శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆల్వార్‌ తిరుమంజనం

ABN , First Publish Date - 2023-03-28T23:25:16+05:30 IST

ఏకశిలా నగిరి కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ఆల్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని మంగళవారం టీటీడీ అర్చకులు, అధికారులు నిర్వహించారు.

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆల్వార్‌ తిరుమంజనం
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ధ్వజస్తంభాన్ని శుద్ధి చేస్తున్న దృశ్యం

ఒంటిమిట్ట, మార్చి 28: ఏకశిలా నగిరి కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ఆల్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని మంగళవారం టీటీడీ అర్చకులు, అధికారులు నిర్వహించారు. ఈనెల 30 నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపఽథ్యంలో బ్రహ్మోత్సవాలకు ముందుగా కోయిల్‌ ఆల్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భాలయం, ఆంజనేయస్వామి, గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాలతో ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి ఎలాంటి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ఆలయాన్ని మొత్తం సుగంధద్రవ్యాలతో అభిషేకించడమే కోయిల్‌ ఆల్వార్‌ తిరుమంజనం అని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ నటేశ్‌బాబు, ఇన్‌స్పెక్టర్‌ ధనుంజయులు, అర్చకులు వీణారాఘవాచార్యులు, శ్రావణ్‌కుమార్‌, మనోజ్‌కుమార్‌, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-28T23:25:16+05:30 IST