ఆగని మాతా శిశు మరణాలు

ABN , First Publish Date - 2023-02-06T23:11:44+05:30 IST

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... జిల్లాలో మాతా శిశు మరణాలు ఆగడం లేదు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి ప్రధాన కారణాలతో గర్భిణులు, బాలింతలు మృత్యువాతపడుతుండగా పుట్టిన వెంటనే నాణ్యమైన సంరక్షణ లేకపోవడం, చికిత్స లేకపోవడం.. ముందస్తుగా పుట్టడం, అంటువ్యాధుల కారణంగా నవజాత శిశువులు చనిపోతున్నారు.

ఆగని మాతా శిశు మరణాలు

9 నెలల్లో 17 మంది గర్భిణులు, బాలింతలు

157 మంది చిన్నారులు మృతి

ఫలితమివ్వని ప్రభుత్వ చర్యలు

ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... జిల్లాలో మాతా శిశు మరణాలు ఆగడం లేదు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి ప్రధాన కారణాలతో గర్భిణులు, బాలింతలు మృత్యువాతపడుతుండగా పుట్టిన వెంటనే నాణ్యమైన సంరక్షణ లేకపోవడం, చికిత్స లేకపోవడం.. ముందస్తుగా పుట్టడం, అంటువ్యాధుల కారణంగా నవజాత శిశువులు చనిపోతున్నారు. రాష్ట్రంలో ఈ శాతం పక్కనున్న రాష్ట్రాల కంటే రెట్టింపుగా ఉండడం ఆందోళన కలిగించే అంశం.

(రాయచోటి-ఆంధ్రజ్యోతి):

ఒకప్పుడు అంతగా వైద్యసేవలు అందుబాటులో ఉండేవి కావు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రసవాలకు సైతం అంతగా సురక్షితం కాని మంత్రసానులపైనే ఆధారపడేవారు. అయితే పట్టణ ప్రాంతాలలో ప్రస్తుతం వైద్య సేవలు గతంతో పోల్చితే చాలా మెరుగ్గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కూడా చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఏర్పడుతున్న ప్రభుత్వాలు వైద్య రంగం మీద దృష్టి సారిస్తున్నాయనే చెప్పవచ్చు. ఈ నేపధ్యంలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందుతున్న వైద్యం కొద్దోగొప్పో మెరుగ్గానే ఉంది. అయితే వైద్య సేవలు మెరుగైనప్పటికీ గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల మరణాలు మాత్రం తగ్గడం లేదు.

సగటున 2384 కాన్పులు

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు 9068, ప్రైవేటు ఆసుపత్రులు 13,874 ఉన్నాయి. జిల్లాలో మదనపల్లె, రాయచోటి, రాజంపేట, పీలేరులలో సీమాంక్‌ కేంద్రాలు ఉన్నాయి. నెలకు ప్రైవేటు ఆసుపత్రులలో సుమారు 1387, ప్రభుత్వ ఆసుపత్రులలో 997 ప్రసవాలు జరుగుతున్నాయి. సంవత్సరానికి 23,842 కాన్పులు జరుగుతుండగా.. సగటున నెలకు 2384 ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా అంతటా 25,622 మంది గర్భవతులు ఉన్నారు.

17 మంది గర్భిణులు, బాలింతలు

తొమ్మిది నెలల లెక్కలను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు జిల్లాలో 17 మంది గర్భిణులు, బాలింతలు మృతి చెందారు. సగటున జిల్లాలో ప్రతి 1000 మందికి ఉమ్మడి కడప జిల్లాలో 38 మంది, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 35 మంది చనిపోతున్నారు. రామాపురం మండలం బండపల్లె పంచాయతీ పొత్తుకూరువాండ్లపల్లెకు చెందిన లక్ష్మిప్రసన్న ఈ ఏడాది జనవరి 14న కడప రిమ్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు గుండెపోటు రావడంతో మృతి చెందింది. మదనపల్లె పట్టణంలోని విజయనగర్‌కాలనీకి చెందిన బాలింత పావని తీవ్ర అస్వస్థతకు గురై జిల్లా ఆసుపత్రిలో చనిపోయింది. రామసముద్రం మండలం పెద్దకూరపల్లె పంచాయతీ మట్లవారిపల్లెకు చెందిన రెడ్డిశేఖర్‌ భార్య పుష్ప గత నెల 31న మదనపల్లె జిల్లా ఆసుపత్రికి వచ్చి పురిటినొప్పులు తట్టుకోలేక బీపీ తగ్గి మృతి చెందింది. ఈమెకు ఇది రెండవ కాన్పు. సాధారణంగా పౌష్టికాహరలోపం, రక్తహీనత, తీవ్ర రక్తస్రావం, సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల గర్భిణులు, బాలింతలు మృత్యువాతపడుతున్నారు. కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో ఎక్కువ శాతం మంది మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడుతూ ఉంటారు. రక్తహీనత సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి కారణాల వల్ల ఎక్కువ మంది మృత్యువాతపడుతున్నారు.

