రైతన్నను ఏడ్పిస్తున్న టమోటా

ABN , First Publish Date - 2023-06-02T23:35:26+05:30 IST

మదనపల్లె ప్రాంతంలో టమోటా ధరలు రైతన్నలను కవ్విస్తూ..నవ్విస్తూ..ఏడిపిస్తున్నాయి.

రైతన్నను ఏడ్పిస్తున్న టమోటా
మదనపల్లె మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన టమోటా

మదనపల్లె టౌన, జూన 2:మదనపల్లె ప్రాంతంలో టమోటా ధరలు రైతన్నలను కవ్విస్తూ..నవ్విస్తూ..ఏడిపిస్తున్నాయి. రెండు నెలలుగా కిలో రూ.5 మాత్రమే పలికిన టమోటా ధరలు, ఇటీవల కురిసిన వర్షాలు, కర్ణాటక రాష్ట్రంలో మార్కెట్‌లో దిగుబడి తగ్గడం తదితర కారణాలతో ఒక్కసారిగా కిలో రూ.24 నుంచి రూ.32 వరకు టాప్‌ ధరలు పలికాయి. ఈ ధరలు చూసి హమ్మయ్య ఈ యేడు టమోటా సాగుకు పెట్టిన పెట్టుబడి వస్తుందని, అంతో ఇంతో లాభాలు కళ్ల చూస్తామని ఆశించిన రైతులకు గొంతులో వెలక్కాయ పడినట్లైంది. రెండు రోజులుగా మద నపల్లె మార్కెట్‌కు విపరీతంగా టమోటా విక్రయాలకు వస్తుండటంతో ధరలు అమాంతం పడిపోతున్నాయి. గరువారం మార్కెట్‌కు 1044 టన్నుల టమోటా విక్రయానికి వస్తే శుక్రవారం ఏకంగా 1431 టన్నుల టమోటా విక్రయానికి వచ్చింది. దీంతో ఒక్క సారిగా ధరలు కూడా పడిపోయాయి. నాణ్యమైన టమోటా కిలో రూ.16 ధర పలుకగా, రెండో రకం టమోటా కిలో రూ.8కి పడిపోయింది. దీన్నిబట్టి చూస్తుంటే ఈ వారం రోజుల్లో మదనపల్లె మార్కెట్‌కు 2000 టన్నుల టమోటా విక్ర యానికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు అంటున్నారు. ఇదే జరిగితే ధరల పతనం కూడా అలాగే ఉంటుందని తెలుస్తోంది.

పొలాల్లోనే కాయలను వదలివేసిన వైనం

నిమ్మనపల్లె, జూన 2: అప్పులు చేసి ఎంతో కష్టపడి పండించిన టమో టా పంట ధరలు పతనం కావడంతో టమోటా రైతు పొలాల్లోనే కాయ లను వదలివేశారు. మండలంలో దాదాపు 4వేల ఎకరాలకు పైగా రైతు లు టమోటా పంటను సాగు చేశారు. అయితే గత 3నెలలుగా ధరలు లేకపోవడంతో పంటలను తోటలోనే వదిలేశారు. కొంత మంది రైతులు 30కేజీ క్రేట్‌లను మార్కెట్‌కు తీసుకుపోయినప్పటికి ఒక క్రేటు 150నుంచి 200లు ధర పలుకుతుండడం, దీనికి తోడు రవాణా చార్జీలు, కూలీలు, కమిషన తదితర ఖర్చులు పోను ఒక్కరూపాయి కూడా చేతికి రావడం లేదని తెలిపారు. దీనికి కారణం ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి అధికంగా టమోటాలు వస్తుండడంతో ధర పతనమైనట్లు రైతు లు చెపుతున్నారు. కొంతమంది రైతులు ఐతే అప్పులు చేసి ఎకరాకు రూ.2లక్షలు ఖర్చు పెట్టినప్పటికి ఒక్క రూపాయి కూడా అందలేదని వాపోతున్నారు. అప్పుల బాధలు భరించలేక తెచ్చిన చోట వడ్డీలు కట్టు కోలేక రైతన్న పరిస్థితి పెన్నంపై నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైం ది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-06-02T23:35:26+05:30 IST