పుత్తనవారిపల్లె గుట్ట గుల్ల

ABN , First Publish Date - 2023-02-17T23:34:29+05:30 IST

పుల్లంపేట మండల పరిధిలోని కడప-చెన్నై రహదారి పుత్తనవారిపల్లె సమీపంలో ఓ గుట్ట ఉంది. పుల్లంపేట పరిసర ప్రాంతా ల్లో ప్రభుత్వ భూములు ఎక్కడా లేకపోవడం, ఈ గుట్ట సమీపంలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులు దీనిపై కన్నేశారు.

పుత్తనవారిపల్లె గుట్ట గుల్ల
ఎటువంటి రికార్డులు లేకుండా ఆన్‌లైన్‌ చేయడంతో గుట్ట ప్రాంతంలో వేసిన ఫెన్సింగ్‌

అక్రమంగా వంద ఎకరాలకు పైగా ఆన్‌లైన్‌

రాత్రికి రాత్రే భూములు చదును... కంచె ఏర్పాటు

అచేతన స్థితిలో రెవెన్యూ అధికారులు

పుల్లంపేట మండలంలో అక్రమార్కులు దేనినీ వదలడం లేదు. ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయంటే చాలు పాగా వేసేస్తున్నారు. నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి రాత్రికి రాత్రే కబ్జా చేసిన భూముల్లో కంచె వేసి తమ

స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నారు. గతంలో పనిచేసిన అధికారులు అక్రమార్కులకు సహకరించడంతో కబ్జాదారుల పని సులువుగా జరిగిపోతోంది. ఇక్కడ పనిచేసి వెళ్లిన ఓ తహసీల్దారు, ఓ వీఆర్వో అక్రమార్కులతో చేతులు కలిపి వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆన్‌లైన్‌ చేసినట్లు సమాచారం.

రాజంపేట, ఫిబ్రవరి 17: పుల్లంపేట మండల పరిధిలోని కడప-చెన్నై రహదారి పుత్తనవారిపల్లె సమీపంలో ఓ గుట్ట ఉంది. పుల్లంపేట పరిసర ప్రాంతా ల్లో ప్రభుత్వ భూములు ఎక్కడా లేకపోవడం, ఈ గుట్ట సమీపంలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండడంతో అక్రమార్కులు దీనిపై కన్నేశారు. దాదాపు 40 ఏళ్ల క్రితం గుట్ట ముందు భాగంలో ప్రభుత్వ నర్సరీ ఏర్పాటైంది. ఇందుకోసం ప్రభుత్వం పది ఎకరాలకు పైగా కేటాయించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అటవీ శాఖ నర్సరీ నిర్వహిస్తోంది. ఆ తరువాత దీని పక్కనే సబ్‌స్టేషన్‌ను కూడా సుమారు 3 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. పుల్లంపేటకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆదర్శ పాఠశాల, కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలు మంజూరయ్యాయి. పుల్లంపేట మండల కేంద్రంలో ఎక్కడా స్థలం లేకపోవడంతో ఈ గుట్ట ముందు భాగంలో హైవే ఆనుకుని ఆదర్శ పాఠశాల, దీని వెనుక భాగంలో కసూర్భాగాంధీ బాలికల పాఠశాలను నిర్మించారు. వీటన్నింటికీ 10 ఎకరాల భూమిని కేటాయించారు. భవిష్యత్తులో పుల్లంపేటలో ఏవైనా ప్రభుత్వ అవసరాలకు, ఆఫీసులకు స్థలం లేదు. దీంతో ఏదైనా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయాలంటే ఇక్కడే స్థలం కేటాయించాల్సి ఉంటుంది. ఇటీవల పుల్లంపేట, పుత్తనవారిపల్లె గ్రామాల ప్రజలకు జగనన్న కాలనీలకు పక్కా గృహాలు మంజూరు చేసేందుకు గుట్ట భాగంలోనే మంజూరు చేశారు. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా గుట్ట ముందు భాగంలో హైవే ఉండటంతో ఇక్కడ స్థలం విలువ బాగా పెరిగింది. హైవేకు ఒక వైపు నర్సరీ, ఆదర్శ పాఠశాల, సబ్‌స్టేషన్‌ ఉండటంతో హైవేకు మరోవైపు భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. భూములు చదును చేసి లేఅవుట్లు వేస్తున్నారు. దీంతో గుట్ట ప్రాంతంలో స్థలానికి బాగా విలువ పెరిగింది. దీంతో నాలుగు రోజులుగా జేసీబీలు పెట్టి గుట్ట ప్రాంతంలో భూమిని చదును చేస్తున్నారు.