157 మంది ఐదేళ్లలోపు చిన్నారుల మృతి

జిల్లాలో గత 9 నెలల కాలంలో 157 మంది ఐదు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులు మృతి చెందారు. 9 మంది సంవత్సరం వయస్సున్న వాళ్లు మరణించారు. సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కువగా 28 రోజుల్లోపు మరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. పుట్టిన బిడ్డకు వెంటనే నాణ్యమైన సంరక్షణ, చికిత్స లేకపోవడంతో పాటు అంటువ్యాధుల కారణంగా కూడా మరణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓబులవారిపల్లె మండలంలో ఒక సంవత్సరం లోపు ఉన్న చిన్నారి నెలల తక్కువగా జన్మించి మృతి చెందింది. పీలేరు పట్టణంలో గత ఏడాది నవంబరు 15న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నవజాత శిశువు మరణించింది. మరుసటిరోజు మరో ప్రైవేటు ఆసుపత్రిలో బాలింత కూడా మృతి చెందింది. లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు పంచాయతీ పర్వతరెడ్డిగారిపల్లెకు చెందిన సుహాసిని డిసెంబరులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన రెండు రోజులకే పాప మృతి చెందింది. పుట్టుకతోనే పాపకు గుండె జబ్బు ఉన్నట్లు తెలిసింది. తంబళ్లపల్లె మండలంలో నెల లోపు చిన్నారులు ముగ్గురు మృతి చెందినట్లు ఎంపీహెచ్‌సీఈవో వెంకటరమణ తెలిపారు. గత ఏడాది డిసెంబరు 28న కోటకొండ గ్రామం కృష్ణాపురానికి చెందిన సుబ్రమణ్యం భార్య పార్వతి మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఉమ్మనీరు ఎక్కువగా తాగడంతో తిరుపతిలోని రుయాకు తీసుకెళ్లారు. అక్కడ ఆ బిడ్డ మృతి చెందింది. ఈ ఏడాది జనవరి 5న గంగిరెడ్డిపల్లెకు చెందిన మస్తాన్‌రెడ్డి భార్య సాయిప్రసన్న మదనపల్లె జిల్లా వైద్యశాలలో చిన్నారికి జన్మనిచ్చింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ మృతి చెందింది. జనవరి 9న గుండ్లపల్లెకు చెందిన రెడ్డెప్ప భార్య రస్మిత మదనపల్లె జిల్లా వైద్యశాలలో మొదటి కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ మృతి చెందింది. ఇటువంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం, జిల్లా అధికారులు మాతా శిశు మరణాలు తగ్గించాలని ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి మాత్రం తగ్గడం లేదు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి గర్భిణులు, బాలింతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా కింది స్థాయి సిబ్బందిని ఆదేశించాలని పలువురు కోరుతున్నారు.

మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం

- కొండయ్య, డీఎంహెచ్‌వో

జిల్లాలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల మరణాలు తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా గర్భనిర్ధారణ పరీక్షలు చేయించి గర్భవతులను గుర్తిస్తున్నాం. స్థానికంగా ఉండే ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రసవం అయ్యేంత వరకు నాలుగుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి నెలా ఐరన్‌పాలిక్‌ మాత్రలు ఇస్తున్నాం. నెలకు 180 మాత్రలు ఇస్తున్నాం. బర్త్‌ప్లాన్‌ నాలుగుసార్లు చేస్తాం. ఆరోగ్య కార్తకర్త ద్వారా డాక్టర్‌ పరీక్షిస్తారు. గర్భవతులకు కాన్పు సమయంలో ఇంటి దగ్గర కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోనే చేయాలని చెబుతున్నాం. కాన్పు అయిన తర్వాత ఆరుసార్లు ఆరోగ్య కార్యకర్త, వైద్యుడితో రెండు నెలల పాటు పరీక్షలు నిర్వహిస్తున్నాం.

Updated Date - 2023-02-06T23:11:46+05:30 IST