కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటుతో బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2023-03-02T23:29:30+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు ఓటు ద్వారా గట్టిగా బుద్ధిచెప్పాలని సీపీఎం నాయకులు సూచించారు. గురువారం జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్టాండు గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గ్యాస్‌ సిలిండరు ఎదురుగా పెట్టి నిరసన తెలియజేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటుతో బుద్ధి చెప్పాలి
గ్యాస్‌ సిలిండర్‌తో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు నిరసన

04 జేఎండీ2:

జమ్మలమడుగు, మార్చి 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు ఓటు ద్వారా గట్టిగా బుద్ధిచెప్పాలని సీపీఎం నాయకులు సూచించారు. గురువారం జమ్మలమడుగు పట్టణంలోని పాత బస్టాండు గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గ్యాస్‌ సిలిండరు ఎదురుగా పెట్టి నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేది కార్పొరేట్‌ కంపెనీల కోసమా, ప్రజల కోసమా అని ప్రశ్నించారు. . గ్యాస్‌ ధర పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పలు రూపాల్లో ప్రజలపై భారం మోపుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పన్నులను పెంచుతూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక 17సార్లు గ్యాస్‌ ధర పెంచి రికార్డులు సృష్టించారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్‌, జమ్మలమడుగు కార్యదర్శి శివనారాయణ, వినయ్‌కుమార్‌, దాసు, డేవిడ్‌, ప్రసాద్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

బద్వేలు రూరల్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు గ్యాస్‌ ధర పెంచి పేదలపై పెనుభారం మోపడం దారుణమని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు జహంగీర్‌బాషా తెలిపారు. స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు రూముల్లో ఉన్న కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాక మునుపు కేవలం రూ.400 లోపు మాత్రమే ఉన్న సిలిండరు ధర ప్రస్తుతం రూ.1200కు చేరిందన్నారు. ప్రపంచ దేశాలు నరేంద్రమోడీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని మనదేశంలో చూస్తే కార్పొరేట్‌ శక్తులను పెంచి పోషిస్తూ, సామాన్యులు బతకలేని పరిస్థితికి తెస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే గ్యాస్‌ సిలిండరు ధరను రెండు వేలకు పెంచి, సామాన్యుడు సిలిండరును చూసి హడలెత్తే పరిస్థితులు తెస్తారన్నారు. ఇ్పటికైనా సిలిండరు ధరను సామాన్యునికి అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గోపవరం జడ్పీటీసీ మాజీ సభ్యుడు వేముల రమణయ్య, టీడీపీ సీనియర్‌ నాయకులు మునిరెడ్డి, గాజులపల్లె చంద్రశేఖర్‌రెడ్డి, పల్లెం ఎల్లారెడ్డి, టీడీపీ ఎస్సీ సెల్‌ అధికార ప్రతినిధి వాల్సాటి దానం, గోపవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటి మాజీ ఛైర్మన్‌ రామసుబ్బారెడ్డి, సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రొద్దుటూరు రూరల్‌: వంట గ్యాస్‌ సిలిండరుపై రూ.50, వాణిజ్య సిలిండరుపై రూ.350 పెంచడం దారుణమని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పీఎండీ నజీర్‌ అన్నారు. స్థానిక కాంగెరస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 114 డాలర్లు ఉన్నప్పుడు, వంట గ్యాస్‌ సిలిండరు కేవలం రూ.410కే లభించేదన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర 90 డాలర్లే ఉన్నా బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్‌ సిలిండరు ధరను సుమారు రూ.1200లు చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.500కే వంట గ్యాస్‌ను సరఫరా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రామాంజనేయులు, భాస్కర్‌, సైమన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:29:30+05:30 IST