వలంటీర్లు బెదిరిస్తున్నారు!

ABN , First Publish Date - 2023-06-26T22:35:36+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సిన వలంటీర్లు తమను బెదిరిస్తున్నారని మదనపల్లె ఆర్డీవో మురళికి పలువురు ఫిర్యాదు చేశారు.

వలంటీర్లు  బెదిరిస్తున్నారు!
అర్జీదారుల వినతులను పరిశీలిస్తున్న ఆర్డీవో మురళి

స్పందనలో పలువురి ఫిర్యాదు

మదనపల్లె టౌన్‌, జూన్‌ 26: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సిన వలంటీర్లు తమను బెదిరిస్తున్నారని మదనపల్లె ఆర్డీవో మురళికి పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో ఆర్డీవో మురళి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. బీడీపొయ్యి విషయమై తహ సీల్దార్‌ కార్యాలయానికి రావాలని వలంటీరు గౌసిని ప్రతి రోజు తమను వేధిస్తోం దని, ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని అగర్త వీధికి చెందిన షకీరా ఫిర్యాదు చేసింది. 12 వార్డు వలంటీరు రోజా, ఆమె భర్త రాజు తనను ఫోన్‌లో బెదిరిస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని సీటీఎం గ్రామానికి చెందిన జి.పూర్ణిమ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. దిశ పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసినా ఇంత వరకు తనకు న్యాయం జరగలేదని ఆర్డీవోకు విన్నవించింది.

మదనపల్లె పట్టణం శేషప్పతోటలోని తన నివాసాన్ని బీపీఎస్‌ కింద క్రమబద్ధీకరణ చేయాలని డీడీ సమర్పించినా 15 ఏళ్లుగా పని జరగడం లేదని గొల్లపూడి తిరుపతిరావు ఆర్డీవోకు విన్నవించారు.

70 ఏళ్లుగా కల్లు రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్న రోడ్డును భూస్వాములు ఆక్రమించుకున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని రామసముద్రం మండలం పనమరెడ్డిపల్లె, మూగయర్రపల్లె గ్రామస్థులు ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.

డప్పు వాయించి జీవిస్తున్న తనకు కళాకారుల పింఛన్‌ మంజూరు చేయించాలని సీటీఎం గ్రామానికి చెందిన సర్వేష ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2023-06-26T22:35:51+05:30 IST