యువగళం.. జనబలం

ABN , First Publish Date - 2023-06-03T01:37:03+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు అడుగడుగునా జనబలం పెరుగుతోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో

యువగళం.. జనబలం

అడుగడుగునా లోకేశ్‌కు జననీరాజనం

మైదుకూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర

ప్రొద్దుటూరు/ప్రొద్దుటూరు రూరల్‌/అర్బన్‌, చాపాడు, జూన్‌ 2 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు అడుగడుగునా జనబలం పెరుగుతోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో జనం అపూర్వ స్వాగతం పలికారు. శుక్రవారం పాదయాత్ర మైదుకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇక్కడా జనం విశేషంగా తరలి వచ్చా లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు పిల్లా పెద్దా అని లేకుండా అందరూ పాదయాత్రలో పాలుపంచుకున్నారు. తమ కష్టాలను విన్నవించారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, తానున్నానని భరోసా కల్పిస్తూ లోకేశ్‌ పాదయాత్ర సాగింది.

కొత్తపల్లెలోని విడిది కేంద్రం వద్ద మొదట వివిధ వర్గాల వారితో నారా లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పాదయాత్ర చేపట్టారు. సాయంత్రానికి చాపాడు మండలానికి చేరుకుంది. నాగులపల్లె, ఉప్పరపల్లె మధ్య టీడీపీ శ్రేణులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ నేతృత్వంలో ఘనంగా స్వాగతం పలికారు. గజమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా నాగులపల్లె ఖాదర్‌బాద్‌ వాసులు లోకేశ్‌తో మాట్లాడుతూ తాము సింగిల్‌ లేన్‌ రోడ్డుతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. లోకేశ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆయన సామంతరాజులకు దాచుకోవడం , దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ రోడ ్లపై లేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే నాగులపల్లె రోడ్డును విస్తరిస్తామని హామీ ఇచ్చారు. కేసీ కెనాల్‌ ఆయకట్టు చివరిలో చాపాడు, ఖాదర్‌బాద్‌ పొలాలు ఉన్నాయని, కాల్వ ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో చెరువునీరు అందక ఇబ్బందులు పడుతున్నామంటూ ఖాదర్‌బాద్‌ రైతులు వాపోయారు. లోకేశ్‌ స్పందిస్తూ కుందూ నది పక్కన ఉన్న రైతులు సాగునీటికి ఇబ్బంది పడడం దురదృష్టకరమన్నారు. పరిశీలించి ఇక్కడి రైతులకు నీరందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నదిలో మట్టిని అమ్ముకుంటున్నారు

విస్తరణ పేరుతో కుందూ నదిని ప్రభుత్వం ప్రముఖ సంస్థకు కాంట్రాక్టును ఇవ్వగా కొందరు స్థానిక వైసీపీ నేతలు సబ్‌ కాంట్రాక్టు వేస్తూ మట్టి, ఇసుకను అమ్ముకుంటున్నా చర్యలు లేవని చాపాడు మండలం సీతారాంపురం రైతులు లోకేశ్‌కు వివరించారు. నది వెంట ఉన్న రైతుల విద్యుత్‌ మోటర్లు, పైపులైన్లు ఇతర సామగ్రిని ధ్వంసం చేస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. నారాలోకేశ్‌ స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ అండ్‌ కోకు ఇసుక మట్టి అమ్మకాలపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదన్నారు. గడిచిన నాలుగేళ్లలో బినామీ సంస్థలను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి ఇసుక ద్వారా పదివేల కోట్లు దోచుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యువగళం పాదయాత్రలో యువనేత లోకేశ్‌ను కలిసిన చియ్యపాడు గ్రామ దళితులు కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గిట్టుబాటు ధర లేదు

కేసీ కెనాల్‌ ద్వారా వస్తున్న సాగునీటిని ఆధారంగా చేసుకుని వరి, పసుపు పండిస్తున్నామని, అయితే పంటల దిగుబడులకు గిట్టుబాటు ధర రావడంలేదని విశ్వనాథపురం రైతులు లోకేశ్‌కు వివరించారు. లోకేశ్‌ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే అన్నిరకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. విశ్వనాఽథపురంలో శాశ్వత మార్కెట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆర్‌.శ్రీనవాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, భూపేశ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నేటి పాదయాత్ర ఇలా..

ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1470.4 కి.మీ

శుక్రవారం నడిచిన దూరం 13.8 కిమీ

115వరోజు పాదయాత్ర మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సాగనుంది.

4గంటలకు విశ్వనాఽథపురం విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం

4.10కి మొరపల్లి క్రాస్‌ వద్ద స్థానికులతో సమావేశం

4.50కి మైదుకూరు మున్సిపల్‌ ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం

5గంటలకు మైదుకూరు రాయల కూడలిలో బహిరంగసభ

6.15కు మైదుకూరు ఆర్టీసీ బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతి

6.20కి మైదుకూరు శ్రీనివాసనగర్‌లో స్థానికులతో సమావేశం

6.25కు మైదుకూరు బాబా గుడి వద్ద రైతులతో సమావేశం

7.10కి భూమయ్యపల్లి గుంటూరు కొట్టాల వద్ద స్థానికులతో మాటామంతి

7.50కి భూమయ్యపల్లిలో రైతులతో సమావేశం

8.10కి భూమయ్యపల్లి విడిది కేంద్రంలో బస

Updated Date - 2023-06-03T01:37:03+05:30 IST