అశ్వవాహనంపై పట్టాభిరాముడి వైభవం
ABN , First Publish Date - 2023-04-03T23:39:04+05:30 IST
వాల్మీకిపురం పట్టాభిరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అశ్వవాహనంపై పట్టాభిరాముడి ఊరేగింపు, పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు.
వేడుకగా పార్వేట ఉత్సవం
వాల్మీకిపురం, ఏప్రిల్ 3: వాల్మీకిపురం పట్టాభిరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అశ్వవాహనంపై పట్టాభిరాముడి ఊరేగింపు, పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, ఆలయంలోని మూలవర్లకు అభిషేకం, తోమాలసేవలతో విశేష పూజలు జరిగాయి. భోగోత్సవమూర్తులైన సీతారామలక్ష్మణులకు విశేష అలంకరణలతో తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ మండపంలో యాగశాల వైదిక కార్యక్రమాలు సాగాయి. సాయంత్రం పట్టాభిరాముడికి ఊంజల్‌సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక పార్వేట మండపం వద్ద ఉత్సవ వేడుకలు నిర్వహిస్తూ భక్తులకు విశిష్టతను తెలియజేశారు. అనంతరం రాత్రికి అశ్వవాహనంపై పట్టాభిరాముడిని విశేషాలంకరణలతో అధిష్టింప చేసి పురవీధులలో నిర్వహించిన నగరోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా కోలాటలు, చెక్కభజనలు, మహిళల చలిపిండి దీపారాధనలు, టీటీడీ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రికి హంసవాహనంపై పట్టాభిరాముడి నగరోత్సవం, ధ్వజావరోహణ కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమాలలో టీటీడీ అధికారులతో పాటు ఆలయ పండితులు పాల్గొన్నారు.