాటు లేకుండా ఓటు వేయడంపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దిల్లీరావు తెలిపారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈవీఎంలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఓటింగ్ ప్రక్రియలో ఓటు వేసి ఈవీఎం, వీవీప్యాట్‌లపై ఏమైనా సందేహాలున్నా సిబ్బంది సహాయంతో నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. మొబైల్ వాహనాల ద్వారా కేర్ అండ్ షేర్ స్కూల్, దేవినేని వెంకటరమణ స్కూల్‌లో 234 వార్డ్ సెక్రటేరియట్ న్యూ రాజరాజేశ్వరీపేట, కుమార్ టీ స్టాల్ సెంటర్ న్యూ రాజరాజేశ్వరీపేట పరిసర ప్రాంత ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ సెల్‌లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.