కౌలు రైతుల సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి
ABN , First Publish Date - 2023-09-19T23:19:03+05:30 IST
దేశవ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించి వారికి న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు.

రాయచోటిటౌన్, సెప్టెంబరు19: దేశవ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించి వారికి న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన రాయచోటి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా సమగ్ర కౌలు చట్టం తీసుకురావాలన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేసి ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు పెట్టుబడి సాయం అందించాలని ఆయన కోరారు. కౌలు రైతులందరికీ షూరిటీ లేని పంట రుణాలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం సున్నా వడ్డీకే ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సబ్సిడీపై రైతులకు అందించాలన్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై చర్యలు తీసుకో వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తు న్నారన్నారు. రాయలసీమలో ఖరీఫ్ సీజన్‌లో ఎండిపోయిన పంటలను వైసీపీ నాయకులు కానీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు గానీ పరిశీలించక పోవడం దారుణమన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.