దొంగనోట్ల కేసులో వైసీపీ నాయకురాలు రజని అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-01-26T00:37:12+05:30 IST

దొంగనోట్ల చలామణిలో వైఎస్సార్‌ కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నాయకురాలు రసపుత్ర రజని కర్ణాటకలో పట్టుబడ్డారు. ఈ నెల 19న బెంగళూరులో ఆమెను కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా

దొంగనోట్ల కేసులో వైసీపీ నాయకురాలు రజని అరెస్ట్‌

నిందితురాలు రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌

బెంగళూరులో అరెస్ట్‌ చేసిన పోలీసులు

జిల్లా వైసీపీలో కలకలం

ప్రొద్దుటూరు అర్బన్‌, జనవరి 25 : దొంగనోట్ల చలామణిలో వైఎస్సార్‌ కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నాయకురాలు రసపుత్ర రజని కర్ణాటకలో పట్టుబడ్డారు. ఈ నెల 19న బెంగళూరులో ఆమెను కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా వైసీపీలో కలకలం రేగింది. ఈ కేసులో మరో నిందితుడుప్రొద్దుటూరులో సూపర్‌ బజార్‌ రోడ్డుకు చెందిన చరణ్‌సింగ్‌ను కూడాబెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రజనీ వద్ద 4లక్షల విలువ గల 500 దొంగనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తెలిసిన సమాచారం మేరకు మరో ప్రదేశంలో దాచిన మరో 40 లక్షల దొంగనోట్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డికి అనుంగు శిష్యురాలిగా ఉంటూ దొంగనోట్ల కేసులో దొరకడంతోఇక్కడ రాజకీయ వేడి రాజుకుంది. గతంలోనూ ఈమె ప్రొద్దుటూరులో కొందరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఐపీ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న వ్యక్తి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కుంభకోణంలోఅరెస్ట్‌ అయ్యారు. ఇప్పుడు ఈమె అరెస్టు కావడం ప్రొద్దుటూరులో సంచలనంగా మారింది.

దొంగనోట్ల కేసులతో సంబంధాలపై ఆరా..

జిల్లాలో ఇటీవల ఎక్కువగా ప్రొద్దుటూరు, మైదుకూరు, దువ్వూరు ప్రాంతాల్లో దొంగనోట్ల చలామణి జరిగింది. ఈ వ్యవహారంలో పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో జరిగిన దొంగనోట్ల సరఫరాలో రజనీ పాత్రకూడా ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే అండ ఉందంటున్న టీడీపీ

దొంగనోట్ల వ్యవహారంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే రాచమల్లుకు తెలిసే రజని దొంగనోట్లను చలామణి చేశారని అన్నారు. రజనీపై అనేక ఆరోపణలున్నా ఆమెకు బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పదవిని ఎమ్మెల్యే సిఫారసు చేసి ఇప్పించారన్నారు. దొంగనోట్ల చలామణిలో ఎమ్మెల్యే రాచమల్లు కీలకంగా ఉన్నారని ఆయనపై సీబీఐ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

నేరప్రవృత్తి కలిగిన వారిని ఈ పార్టీలో కొనసాగించే ప్రయత్నం చేయను

- రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే

నేర ప్రవృత్తి కలిగిన వారిని, నేర చరిత్ర కలిగిన వారిని వైసీపీ పార్టీలో కొనసాగించే ప్రయత్నం నేను చేయను. రజనీపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆమెపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాం. కేవలంఆమె కుమారుడిని బెంగళూరు కాలేజీలో చేర్పించడానికని వెళ్లిందని మాకు సమాచారం ఉంది. దురదృష్టవశాత్తు ఆమె ఇందులో ఇరుక్కుని ఉంటే ఆమెపక్షాన కొట్లాడతాం. పార్టీపరంగా న్యాయవ్యవస్థ ద్వారా సహాయం చేస్తాం. ప్రతిపక్షాలు మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2023-01-26T00:37:12+05:30 IST