భార్య కాపురానికి రాలేదని.. సెల్‌టవర్‌ ఎక్కిన భర్త

ABN , First Publish Date - 2023-05-26T23:24:16+05:30 IST

అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాలేదని.. జీవితం మీద విరక్తి చెందిన భర్త సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. సుమారు ఒకటిన్నర గంటపాటు హైడ్రామా చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.

భార్య కాపురానికి రాలేదని.. సెల్‌టవర్‌ ఎక్కిన భర్త
సెల్‌టవర్‌పై ఉన్న కృష్ణమూర్తి

గంటన్నర పాటు హైడ్రామా.. తీవ్ర ఉద్రిక్తత

భార్య వచ్చాక తిన్నగా దిగొచ్చిన భర్త

ఇద్దరికీ కౌన్సెలింగ్‌ చేసిన పోలీసులు

మదనపల్లె క్రైం, మే 26: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాలేదని.. జీవితం మీద విరక్తి చెందిన భర్త సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. సుమారు ఒకటిన్నర గంటపాటు హైడ్రామా చోటుచేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. తీరా భార్య అక్కడికి వచ్చాక.. ఆమెను చూసి తిన్నగా కిందికి దిగొచ్చాడు. ఈ సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పోతబోలు పంచాయతీ పాలెంకొండకు చెందిన ఇర్రి కృష్ణమూర్తి (38) కొంతకాలంగా కోయంబత్తూరులోని ఓ నూనెమిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలున్నారు. చంద్రకళ మదనపల్లెలోని డీమార్ట్‌ దుకాణంలో వర్కర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. కృష్ణమూర్తి రోజూ తాగొచ్చి భార్యను వేధిస్తున్నాడు. పైగా అనుమానిస్తున్నట్లు భార్య చెబుతోంది. ఈక్రమంలో వారంరోజుల కిందట ఇద్దరి మధ్య గొడవ జరగడంతో చంద్రకళ అలిగి మండలంలోని బొమ్మనచెరువు పంచాయతీ టేకులపాళెంలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాలేదంటూ కృష్ణమూర్తి రెండురోజుల కిందట తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా చంద్రకళ పుట్టింటి నుంచి నేరుగా హైదరాబాద్‌లో ఉన్న సోదరి గీత వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు చంద్రకళకు ఫోన్‌చేసి శుక్రవారం స్టేషన్‌కు రావాలని కోరారు. దీంతో ఆమె గురువారం రాత్రి బస్సెక్కి మదనపల్లెకు బయలుదేరింది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా తన భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన కృష్ణమూర్తి శుక్రవారం సీటీఎం క్రాస్‌రోడ్డులోని సోమలగడ్డలో ఉన్న సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనించారు. అలాగే ఘటనపై స్థానికులను విచారించారు. భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెంది సెల్‌టవర్‌ ఎక్కినట్లు చెప్పారు. అయితే కిందికి దిగిరావాలని కోరినా అతడు దిగలేదు. పైగా తన భార్య ఇక్కడికి వస్తేనే దిగొస్తానంటూ పైనుంచి స్పష్టం చేశాడు. ఓవైపు పోలీసులు, మరోవైపు స్థానికులు దిగిరమ్మని కోరినా అతడు దిగకపోగా అక్కడే ఉండి పైనుంచి కిందకు దూకేస్తానంటూ బెదిరించాడు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు చంద్రకళకు ఫోన్‌ చేసి ఘటన స్థలానికి తీసుకొచ్చారు. కాగా ఒకటిన్నర గంటపాటు సెల్‌టవర్‌పై ఉండి హైడ్రామా చేసిన అతను భార్యను చూసిన వెంటనే ఎవరూ పిలవకుండానే తిన్నగా పైనుంచి కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు దంపతులను జీపులో స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి మందలించారు. మరోమారు ఇలాంటి ఘటనకు పాల్పడకుండా ఉండాలంటూ కృష్ణమూర్తి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని దంపతులను ఇంటికి పంపారు. దీంతో సెల్‌టవర్‌ కథ సుఖాంతమైంది.

Updated Date - 2023-05-26T23:24:16+05:30 IST