జన నీరాజనం
ABN , First Publish Date - 2023-05-26T06:24:56+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జమ్మలమడుగు నియోజకవర్గంలో జనాలు నీరాజనాలు పలికారు. గురువారం ఉదయం 8.30గంటలకు పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లె శివార్లలోని విడిది కేంద్రం నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర 110వ రోజు ప్రారంభమైంది. యువగళం

హోరెత్తిన యువగళం పాదయాత్ర
అడుగడుగునా లోకేశ్‌కు ఘన స్వాగతం
జమ్మలమడుగు/పెద్దముడియం, మే 25: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు జమ్మలమడుగు నియోజకవర్గంలో జనాలు నీరాజనాలు పలికారు. గురువారం ఉదయం 8.30గంటలకు పెద్దముడియం మండలం ఎన్.కొట్టాలపల్లె శివార్లలోని విడిది కేంద్రం నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర 110వ రోజు ప్రారంభమైంది. యువగళం పాదయాత్ర ఆద్యంతం జోరుగా సాగింది. 9.30గంటలకు పెద్దపసుపుల గ్రామం చేరింది. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నేతలు, అభిమానులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు మంగళహారతులు పట్టారు. లోకేశ్‌ను గజమాలతో సత్కరించారు. బాణసంచా పేలుస్తూ డప్పువాయిద్యాలతో గ్రామంలోకి స్వాగతం పలికారు. మహిళలు, వృద్ధులతో లోకేశ్ మాట్లాడారు. తమ సమస్యల గురించి మహిళలు, వృద్ధులు మొరపెట్టుకున్నారు. మాధవస్వామి దేవాలయ సమీపంలో లోకేశ్ ఓ చిన్నారిని ఎత్తుకుని తనతో రమ్మని పిలిచారు. తన కుమారుడు దేవాన్ష్‌తో పాటు కలిసి ఆడుకోవాలంటూ చిన్నారిని అడిగారు. మహిళలు చాలాసేపు ఆయనతో ముచ్చటించారు. అనంతరం గ్రామ చావిడి వద్ద భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు, ప్రజలతో ఆయన సమస్యలపై మాట్లాడారు. మొత్తమ్మీద గ్రామంలో పాదయాత్ర అంతా అభిమానుల సందడి మధ్య సాగింది.
వినతుల వెల్లువ
పాదయాత్ర జమ్మలమడుగు బైపా్‌సరోడ్డుకు ఉదయం 11.40 గంటలకు చేరుకుంది. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. కొట్టాలుపల్లెలో నెలకొన్న మంచినీటి సమస్య, స్థలాలు ఆక్రమణ, తదితర వాటికి సంబంధించి నారా లోకేశ్‌కు వినతి పత్రాలు అందజేశారు. జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ముస్లిం మైనార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. పేద ముస్లింల కోసం కమ్యూనిటీ హాలు నిర్మించాలని, ముస్లింలకు ప్రత్యేక శ్మశాన వాటికకు స్థలం ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా ఉర్దూ పాఠశాల, జూనియర్ కళాశాల నిర్మించాలని కోరారు. దుల్హన్ పథకం కింద రూ.లక్ష ఇస్తానని జగన్ హామీ ఇచ్చి చివరిలో మాట మార్చి 10వ తరగతి చదివిన వారికి మాత్రమే అనడంతో వేలాది మంది దుల్హన్ పథకానికి అనర్హులుగా మారారని వాపోయారు. టీడీపీ అధికారంలోకి రాగానే 10వ తరగతి నిబంధన లేకుండా దుల్హన్ పథకం ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. బీడీ కార్మికులకు స్థలాలు ఇచ్చి కాలనీ ఏర్పాటు చేయాలని, తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని, ప్రతి కార్మికునికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు.
వీటిపై స్పందించిన నారా లోకేశ్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారం ఖాయమని, ఆ దిశగా ప్రజలు టీడీపీ వెంట ఉన్నారని జమ్మలమడుగు ఇన్‌చార్జి భూపేశ్‌రెడ్డి తెలిపారు. రైతులను నమ్మించి మోసం చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం జమ్మలమడుగు శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి లోకేశ్ చేరుకున్నారు. విడిది కేంద్రం వద్ద పలువురు తమ సమస్యలను లోకేశ్ దృష్టికి తెచ్చారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 11.30 గంటలకు ముగిసింది. 12.3 కి.మీ మేర నడవడంతో మొత్తం పాదయాత్ర 1,423.7 కి.మీ చేరింది.
నాలుగురోజులు విరామం
మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు యువగళం పాదయాత్రకు శుక్రవారం నుంచి నాలుగు రోజులు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం జమ్మలమడుగులో యాత్రం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నారా లోకేశ్ కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, ప్రొద్దుటూరు ఇన్‌చార్జి ఉక్కు ప్రవీణ్, రితేశ్‌రెడ్డి, కడప టీడీపీ ఇన్‌చార్జి అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ నేతలు కేకే ఖదీర్, స్థానిక ముస్లిం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.