కేసీ కెనాల్‌ కట్ట పక్కన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2023-03-25T23:35:52+05:30 IST

కడప నగరం కేసీ కెనాల్‌ కట్ట పక్కన రోడ్డు విస్తరణ పేరుతో పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తరవాతనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్‌ చేశారు.

 కేసీ కెనాల్‌ కట్ట పక్కన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న అఖిలపక్ష నేతలు

- 28న అఖిలపక్షం పర్యటన

కడప (సెవెన్‌రోడ్స్‌), మార్చి 25 : కడప నగరం కేసీ కెనాల్‌ కట్ట పక్కన రోడ్డు విస్తరణ పేరుతో పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తరవాతనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం వారు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్తార్‌, సీపీఎం కడప నగర కార్యదర్శి ఎ.రామ్మోహన్‌, సీపీఐ నగర డిప్యూటీ కార్యదర్శి కేసీ బాదుల్లా, బీఎస్పీ రాష్ట్ర నాయకులు గురప్ప, లోక్‌సత్తా నాయకులు దేవర క్రిష్ణ, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి మగ్బుల్‌బాషా, ఎంఆర్‌ఎఫ్‌ నాయకులు దస్తగిరి డిమాండ్‌ చేశారు. కేసీ కెనాల్‌ కట్ట పక్కన గత 30 సంవత్సరాలుగా స్థలాలు కొని ఇల్లు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న ప్రజలను అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలని చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. కేసీ కెనాల్‌ కట్ట క్కన ఉన్న పట్టా భూములకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే రోడ్డుకు ఉపయోగించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కడప నగ ర నడిబొడ్డున అనేక రోడ్లు ఇరుకుగా ఉన్నాయని, వాటిని విస్తరించాల్సిన అవసరం ఉన్నా ఆ పని మాత్రం ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. ఈ నెల 28న కడప నగరంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని క్షేత్రస్థాయి పర్యటన చేస్తామన్నారు.

Updated Date - 2023-03-25T23:35:52+05:30 IST