రాచమల్లు అక్రమ సంపాదన వెయ్యికోట్లు

ABN , First Publish Date - 2023-07-21T22:40:45+05:30 IST

వైసీపీని రెండోసారి గెలిపించడమంటే దోపిడీ చేసుకోవడానికి లైసెన్సు ఇవ్వడమేనని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అభిప్రాయ పడ్డారు.

రాచమల్లు అక్రమ సంపాదన వెయ్యికోట్లు
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

మరోసారి గెలిపిస్తే దోపిడీకి అవకాశం ఇచ్చినట్లే

మాజీ ఎమ్మెల్యే వరద సంచలన ఆరోపణలు

ప్రొద్దుటూరు అర్బన్‌, జూలై 21: వైసీపీని రెండోసారి గెలిపించడమంటే దోపిడీ చేసుకోవడానికి లైసెన్సు ఇవ్వడమేనని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అభిప్రాయ పడ్డారు. శుక్రవారం ఆ యన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో తీసుకొచ్చిన అమృత్‌ స్కీంను తమ ప్రభుత్వం గొప్పతనంగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. మైదుకూరు రోడ్డు గాంధీ రోడ్లల్లో డివైడర్లును కూలగొట్టి చెట్లను నరికి కొత్త డివైడర్లు నిర్మించి సున్నాలు కొట్టి పట్టణాన్ని అభివృద్ధి చేసినట్లు ప్రకటించు కోవడం సిగ్గుచేటన్నారు. మున్సిపాలిటీలో జరిగే అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చేసినట్లు చెబుతూ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లకు ప్రాధాన్యం లేకుండాఅడ్డుపడుతూ కౌన్సిల్‌ స్వతంత్రా న్ని హరిస్తున్నాడన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే తెచ్చిన నిధులు ఎన్ని? ఇప్పటికి ఎన్ని పనులు చేశావు ! ఎన్ని కోట్ల బిల్లులు నీ ప్రభుత్వం చెల్లించిందో చెప్పగలవా అని నిలదీశారు. రూ.516 కోట్లకు వేసిన శిలాఫలకాల పనులు ఎక్కడ జరిగాయో చెప్పాలన్నారు. జగన్‌ పులివెందులకు తప్ప రాష్ట్రంలో ఏ పట్టణానికీ నిధులు ఇచ్చి అభివృద్ధి చేయలేదన్నారు. పోలీసు, రెవెన్యూ సబ్‌రిజిస్టర్‌ కార్యాలయాలను అక్రమాలకు నిలయాలుగా మార్చుకుని తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు భూములను అక్రమంగా కబ్జా చేసి దాదాపు వెయ్యికోట్లకుపైగా అక్రమ ఆస్తులు కూడగట్టారన్నారు. ఇలాంటివారిని మళ్లీ ఓట్లేసి జనం గెలించాలా అని ప్రశ్నించారు.

వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే స్టీలు ఫాక్టరీని నాలుగేళ్లలో ఎందుకు నిర్మించలేదన్నారు. ఒక్క రైతు భరోసా కేంద్రం నుంచైనా ఒక్క ధాన్యం బస్తానైనా కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను మోసం చేసిన వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెప్పి ఇంటికి సాగనంపాలన్నారు. లేదంటే రేపటి మీ భవిష్యత్తు అంధకారం కాకతప్పదన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిల్లర్‌ వద్దిబాలుడు, మాజీ శివాలయం చైర్మెన్‌ పల్లా శంకర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2023-07-21T22:40:45+05:30 IST