ఒకే సమయం.. అదే మార్గం?

ABN , First Publish Date - 2023-02-07T03:14:17+05:30 IST

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరైన సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి ఆ తర్వాత సీఎస్‌ జవహర్‌ రెడ్డితో కలిసి ప్రయాణించారా? లేదా? కలిసి వెళ్లినట్లు వచ్చిన వార్తలను ఆదివారం ఖండించారు.

ఒకే సమయం.. అదే మార్గం?

సీఎం ఓఎస్డీ సీఎ్‌సతో కలిసి వెళ్లలేదా?

ఔటర్‌లో సులువుగా వెళ్లే వీలున్నా..సెంట్రల్‌ జైలు మీదుగా వెళ్లడమెందుకు?

సమయం, మార్గంపైనే అనుమానాలు

(కడప - ఆంధ్రజ్యోతి)

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరైన సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి ఆ తర్వాత సీఎస్‌ జవహర్‌ రెడ్డితో కలిసి ప్రయాణించారా? లేదా? కలిసి వెళ్లినట్లు వచ్చిన వార్తలను ఆదివారం ఖండించారు. అయితే... కడప నుంచి రేణిగుంటకు వెళ్లేందుకు సీఎస్‌ కాన్వాయ్‌ ఎంచుకున్న మార్గం, సమయం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. వివేకా హత్యకేసులో సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణ మోహన్‌ రెడ్డి, సీఎం సతీమణి భారతి సహాయకుడు నవీన్‌లను శుక్రవారం సీబీఐ అధికారులు కడప సెంట్రల్‌ జైలు అతిథి గృహంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అదేరోజు ఉదయం అవినాశ్‌రెడ్డితో కలసి సీఎస్‌ జవహర్‌రెడ్డి సింహాద్రిపురం మండలం భానుకోటలో జరిగిన సోమేశ్వరాలయం కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముద్దనూరులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ నుంచి సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో కమలాపురం, కడప మీదుగా రేణిగుంటకు బయల్దేరారు. ఈ మార్గంలో విమానాశ్రయం దాటగానే కడప ఔటర్‌ రింగ్‌రోడ్డు మొదలవుతుంది. రింగురోడ్డులో కుడివైపు వెళితే రాయచోటి సర్కిల్‌, రిమ్స్‌ ఆస్పత్రి మీదుగా వెళ్లి రాజంపేట రోడ్డులో సెంట్రల్‌ జైలుకు రెండు కిలోమీటర్లకు అవతల హైవేలో కలవొచ్చు. ఇది మొత్తం ఫోర్‌ లేన్‌ రోడ్డు. ఈ రోడ్డులో ట్రాఫిక్‌ తక్కువ. కానీ... సీఎస్‌ కాన్వాయ్‌ అటు వెళ్లలేదు. ఇర్కాన్‌ సర్కిల్‌, కడప సెంట్రల్‌ జైలు మీదుగా వెళ్లింది. ఇది చెన్నై- హైదరాబాద్‌ జాతీయ రహదారి. ఈ దారిలో భారీ వాహనాలతోపాటు ఇతర వాహనాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అయినా సరే... సీఎస్‌ కాన్వాయ్‌ ఈ మార్గాన్నే ఎంచుకుంది. పైగా... కృష్ణమోహన్‌ రెడ్డి, నవీన్‌ల విచారణ ముగియడానికి ఐదారు నిమిషాల ముందు కడప సెంట్రల్‌ జైల్‌ మీదుగా ఈ కాన్వాయ్‌ వెళ్లింది. జైలు దాటి కొద్దిదూరం పోయిన తరువాత మలుపు వద్ద స్లో అయింది. ఆ సమయానికి అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్‌ ఉన్న వేర్వేరు వాహనాల్లో కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌ కూడా అదే దారిలో వెళ్లారు. అక్కడి నుంచి కృష్ణ మోహన్‌ రెడ్డి ‘వేరే వాహనం’లో వెళ్లినట్లు చెబుతున్నారు.

సీఎ్‌సపై నిందలు భావ్యం కాదు: బొప్పరాజు

ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డిపై తొందరపాటుగా నిందలువేయడం భావ్యం కాదని ఏపీ జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం దీనిపై ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘జవహర్‌రెడ్డి ఏ ప్రభుత్వంలో పని చేసినా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఉన్నతమైన భావాలతో పనిచేస్తూ, నీతిమంతునిగా ఉద్యోగుల గౌరవం పొందుతున్నారు. ఆయనపై తొందరపాటుగా నిందలు వేయడం ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసింది. ఆయనపై వచ్చిన వార్తలను ఖండిస్తున్నాం’’ అని తెలిపారు.

Updated Date - 2023-02-07T03:14:18+05:30 IST