ప్రాజెక్టు సరే... దిగువ ప్రాంతాలెలా..?
ABN , First Publish Date - 2023-03-02T23:11:52+05:30 IST
అన్నమయ్య ప్రాజెక్టును పునర్ నిర్మించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 660 కోట్లకు టెండర్ ఖరారు చేస్తూ ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టడానికి చర్యలు చేపట్టనుంది.
23 ఏళ్లుగా ఎడారిగా మారిన దిగువ ప్రాంతం..
ప్రాజెక్టు తెగిపోవడంతో కోనసీమగా...
వరద బాధితుల గోడు పట్టించుకోని ప్రభుత్వం
16 నెలలు కావస్తున్నా కనీస పునరావాస చర్యలు శూన్యం
రాజంపేట, మార్చి 2: అన్నమయ్య ప్రాజెక్టును పునర్ నిర్మించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 660 కోట్లకు టెండర్ ఖరారు చేస్తూ ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టడానికి చర్యలు చేపట్టనుంది. ఈ సమయంలో ఈ ప్రాజెక్టు వ్యవహారంపై ఒకవైపు విమర్శలు, మరోవైపు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబరులో తెగిపోయి భారీ ప్రాణ, ఆస్తినష్టం జరగగా ఇంతవరకు పునర్ నిర్మాణ చర్యలే చేపట్టలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇంతవరకు ఇళ్లు కట్టించలేదు. సరికదా.. వరదల్లో పూర్తిగా మునిగిపోయిన గ్రామాలకు రక్షణ గోడలతో పాటు ఇంతవరకు నష్టపరిహార చర్యలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేదు. ఈ సమయంలో పునర్ నిర్మాణ చర్యలే చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం రూ.660 కోట్లు ఖర్చు చేసి తిరిగి ప్రాజెక్టును పునర్ నిర్మిస్తారన్న నమ్మకం ఏ ఒక్కరిలో లేదు. ప్రాజెక్టు పునర్ నిర్మాణం చేపట్టే సమయంలో గతంలో చేసిన తప్పిదాలను పునరావృతం కాకుండా అందరికీ న్యాయం జరిగేటట్లు ప్రాజెక్టును రూపకల్పన చేయాల్సి ఉంది. ఆ విధంగా కాకుండా గతంలో ఏ తప్పిదం జరిగిందో అదే తప్పిదాన్ని తిరిగి చేస్తూ ఏకంగా మూడు మండలాల ప్రజలను తిరిగి కరువు కాటకాలతో అల్లాడేటట్లు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి అసలు ఆయకట్టు ప్రాంతానికి కూడా నీరందించలేదు. రాజంపేట ఎగువ ప్రాంతాలు, పుల్లంపేటలోని కొన్ని గ్రామాలు మొత్తం 22,500 ఎకరాలకు నీరందించే ఉద్దేశ్యంతో నిర్మించారు. అయితే ప్రాజెక్టు పూర్తయినప్పటి నుంచి ఏ ఏడాది కూడా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందించలేదు. కారణం.. ప్రాజెక్టులోని సాంకేతిక కారణాలే.. అయితే ఈ ప్రాజెక్టు కట్టకముందు ఈ ప్రాంతాలన్నింటినీ కోనసీమగా పిలిచేవారు. అసలు పెన్నానది తరువాత అత్యంత విశాలంగా, సువిశాల ప్రాంతంలో చెయ్యేరు నది ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో బాహుదానదిగా, తదనంతరం చెయ్యేరుగా పిలువబడే ఈ నదీ పరివాహక ప్రాంతం అచ్చం కోనసీమను తలపిస్తుంది. ప్రతి ఏడాది మూడు పంటలతో, ఏడాది పొడవునా జీవనదిలా పారే నీటితో సుమారు 30 ఊట కాలువల ద్వారా 20 వేల ఎకరాల పైబడి ఆయకట్టుకు నీరందిస్తూ కోనసీమగా పిలువబడుతుంది. అటువంటి ప్రాంతాలను అన్యాయం చేస్తూ కొన్ని ప్రాంతాలకే ప్రయోజనం కలిగే రీతిలో ప్రాజెక్టును నిర్మించారు. దీనివల్ల ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి నేటి వరకు పూర్తిస్థాయిగా కోనసీమగా పిలువబడే ప్రాంతం ఒక్క ఎకరా పండక భూగర్భజలానికి కనీసం తాగునీరు కూడా లభించక ఓ ఎడారిలా మారిపోయింది. 2021 నవంబరులో ప్రాజెక్టు తెగిపోయిన తరువాత ఏడాదిన్నరగా నదిలో దిగువ ప్రాంతాలకు నీరు ప్రవహిస్తోంది. పెనగలూరు, నందలూరు, రాజంపేట మండలాలకు సంబంధించిన మూడు మండలాలు 23 ఏళ్ల తరువాత తిరిగి కోనసీమను తలపించే రీతిలో పుష్కలంగా పంటలు పండుతున్నాయి. 