గండికోట పరిహారంపై ప్రభుత్వంలో కదలిక

ABN , First Publish Date - 2023-06-02T23:03:21+05:30 IST

గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది.

గండికోట పరిహారంపై ప్రభుత్వంలో కదలిక

లోకేష్‌ యువగళం ఎఫెక్ట్‌ -

కొండాపురం, జూన్‌ 2: గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంపై ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. మంగళవారం జమ్మలమడుగు బహిరంగ సభలో గండికోట నిర్వాసితులకు జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లు కావస్తున్నా పూర్తిగా పరిహారం చెల్లించలేదని లోకేష్‌ విమర్శించారు. ఇంత వరకు ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడం ఏమిటని ఆయన ఘాటుగా విమర్శించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఆఘమేఘాలపై పరిహారం పంపిణీ ఉత్తర్వులను జారీ చేసిం ది. గండికోట ప్రాజెక్టు కింద మొదటి 14 ముంపు గ్రామాల నిర్వాసితులు ధృవపత్రాలను వారంలోగా కొండాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించాలని జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మొదటి విడత 14 గ్రామాలకు ఇంకా ఇంత వరకు జగన్‌ ప్రభుత్వం అదనంగా ఇస్తానన్న రూ.3.25లక్షలు చెల్లించలేదు. ఈ 14 గ్రామాలకు సంబంధించి 9096 మంది నిర్వాసితులున్నారు. వీరికి రూ.295.62కోట్లు మేర నిధులు అవసరం కానున్నాయి. చౌటిపల్లె, గండ్లూరు, ఓబన్నపేట, బొమ్మేపల్లె, దొరువు, బుక్కపట్నం, రేపల్లె, ముచ్చుమర్రి, పక్కీరుపేట, దత్తాపురం, నేదరపేట, కొర్రపాడు గ్రామాలకు ఈ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంది. ఎప్పుడు పరిహారం చెల్లిస్తామని చెప్పలేదు కానీ ప్రస్తుతానికి పరిహారంపై కదలిక రావడంతో లోకేష్‌ ప్రభావమేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2023-06-02T23:03:21+05:30 IST