నేనున్నానని..

ABN , First Publish Date - 2023-06-01T00:39:35+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర పలువురికి భరోసా కల్పించింది. లోకేశ్‌తో నేరుగా ముఖాముఖి కలిసినప్పుడు సమస్యలు చెప్పుకున్నవారికి, పాదయాత్రలో స్థానిక సమస్యలు, ఇతరత్రా

నేనున్నానని..

ముఖాముఖి, సమస్యలు చెప్పుకున్న వారికి లోకేశ్‌ భరోసా

చిరునవ్వుతో అందరి సమస్యలు వింటూ.. ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ..

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ

జనంతో మమేకమై వడివడిగా పాదయాత్రలో అడుగులు

దారి పొడవునా లోకేశ్‌కు జనం నీరాజనం

హారతులు పట్టి పూలు చల్లి ఘన స్వాగతాలు

కడప, మే 31(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర పలువురికి భరోసా కల్పించింది. లోకేశ్‌తో నేరుగా ముఖాముఖి కలిసినప్పుడు సమస్యలు చెప్పుకున్నవారికి, పాదయాత్రలో స్థానిక సమస్యలు, ఇతరత్రా సమస్యలను లోకేశ్‌ దృష్టికి తెచ్చిన వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తానంటూ హామీ ఇస్తూ లోకేశ్‌ పాదయాత్ర కొనసాగింది.

బుధవారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి విడిది కేంద్ర వద్ద చేనేత కార్మికులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. టెక్స్‌టైల్స్‌ పార్కులో కంపెనీలు రాక ఉపాధి అవకాశాలు లేవని శ్రీనివాసులు, చేనేత కార్మికులకు బీమా పథకాలు రద్దు చేశారంటూ బాషా, చేనేతలకు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నామంటూ లక్ష్మినారాయణ, లో ఓల్టేజీ కారణంగా ఇబ్బంది పడుతున్నాం, ఉత్పత్తుల్లో నాణ్యత దెబ్బతింటుందంటూ రామచంద్ర అన్నారు. చేనేతపై ఆధారపడి అనేక రంగాలు ఉన్నా, కేవలం కొందరికే సాయం ఇస్తున్నారంటూ నాగలక్ష్మయ్య అన్‌ సీజనులో ఉపాధి ఇవ్వడం లేదంటూ, షరీఫ్‌, ప్రభుత్వం నుంచి సబ్సిడీ రావడంలేదంటూ వెంకటక్రిష్ణయ్య, జగన్‌ ప్రభుత్వంలో చేనేత ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ సురేశ్‌, జీఎస్టీ చేనేతకు పెనుభారంగా మారిందంటూ తిరుమందాసులు లోకేశ్‌ దృస్టికి తెచ్చారు. వారి సమస్యలు సావధానంగా విన్న లోకేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలను దత్తత తీసుకుంటానన్నారు. 5 శాతం జీఎస్టీ భారం లేకుండా చేస్తాం, చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లతో పాటు కామన్‌ వర్కింగ్‌ షెడ్లు నిర్మిస్తాం, చంద్రబీమాను కొనసాగిస్తాం అని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో ఉన్న సబ్సిడీలన్నీ కొనసాగిస్తామని, పెరిగిన ముడిసరుకుల ధరలు తగ్గిస్తామని అన్నారు. చేనే కార్మికులందరినీ ఆదుకుంటామన్నారు.

సమస్యలు వింటూ.. సావధానంగా

విడిది కేంద్రం నుంచి సాయంత్రం 4.55కు లోకేశ్‌ పాదయాత్ర మొదలైంది. దారి పొడవునా చౌడూరు, పెద్దశెట్టిపల్లె, నరసింహకొట్టాల, చౌటపల్లె క్రాస్‌ వద్ద ప్రజలు లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల సమస్యలు సావధానంగా పాదయాత్ర సాగింది. కోనేరు రిపేరు మరమ్మత్తుతో పాటు ప్రహరీ గోడ నిర్మించాలని, సుంకులమ్మ గుడి పక్కనున్న పంచాయతీ స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మించాలని, శంకర్‌రెడ్డి కాలనీ నుంచి దేవగుడి వరకు డ్రైనేజీ నిర్మించాలంటూ స్థానికులు లోకేశ్‌ దృష్టికి తెచ్చారు. టీడీపీ హయాంలో పంచాయతీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వేశామని, జగన్‌ నిర్వాకం కారణంగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఫైనాన్స్‌ నిధులు 8,650 కోట్లు దారి మళ్లించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని లోకేశ్‌ న్నారు.

5.55 గంటలకు జమ్మలమడుగు నియోజకవర్గంలో పాదయాత్ర ముగించి 5.56కు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అడుగు పెట్టారు. ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వీరశివారెడ్డి, వరదరాజులరెడ్డి, సీఎం సురేశ్‌నాయుడుతో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలు బాణసంచాల మధ్య రహదారిపై పూలు చల్లుతూ పుష్పగుచ్ఛాలు ఇస్తూ స్వాగతం పలికారు. 6.10కు చౌడూరుకు చేరుకోగా పలువురు రైతులు లోకేశ్‌తో మాట్లాడారు. నాణ్యత లేని విత్తనాలతో పత్తి దిగుబడి తగ్గిందని, పత్తికి మద్దతు ధర లేదని వాపోయారు. జగన్‌ రూ.3500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానంటూ చెప్పి మడమ తిప్పారని లోకేశ్‌ అన్నారు. కమీషన్ల కోసమే కల్తీ విత్తనాలను అధికార పార్టీ పెంచి పోషిస్తోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపి ఏపీ సీడ్స్‌ ద్వారా నాణ్యమైన విత్తనాలు ఇస్తామన్నారు.

