కంచె చేను మేస్తోంది
ABN , First Publish Date - 2023-05-26T23:31:49+05:30 IST
మండలంలోని గోరాన్‌చెరువు పంచాయతీ వడిసెలవంక పల్లెకు ఉత్తరం వైపున సర్వే నెంబరులో 3 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి ఉంది. ఇది పూర్వకాలం నుంచి బీడు భూమిగా ఉంటూ చుట్టుపక్కల వారు పశువులు మేపు కునేందుకు ఉపయోగించుకొనేవారు.

దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
3 ఎకరాల్లో మామిడి చెట్లు నాటిన ఓ సర్వేయర్
రెవెన్యూ అధికారుల అండదండలతో బరితెగింపు
ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆ ఉద్యోగం కూడా రెవెన్యూశాఖకు సంబంధించినది. నాకు సంబంఽధించిన శాఖ కదా నన్నెవరు అడుగుతారనుకున్నారో ఏమో.. ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించాల్సిన ప్రభుత్వ ఉద్యోగాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకొంటున్నాడు. సచివాలయంలో సర్వేయర్‌గా ఉద్యోగం రావడంతోనే తన అసలు పని ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాలుగా బీడు భూమిగా ఉన్న ప్రభుత్వ భూమిపై ఆ ఉద్యోగి కన్ను పడింది. ఏకంగా మూడు ఎకరాలకు పైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ కల్ల వేసి దర్జాగా మామిడి చెట్లను నాటి పూర్వకాలం నుంచి వెళుతున్న దారిని కూడా మూసివేయించాడు. దారి ఆక్రమణపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.
గాలివీడు, మే 26: మండలంలోని గోరాన్‌చెరువు పంచాయతీ వడిసెలవంక పల్లెకు ఉత్తరం వైపున సర్వే నెంబరులో 3 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి ఉంది. ఇది పూర్వకాలం నుంచి బీడు భూమిగా ఉంటూ చుట్టుపక్కల వారు పశువులు మేపు కునేందుకు ఉపయోగించుకొనేవారు. ఆ ప్రభుత్వ భూమిగుండా పై పొలాల వారు రాకపోకలు సాగించేవారు. కానీ ఓ సచివాలయంలో పనిచేసే సర్వేయర్ (గోరాన్‌చెరువు గ్రామానికి చెందిన వ్యక్తి) ఆ ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. ఉద్యోగం వచ్చిన వెంటనే ఆ భూమిని ఆక్రమించుకొని ఒక సంవత్సరం పంటను సాగు చేసుకొని తరువాత మామిడి చెట్లను నాటినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పైన ఉన్న పొలాల రైతులకు దారి కూడా లేకుండా పోయింది. గత రెండు నెలల వరకు మనుషులు పోవడానికి మాత్రమే దారి వదిలాడు. కానీ 15 రోజుల క్రితం ఆ దారిని కూడా కంప వేసి మూసివేయించాడు. దీంతో పై పొలాల వారు వెళ్లేందుకు వీలులేదు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అందులోనూ రెవెన్యూశాఖలో పనిచేస్తూ ప్రభుత్వ భూములను కబ్జా చేయడం ఎంతవరకు సమంజసమో రెవెన్యూ అధికారులకే తెలియాలని ప్రజలు అంటున్నారు. సాధారణ ప్రజలు ఒక సెంటు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే వారిపై చర్యలు తీసుకునే రెవెన్యూ ఉద్యోగులు ఏకంగా ఒక సర్వేయర్ 3 ఎకరాలకు పైన దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఆ వ్యక్తిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ పలువురు ఉద్యోగుల తీరును ప్రశ్నిస్తున్నారు.
దారికి అడ్డంగా కంప
పూర్వకాలం నుంచి ఆ ప్రభుత్వ భూమి గుండా పై పొలాల వారికి దారి ఉండేదని, కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి అందులోనూ సర్వేయర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని తన తండ్రితో దారి లేకుండా చేశాడని పలువురు ఆరోపించారు. కనీసం దారి వదిలి మిగతా భూమిని ఆక్రమించుకోమని పలువురు అతనికి తెలియజేసినప్పటికీ అతను వినలేదని తెలిపారు. దారిని ఎందుకు మూశావని అడిగితే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి కనీసం పై పొలాల వారికి దారినైనా ఇప్పించాలని పలువురు కోరుతున్నారు.
పొలాలకు దారి లేకుండా చేశాడు..
అతను ప్రభుత్వ సర్వేయర్. బీడుగా ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అతని తండ్రితో మామిడి చెట్లను నాటించాడు. కనీసం పై పొలాల వారికి దారి కూడా లేకుండా చేశాడు. మా పొలానికి వెళ్లడానికి దారి ఇమ్మని అడిగితే మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. దారి ఆక్రమణపై రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకోలేదు. మేము ఇక ఎవరికి చెప్పుకోవాలి.
- నారాయణరెడ్డి, గోరాన్‌చెరువు
దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు..
మా పొలాలకు వెళ్లేందుకు దారి ఇవ్వమని ఉద్యోగి, అతని తండ్రిని అడిగాం. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, దారి ఇవ్వను. ఈ భూమి గుండా కాదు కదా.. పక్కన కూడా మీకు దారి ఇవ్వను అని సర్వేయర్ తండ్రి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. మాకు పది ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఆ తోటలోకి వెళ్లేందుకు ఆక్రమణకు గురైన స్థలం గుండా వెళ్లాలి. మా తోటకు దారి లేకపోవడంతో కాయలన్నీ తోటలోనే రాలిపోతున్నాయి. మాకు వేరే దారి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి దారి ఇప్పించండి.
- నాగమల్లమ్మ, ఒడిసెలవంకపల్లె, గోరాన్‌చెరువు
విచారించి చర్యలు తీసుకుంటాం..
దారికి అడ్డంగా కల్ల వేసిన విషయం తమ దృష్టికి కూడా వచ్చింది. మేము వెంటనే ఆ రైతుకు కల్ల ఎత్తివేయమని చెప్పాము. కానీ ఇంతవరకు కల్ల ఎత్తకపోవడం చట్టానికి విరుద్ధం. వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం.
- దైవాదీనం, తహసీల్దారు, గాలివీడు