కదం తొక్కారు

ABN , First Publish Date - 2023-02-06T23:06:58+05:30 IST

తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీల నినాదాలతో కలెక్టరేట్‌ దద్దరిల్లింది.

కదం తొక్కారు
కలెక్టరేట్‌ ఎదుట పోలీసులతో వాగ్వాదం చేస్తున్న దృశ్యం

అంగన్‌వాడీల ముట్టడితో అట్టుడికిన కలెక్టరేట్‌

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

హెల్పర్‌ నియామకాలు రద్దు చేయాలి

అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్ల యూనియన్‌ నాయకుల డిమాండ్‌

కలెక్టరేట్‌లో ఉద్రిక్త పరిస్థితులు

రాయచోటి (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీల నినాదాలతో కలెక్టరేట్‌ దద్దరిల్లింది. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినా.. మధ్యాహ్నం దాటినా అఽధికారులు స్పందించకపోవడంతో.. ఆగ్రహించిన ఆంగన్‌వాడీలు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్‌ను చుట్టుముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూరల్‌ సీఐ తన సిబ్బందితో ఆందోళనకారులతో చర్చించినా శాంతించలేదు. కలెక్టరేట్‌ చుట్టూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులను నెట్టుకుని కలెక్టర్‌ కార్యాలయంలోకి వెళ్లారు. కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని పోలీసులు మూసివేయడంతో రెండు గంటల సమయం కావస్తున్నా మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి పి.రాజేశ్వరి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, జీవో నెంబరు 1ను తక్షణమే రద్దు చేయాలని, ప్రమోషన్లు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, సీనియార్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సూపర్‌వైజర్‌ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని డిమాండ్‌ చేశారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని, వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని వారు కోరారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సెంటర్లను బలోపేతం చేయడానికి నిధులు పెంచి అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల పర్యవేక్షణ చేయాలని, ఫుడ్‌ కమిషనర్‌, ఎంఎ్‌సకే, తహసీల్దార్‌, ఎంపీడీవో, రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజిట్ల పేరుతో అంగన్‌వాడీలను అవమానిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని, అంగన్‌వాడీలు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌, రామాంజులు, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, యూనియన్‌ అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, వాటిని పరిష్కరించాలని న్యాయబద్ధంగా అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం దారుణమన్నారు. అనంతరం తమ సమస్యలపై కలెక్టరేట్‌కు వినతిపత్రం అందించారు. ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మణి, కేవీపీఎస్‌ నాయకులు పెంచలయ్య, డీసీ వెంకటయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్ర, నాగబసిరెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు బంగారమ్మ, ఖాజాబీ, ఓబులమ్మ, సిద్దమ్మ, మధురవాణి, గౌరి, శ్రీవాణి, కరుణశ్రీ, పద్మశ్రీ, భూకైలేశ్వరి, రమాదేవి, విజయమ్మ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:07:00+05:30 IST