రాజంపేటకు చెందిన ఓ దళిత నాయకుడు గుట్ట కింది భాగంలో నర్సరీ వెనుక వైపున ఏకంగా 5 ఎకరాలను ప్రభుత్వ భూమిలో జేసీబీని పెట్టి కంప చెట్లను తొలగించారు. గతంలో ఇదే గుట్ట నుంచే రోడ్లకు కూడా గ్రావెల్‌ను తరలిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్నంతా కబ్జాదారులు చదును చేస్తున్నారు. గతంలో పనిచేసిన ఓ తహసీల్దారు, ఓ వీఆర్వో ఇక్కడ ఎటువంటి రికార్డులు లేకుండానే ఇరువురు వ్యక్తులకు ఒక్కొక్కరికీ ఒకటిన్నర ఎకరా చొప్పున ఆన్‌లైన్‌ చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఏకంగా ఐదు ఎకరాలు చదును చేసి చుట్టూ ఫెన్సింగ్‌ కూడా వేశారు. అందులో కొంత భాగంలో మూడు రోజుల క్రితమే మామిడి మొక్కలు కూడా నాటారు. మరికొంతమంది అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ గుట్ట ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉండటంతో అసైన్‌మెంట్‌ కమిటీ ద్వారా పట్టాలు పొందేందుకు పోటీ పడుతున్నారు. ఈ గుట్ట అన్యాక్రాంతమైతే భవిష్యత్తులో పుల్లంపేటలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలంటే భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.

ఇక్కడ ఆన్‌లైన్‌ చేసిన తహసీల్దారు, సహకరించిన వీఆర్వోలే రంగంపల్లె రెవెన్యూ పొలంలో కూడా ఎక్కువగా ఎటువంటి రికార్డులు లేకుండానే ఆన్‌లైన్‌ చేసినట్లు తెలుస్తోంది. 587/1 సర్వే నెంబరులో లీలావతి పేరుతో నాలుగు ఎకరాలు ఆన్‌లైన్‌ చేశారు. అలాగే 522 సర్వే నెంబరులో సబ్‌ డివిజన్‌ చేసి కొందరు 3 నుంచి 4 ఎకరాల వరకు ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. ప్రస్తుత తహసీల్దారుకు ఫిర్యాదులు రావడంతో ఇందులో 587/1ని ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌గా మార్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ భూములు ఒక్కొక్కరికీ 4 ఎకరాల చొప్పున ఆన్‌లైన్‌ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. దొంగ మార్గంలో ఆన్‌లైన్‌ చేయించుకున్న కబ్జాదారులు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించుకుని బ్యాంకు రుణాలు కూడా పొందుతున్నారు. కొంతమంది ఈ భూముల చుట్టూ కంచెతో పాటు బోర్లు కూడా వేశారు. గతంలో పనిచేసిన వీఆర్వో, తహసీల్దారు కాసులకు కక్కుర్తి పడి అక్రమాలు చేసి ప్రభుత్వ భూములు ఆన్‌లైన్‌ చేయడంతో ప్రస్తుతం పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటూ అచేతన స్థితిలో ఉంటున్నారు. ఏదేమైనా పుత్తనవారిపల్లె గుట్ట సమీపంలో ఉన్న భూమిని కాపాడితే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ భూమి తప్ప పుల్లంపేట చుట్టుపక్కల ఎటువంటి ప్రభుత్వ భూమి లేదని స్థానికులు అంటున్నారు.

హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాము..

గుట్ట ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాము. ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము.

- నరసింహకుమార్‌, తహసీల్దార్‌

Updated Date - 2023-02-17T23:34:30+05:30 IST