పనిభారం తగ్గించాలి

ABN , First Publish Date - 2023-06-27T23:17:27+05:30 IST

అన్నమయ్య జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్‌ఎంలకు ఆన్‌లైన్‌ పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రెటరీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలావతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చే శారు.

పనిభారం తగ్గించాలి
డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఏఎన్‌ఎంలు

ప్రభుత్వ సెలవు రోజుల్లో పనులు చేయించరాదు

డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఏఎన్‌ఎంల నిరసన

రాయచోటి(కలెక్టరేట్‌), జూన్‌ 27: అన్నమయ్య జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్‌ఎంలకు ఆన్‌లైన్‌ పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రెటరీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీలావతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చే శారు. మంగళవారం హెల్త్‌ సెక్రెటరీ అసోసియేషన్‌ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద నిరసన తెలిపి, అడిషనల్‌ డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని, ఏపీపీఎస్‌సీ డిపార్టుమెంటల్‌ టెస్సు పాసైన గ్రేడ్‌-3 హెల్త్‌ సెక్రెటరీలందరినీ ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) (గ్రేడ్‌-2)గా మారుస్తూ జీవో విడుదల చేయాలని, గ్రేడ్‌-2కు వర్తించే అన్ని అలవెన్సులు ఇవ్వాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్‌ఎంలకు బయోమెట్రిక్‌ మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ యాప్స్‌ తగ్గించాలని కోరారు. ఏఎన్‌యం/ఏపీహెచ్‌ఏ(ఎ్‌ఫ), సాధారణ నర్సింగ్‌ చదివి మాతాశిశు సేవలందించేందుకు వచ్చిన తమకు పదుల సంఖ్యలో యాప్‌లు ఇచ్చి టార్గెట్‌లు విధించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ ఒత్తిడితో హెల్త్‌ సెక్రటరీలందరూ అనారోగ్యం పాలయ్యారన్నారు. సచివాలయంలో పనిచేసే అన్నిశాఖల ఉద్యోగులకు యూనిఫామ్‌ ఇచ్చినా, హెల్త్‌ సెక్రటరీలకు మాత్రం అందలేదన్నారు. మూడేళ్లుగా కుటుంబానికి దూరంగా విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఏఎన్‌ఎంలను బదిలీలు చేయాలని కోరారు. సెలవులకోసం ఎవరిని సంప్రదించా లన్న విషయంపై సరైన గైడెన్స్‌ ఇవ్వాలని కోరారు. ఎన్‌సీడీ సీడీ సర్వేలో సాంకేతిక లోపాలు సవరించి, తగినంత గడువు ఇవ్వాలని కోరారు. అన్ని పనులూ సక్రమంగా చేస్తున్నా కొన్ని చోట్ల మెడికల్‌ ఆఫీసర్లు పర్సనల్‌గా టార్గెట్‌ చేసి టార్చర్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు కృష్ణప్ప, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిద్దిగాళ్ల శ్రీనివాసులు, రాయచోటి పట్టణ కార్యదర్శి పుల్లయ్య, హల్త్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-27T23:17:27+05:30 IST