గురుకుల పాఠశాలలో విషజ్వరాలు

ABN , First Publish Date - 2023-02-06T23:08:30+05:30 IST

మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొత్తం 700 మంది విద్యార్థుల్లో 140 మందికి పైగా విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.

గురుకుల పాఠశాలలో విషజ్వరాలు
విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

నందలూరు, ఫిబ్రవరి 6 : మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మొత్తం 700 మంది విద్యార్థుల్లో 140 మందికి పైగా విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాల వాతావరణం అపరిశుభ్రంగా మారడంతో పాటు వంట గది, తాగునీటి ట్యాంకు అధ్వానంగా ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జ్వరాలు విజృంభిస్తున్న విషయం తెలుసుకున్న మండల ప్రభుత్వ వైద్యాధికారి సృజన వైద్య బృందంతో కలిసి బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన 10వ తరగతికి చదువుతున్న హాసిని అనే ఓ బాలిక తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ తప్పడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. బాలిక ఆరోగ్యం గురించి అడిగితే పాఠశాల ఉపాధ్యాయురాలు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. జ్వరాలు విజృంభిస్తుండటంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళుతున్నారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ మౌనిక మాట్లాడుతూ రెండు రోజుల క్రితం హాసిని అనే విద్యార్థిని కళ్లు తిరిగి కిందపడిపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు తీసుకెళ్లి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చూపించారని తెలిపారు. పాఠశాలలో మరికొంతమందికి జ్వరాలు ఉండటంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స చేయిస్తున్నామని, తాము ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని, విద్యార్థినుల ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - 2023-02-06T23:08:32+05:30 IST