మళ్లీ రగడ

ABN , First Publish Date - 2023-02-07T02:46:01+05:30 IST

కడప పశుసంవర్ధకశాఖలోని బహుళార్ధ పశువైద్యశాలలో పనిచేస్తున్న ఉపసంచాలకులు (డీడీ) అచ్చన్న, అతని కింది స్థాయి ఇతర అధికారులు, ఉద్యోగుల మద్య మళ్లీ రగడ మొదలైంది. ఇరు పక్షాల మధ్య ఆదివారం సాయంత్ర నుంచి మొదలైన వివాదం సోమవారం రాత్రి వరకు

మళ్లీ రగడ

హుళార్ధ పశువైద్యశాలలో ఉద్యోగుల మధ్య వివాదం

ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు

అధికారుల తీరుపై మండిపడ్డ రైతులు

కడప(రూరల్‌), ఫిబ్రవరి 6 : కడప పశుసంవర్ధకశాఖలోని బహుళార్ధ పశువైద్యశాలలో పనిచేస్తున్న ఉపసంచాలకులు (డీడీ) అచ్చన్న, అతని కింది స్థాయి ఇతర అధికారులు, ఉద్యోగుల మద్య మళ్లీ రగడ మొదలైంది. ఇరు పక్షాల మధ్య ఆదివారం సాయంత్ర నుంచి మొదలైన వివాదం సోమవారం రాత్రి వరకు ఉప్పు..నిప్పులా కొనసాగింది. ఒకరిపై ఒకరు తీవ్రమైన అరోపణలు చేసుకున్నారు. ఇటు డీడీ అచ్చన్న తన కింది అధికారులు, ఉద్యోగుల ప్రవర్తన సరిగా లేదని ఫిర్యాదు చేయడానికి ఆదివారం రాత్రి వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేన్‌కు వెళ్లారు. అక్కడ సీఐ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. మరో పక్క ఆయన కింది స్థాయి ఉద్యోగులు (ఏడీలు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది) జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శారదమ్మతో కలిసి డీడీ అచ్చన్న వేధింపులు భరించలేకున్నామని కలెక్టర్‌ విజయరామరాజుకు ఫిర్యాదుచేయడానికి సోమవారం ఉదయం కలెక్టరేట్‌కు వె ళ్లారు. ఆ సమయంలో కలెక్టర్‌ను కలువడానికి వీలు పడకపోవడంతో సాయంత్రం మరోసారి కలిసే ప్రయత్నం చేశారు. దీంతో పశుసంవర్ధకశాఖలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మరోపక్క సోమవారం పశువైద్యశాలకు పశువులను తీసుకొని వచ్చిన రైతులు అధికారుల మధ్య గొడవతో కార్యాలయానికి తాళాలు వేసివుండడంతో తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. మీ గొడవలతో పశువుల వైద్యానికి ఇబ్బంది కలిగించరాదని పేర్కొన్నారు. వన్‌ టౌన్‌ పోలీసులు పశువైద్యశాలకు వచ్చి వెళ్లారు.

ఇరువర్గాలు ఏమన్నాయంటే..

ఆదివారం సాయంత్రం ఓ మహిళ బహుళార్ధ పశువైద్యశాలలోని పాత బిల్డింగ్‌లోకి వెళ్లిందని ఇక్కడ ఏవో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇందుకు శాఖలో పనిచేసే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ప్రమేయం ఉందని భావించి కార్యాలయ ప్రధాన గేట్లకు తాళాలు వేసి సదరు విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లానని డీడీ అచ్చన్న మీడియా ఎదుట ఆరోపించారు. తాను వేసిన తాళాలను సోమవారం ఉదయం కార్యాలయంలో బిల్డింగ్‌ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ చేత తన ప్రమేయం లేకుండా తొలగింప జేశారని చెప్పారు. మరోపక్క అచ్చన్న కింది స్థాయి ఉద్యోగులు మాత్రం డీడీ అచ్చన్న తమను విధులకు రాకుండా అడ్డుకుంటున్నారని అయినప్పటికి తాము విధులకు హాజరై వైద్య సేవలు అందిస్తున్నామని అంటున్నారు. తమ పైఅధికారి డిప్యూటీ డైరెక్టర్‌ అచ్చన్న చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. తమను ఇబ్బంది పెడుతున్న విషయం కలెక్టర్‌కు తెలియజేసే ప్రయత్నం చేశామని అంటున్నారు.

Updated Date - 2023-02-07T02:46:06+05:30 IST