30 ఊట కాలువలకు నీరందుతోంది. ఏడాది పొడవునా నది ప్రవహిస్తోంది. గలగలా పారే నీటితో భూగర్భజలాలు భారీగా పెరిగి ఏకంగా 20 వేల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమైంది. ప్రాజెక్టు తెగిపోయిందని ఎగువ ప్రాంతంలో బాధపడితే ప్రాజెక్టు తెగిపోయిందే మాకు అదృష్టమైంది, తిరిగి 23 ఏళ్ల తరువాత మా పంటలు సస్యశ్యామలమయ్యాయని దిగువ ప్రాంతాల్లోని మూడు మండలాలకు చెందిన వందలాది గ్రామాల ప్రజలు సంతోషపడుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఏదైనా ఆలోచించేటప్పుడు దిగువ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని అందులో ఎక్కువ శాతం మంది ప్రజలకు ప్రయోజనం కలిగే అంశాన్ని పరిశీలించాలి. ఆ పద్ధతిలో ప్రాజెక్టు పునర్ నిర్మాణం చేపట్టి దిగువ ప్రాంతాల్లోని మూడు మండలాలకు నీరందించేలా ప్రాజెక్టు రూపకల్పన చేసి అటు ఎగువ ప్రాంతం, ఇటు దిగువ ప్రాంతానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టి ప్రాజెక్టు రూపకల్పన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆ విధంగా కాకుండా కంటి తడుపు చర్యగా అదనంగా 11 గేట్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రాజెక్టు తెగిపోకుండా అన్ని చర్యలు చేపట్టామని గతంలో ఎలా ప్రాజెక్టు ఉండేదో అదే రీతిలో 22,500 ఎకరాలకు నీరందిస్తామని చెప్పడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
నీటి లభ్యత పెరిగినందునే...
- హరికిరణ్, ఈఈ, అన్నమయ్య ప్రాజెక్టు
నీటి లభ్యత తిరిగి బాగా పెరుగుతోంది. వర్షాలు బాగా పడుతున్నందున చెయ్యేటిలో ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తోంది. దీనివల్ల వర్షాకాలంలో ప్రాజెక్టు కొద్ది రోజులకే నిండి మిగిలిన నీరంతా దిగువ ప్రాంతానికి చేరుతుంది. అందువల్లే యధావిధిగా ప్రాజెక్టును నిర్మించదలిచాం. అందువల్ల దిగువ ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రాజెక్టు పునర్ నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ అనుమతులు అందిన వెంటనే ప్రాజెక్టును త్వరితగతిన పునర్ నిర్మిస్తాం.
దిగువ ప్రాంతాల గురించి ఆలోచించరా...?
- ప్రతా్‌పరెడ్డి, రైతు, పులపత్తూరు
ప్రాజెక్టు తెగిపోయి దిగువ ప్రాంతాలైన పులపత్తూరు, మందపల్లె, గుండ్లూరు, రామచంద్రాపురం లాంటి అనేక గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మా గ్రామం ఆనవాళ్లే లేకుండాపోయింది. అసలు పంట పొలాలే కనిపించకుండా ఇసుక మేటలు వేశాయి. రక్షణ గోడలన్నీ పూర్తిగా పాడై తిరిగి వర్షాకాలంలో వచ్చిన నీరంతా గ్రామాల గుండా ప్రవహించే పరిస్థితి ఉంది. గ్రామాలకు న్యాయం చేయకుండా, దిగువ ప్రాంతాలకు కూడా న్యాయం జరిగే పరిస్థితుల్లో ప్రాజెక్టు డిజైన్ చేయకుండా ప్రాజెక్టును యధావిధిగా నిర్మిస్తామని చెప్పడం తగదు.
మొదట బాధితులను ఆదుకోండి
- కొండా శ్రీనివాసులు, టీడీపీ అధికార ప్రతినిధి, మందపల్లె
ప్రాజెక్టు తెగిపోయి అందరూ చనిపోయి ఇప్పటికీ కనీసం గుడిసె లేని ఎంతో మంది ఉంటే వారిని ఆదుకోకుండా కనీసం ఇసుక కూడా ఎత్తకుండా తిరిగి ప్రాజెక్టు కడతామని చెప్పడం దారుణం. ప్రాజెక్టును తిరిగి కట్టే ముందు ముందుగా ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో జరిగిన నష్టాన్ని పూడ్చాల్సి ఉంది. ఆ విధంగా కాకుండా రూ.660 కోట్లతో ప్రాజెక్టును కడతామంటే ఎవరు నమ్ముతారు. పది కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు తెగిపోయిన సమయంలో నష్టపోయిన రైతులకు, ప్రజలకు సహాయపడాలి. తరువాత దిగువ ప్రాంతాలకు నీరందించే విధంగా ప్రాజెక్టు నిర్మాణం చేయాలి.