శంకరాపురంలో చేనేత కార్మికులు లోకేశ్‌కు పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. శెట్టిపల్లెలో పలు సమస్యలు లోకేశ్‌ దృష్టికి తెచ్చారు. పెన్నానది నుంచి రోజూ వందల సంఖ్యలో రైతుల వ్యవసాయ భూమి నుంచి ఇసుక తోలుకుపోతుండటంతో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్నాలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఉక్కుపాదం మోపి ప్రొద్దుటూరు ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఇసుక పాలసీ సరళతరం చేస్తామని చెప్పారు. నరసింగాపురంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు లోకేశ్‌కు వినతిపత్రం అందించారు. 8గంటల ప్రాంతంలో చౌటుపల్లె బాస్‌ క్రికెట్‌ ప్రాంగణం వద్ద లోకేశ్‌ విడాది కేంద్రానికి చేరుకున్నారు.

నారా లోకేశ్‌కు ఘనస్వాగతం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడి విడిది కేంద్రం నుంచి 112వ రోజు బుధవారం సాయంత్రం 4.55 గంటలకు లోకేశ్‌ పాదయాత్ర మొదలుపెట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ముగించుకుని ప్రొద్దుటూరు నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. 10.3 కి.మీ నడిచి చౌటపల్లె బాస్‌ క్రికెట్‌ ప్రాంగణంలో బస చేశారు. ఇప్పటి వరకు 1446.1 కి.మీ తిరిగారు. లోకేశ్‌కు దారి పొడవునా జనం నీరాజనాలు పలికారు. ప్రొద్దుటూరులో పెద్దఎత్తున దారి పొడవునా మహిళలు, పిల్లలు లోకేశ్‌ను చూసేందుకు రోడ్లపైకి వచ్చారు. హారతులు, పూలు చల్లి లోకేశ్‌పై అభిమానం చాటారు. అడుగడుగునా ప్రజల పలకరింపులు, ఆప్యాయతల నడుమ పాదయాత్ర చైతన్యవంతంగా సాగింది. పలు చోట్ల మహిళలు మంగళహారతులు పట్టారు. ప్రజల సమస్యలను వింటూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ నారా లోకేశ్‌ ముందుకు సాగారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, ఎమ్మెల్సీ శివనాధరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్‌, భూపేశ్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, అమీర్‌బాబు, నేతలు సీఎం సురేశ్‌నాయుడు, వికాస్‌ హరి, ఈవీ సుధాకర్‌రెడ్డి, వీఎస్‌ ముక్తియార్‌, పుత్తా చైతన్యరెడ్డి, లక్ష్మిరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, హరిప్రసాద్‌, గోవర్దన్‌రెడ్డి, లక్ష్మిరెడ్డి, మన్మోహన్‌రెడ్డి, జనార్దన్‌ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

నేటి పాదయాత్ర ఇలా..

యువగళం 113వ రోజు పాదయాత్ర గురువారం ప్రారంభం కానుంది. లోకేశ్‌ ఇప్పటి వరకు 1446.1 కిమీ నడిచారు. నేటి పాదయాత్ర జమ్మలమడుగు, ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనుంది.

సాయంత్రం 4గంటలకు చౌటపల్లి బాక్స్‌ క్రికెట్‌ ప్రాంగణం వద్ద విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం

4.10కి దొరసానిపల్లెలో బుడగజంగాలతో సమావేశం

4.35కు ప్రొద్దుటూరు ఆంజనేయస్వామి విగ్రహం వద్ద యువతతో సమావేశం

4.40కి ప్రొద్దుటూరు గాడిదకొట్టాలు వద్ద స్థానికులతో సమావేశం

4.45కు జీవనజ్యోతి స్కూలు వద్ద చేనేతలతో సమావేశం

4.50కి ఆర్ట్స్‌ కాలేజీ జంక్షన్‌ వద్ద స్థానికులతో సమావేశం

5.00కు సాయిబాబా గుడివద్ద స్థానికులతో సమావేశం

5.10కి ఎల్‌ఐసీ ఆఫీసు వద్ద క్రిస్టియన్లతో సమావేశం

5.20కి అమ్మవారిశాల వద్ద ఆర్యవైశ్య సామాజిక వర్గీయులతో సమావేశం

5.25కు బంగారు అంగళ్లు వీధిలో స్వర్ణకారులతో సమావేశం

5.30కు దర్గా వద్ద ముస్లింలతో సమావేశం

5.45కు శివాలయం సర్కిల్‌లో బహిరంగసభ, లోకేశ్‌ ప్రసంగం

7.05గంటలకు ఆర్టీసీ బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం

7.55కు కొత్తపల్లి రిలయన్స్‌ జంక్షన్‌లో స్థానికులతో సమావేశం

8.25కు కొత్తపల్లి ఖాదరబాద్‌లో స్థానికులతో మాటామంతి

8.35కు కొత్తపల్లి శివారు పీఎన్‌ఆర్‌ ఎస్టేట్‌ వద్ద విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-06-01T00:39:35+05:30 IST