హైదరాబాద్‌కు మారిన సీన్!
ABN , First Publish Date - 2023-05-27T03:04:40+05:30 IST
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య గురించి పోలీసులకు నిజాలు చెబితే చంపేస్తానని వాచ్‌మన్ రంగన్నను ఈ కేసులో ఏ-1 ఎర్ర గంగిరెడ్డి బెదిరించారని సీబీఐ తెలిపింది.

ఊపిరి పీల్చుకున్న కర్నూలు నగరం
అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ డిశ్చార్జ్
హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
తరలి వెళ్లిపోయిన ఎంపీ, అనుచరులు
న్యూఢిల్లీ, మే 26 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య గురించి పోలీసులకు నిజాలు చెబితే చంపేస్తానని వాచ్‌మన్ రంగన్నను ఈ కేసులో ఏ-1 ఎర్ర గంగిరెడ్డి బెదిరించారని సీబీఐ తెలిపింది. ‘ఈ హత్య కేసు విస్తృత కుట్రలో రెండు ప్రధాన చర్యలు ఉన్నాయి. ఒకటి.. హత్య చేయడం. రెండోది.. సంఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేయడం. వీటిలో ఎర్ర గంగిరెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారు’ అని పేర్కొంది. ఆయన బెయిల్‌ను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.. ఆయన్ను జూలై 1న తిరిగి విడుదల చేయాలని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ డీఐజీ, దర్యాప్తు అధికారి కేఆర్ చౌరాసియా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో కీలక అంశాలను పొందుపరిచారు. ‘ఎర్రగంగిరెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను బెదిరిస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలింది. సీబీఐపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ దర్యాప్తును అడ్డుకోడానికి ప్రయత్నాలు చేశారు. ఈ విషయాలను పలుసార్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులు పరిగణనలోకి తీసుకున్నాయి. ఏపీ పోలీసులు సకాలంలో చార్జిషీటు దాఖలు చేయని కారణంగా ఎర్రగంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ పొందారు. దానివల్ల ఈ కేసులో యాదాటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయగలిగినా కీలక నిందితుడైన గంగిరెడ్డిని అదుపులోకి తీసుకోలేకపోయాం. అందుకే ఆయనకిచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులను ఆశ్రయించాం. గంగిరెడ్డి మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది’ అని అఫిడవిట్‌లో వివరించారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు చట్టబద్ధంగా లేవని.. అంతేగాకుండా అభ్యర్థనకు మించిన ఉపశమనం కలిగించిందని తెలిపారు. ఒకవైపు డీఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూనే మళ్లీ విడుదల చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయ విచక్షణాధికారాలను అతిక్రమించిందని, తప్పుడు సంప్రదాయాన్ని నెలకొల్పిందని పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వులు ప్రాసిక్యూషన్‌కు తీవ్రంగా హాని కలిగించడమే కాకుండా క్రిమినల్ న్యాయపాలనా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ఈ ఉత్తర్వులను కొట్టివేయకపోతే జైళ్లలో ఉన్న క్రూరమైన నేరానికి పాల్పడిన నేరస్థులు కూడా దీనిని అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులు జూలై 1 వరకు తాత్కాలికంగా బెయిల్‌ను సస్పెండ్ చేసినట్లు ఉన్నాయని.. నేర తీవ్రత, వాస్తవాలను, సాక్షులను ప్రభావితం చేయడం వంటి అంశాలతో పాటు గంగిరెడ్డి హత్య చేశారనడానికి ఉన్న బలమైన ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. నిందితుడు నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడిన విషయాన్ని కూడా హైకోర్టు గుర్తించలేదన్నారు. గంగిరెడ్డి క్రూరమైన నేరానికి పాల్పడ్డారని, ఆధారాలను చెరిపివేశారని ప్రాథమికంగా తేల్చామని సీబీఐ డీఐజీ పేర్కొన్నారు.