లోకేశ్‌.. దూకుడు

ABN , First Publish Date - 2023-06-03T01:33:47+05:30 IST

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే పాదయాత్ర పూర్తయింది. అక్కడ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియంలో పాదయాత్ర ప్రారంభమైంది. పెద్దముడియం మండలంలో ఘన స్వాగతం పలికారు. ఇక జమ్మలమడుగులో

లోకేశ్‌.. దూకుడు

వైసీపీ అక్రమాలపై డైరెక్టు అటాక్‌

ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపై బుల్లెట్‌ లా పేలుతున్న అస్త్రాలు

భూకబ్జాలు, గ్యాంబ్లింగ్‌, ట్యాక్స్‌లపై తీవ్రస్థాయిలో దాడి

మైదుకూరు, కమలాపురం, కడప, బద్వేలులో ఏ అక్రమాలు వెలికితీస్తారో... వైసీపీ శ్రేణుల్లో వణుకు

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు బహిరంగసభలు సక్సె్‌స

పాదయాత్రలో నారా లోకేశ్‌కు బ్రహ్మరథం

మహిళలు, యూత్‌ నుంచి అపూర్వ స్వాగతం

ఉబ్బి తబ్బిబ్బవుతున్న టీడీపీ శ్రేణులు

సీఎం జిల్లాలో ఆదరణపై లోకేశ్‌ టీంలో ఫుల్‌జోష్‌

వైసీపీలో కలవరం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంతగడ్డ కడప గడ్డపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ దూకుడు పెంచారు. యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ జిల్లాలో జగన్‌ అండ్‌ కో బ్యాచ్‌ అవినీతి, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లపై తూర్పారాబడుతున్నారు. లోకేశ్‌పై గతంలో రకరకాలుగా ట్రోల్‌ చేసిన బ్యాచ్‌ ఇప్పుడు లోకేశ్‌ వాగ్ధాటి.. కార్యకర్తలతో, జనంతో మమేకమవుతున్న తీరు చూసి ఔరా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో పాదయాత్ర ఒక ఎత్తయితే సీఎం జిల్లాలో పాదయాత్ర ఒక ఎత్తు. ఆరోగ్యం బాగా లేక దగ్గు, జలుబుతో బాధపడుతున్నా లోకేశ్‌ పాదయాత్ర కొనసాగిస్తూ.. తెలుగుతమ్ముళ్లలో జోష్‌ నింపుతూ... వైసీపీ శ్రేణులకు వణుకు పుట్టిస్తున్నారు.

(కడప - ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే పాదయాత్ర పూర్తయింది. అక్కడ పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియంలో పాదయాత్ర ప్రారంభమైంది. పెద్దముడియం మండలంలో ఘన స్వాగతం పలికారు. ఇక జమ్మలమడుగులో జరిగిన సభకు జనం పోటెత్తడంతో జనసంద్రంగా మారింది. సభకు హాజరైన జనాన్ని చూసి లోకేశ్‌ టీం హ్యాపీగా ఫీలైంది. ఇక ప్రొద్దుటూరులో పాదయాత్ర అడ్డుకునేందుకు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి కవ్వింపు చర్యలు చేపట్టారు. దారిపొడవునా టీడీపీ హయాంలో అభివృద్ధి సున్నా అంటూ రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టీడీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా మహిళలు, యువత, పాదయాత్రకు నీరాజనం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పాదయాత్ర జరిగిన వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఇక శివాలయం సెంటరులో జరిగిన సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఎన్నడూ లేని జోష్‌ నింపింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనం భారీగా రావడం.. పాదయాత్రకు అపూర్వ స్పందన లభించడంతో టీడీపీకి మంచి కిక్‌ ఇచ్చింది. ఇక మైదుకూరు నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రకు భారీ స్వాగతం లభించింది.

ఎమ్మెల్యేల అవినీతిపై తూటాల్లా...

గతంలో లోకేశ్‌ స్పీచ్‌పై వైసీపీ బ్యాచ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేసేది. అయితే అదే లోకేశ్‌ జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో జరగిన బహిరంగసభలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డిపై చేసిన ఆరోపణలు తూటాల్లా పేలాయి. వారి అవినీతి అక్రమాల గురించి లోకేశ్‌ మాట్లాడుతుంటే జనం నుంచి విశేష స్పందన రావడం గమనార్హం. జమ్మలమడుగులో సుధీర్‌రెడ్డిపై లోకేశ్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘చికెన్‌సెంటర్ల నుంచి కమిషన్లు, పరిశ్రమల నుంచి పర్సంటేజీలు, అన్నింటా ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ఆయన దెబ్బకే పరిశ్రమలు రాడం లేదు. ఆయన డ్టాక్టరు సుధీర్‌రెడ్డి కాదు.. యాక్టరు సుధీర్‌రెడ్డి’’ అంటూ విమర్శించడంతో జనం నుంచి పెద్దఎత్తున కేకలు విని పించాయి.

ప్రొద్దుటూరులో కేక

ప్రొద్దుటూరులో లోకేశ్‌ పర్యటనపై ఆసక్తి రేపింది. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ముందు పసిగట్టారు. అయినా పాదయాత్రకు జనం విపరీతంగా రావడం... శివాలయం సెంటరులో జరిగిన బహిరంగసభ సూపర్‌ సక్సెన్‌ కావడం జరిగింది. బహిరంగ సభలో ఎమ్మెల్యే రాచమల్లుపై లోకేశ్‌ విరుచుకుపడ్డారు. రాచమల్లు ప్రసాద్‌ కాదు బెట్టింగ్‌ ప్రసాద్‌రెడ్డి అంటూ తనదైన శైలిలో లోకేశ్‌ చెలరేగిపోయాడు. రాచమల్లును వ్యంగ్యంగా లోకేశ్‌ విమర్శించిన తీరు హైలెట్‌గా మారింది. రీటెలికాస్ట్‌ అయిన క్రికెట్‌ మ్యాచ్‌కు కూడా ప్రసాద్‌రెడ్డి బెట్టింగ్‌ పెట్టడం చూసి ఆయన ఇంట్లో ఉన్న వైసీపీ నేతలు నవ్వుకున్నారంటూ లోకేశ్‌ వేసిన పంచ్‌కు మంచి స్పందన వచ్చింది. ఆయన ఎమ్మెల్యే అయిన తరువాత ప్రొద్దుటూరు మారలేదని.. ఆయన మాత్రం లావు ఆయ్యారంటూ చేసిన విమర్శలకు జనం నుంచి ఒకటే నవ్వులు. ఒక్కపైసా లేకుండా రెండు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మిస్తాం, అలా చేయకుంటే 2024 ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే తూ నాకొడకా అనండంటూ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు లోకేశ్‌ గుర్తు చేయడంతో జనం నుంచి కేకలు పుట్టించాయి. లోకేశ్‌ తనదైన స్టైల్‌లో పంచ్‌లతో చేసిన విమర్శ జనాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఎవరి బండారం బయటపడుతుందో...

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై లోకేశ్‌ చేసిన తీవ్ర ఆరోపణలు జనాల్లో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా వైసీపీ నేతలలో చర్చ సాగింది. ఇక పాదయాత్ర కడప, కమలాపురం, బద్వేలు నియోజకవర్గాల్లో సాగనుంది. అక్కడ జరిగే ప్రతి సభలో ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, మట్కా, ఇతర వాటి గురించి లోకేశ్‌ తీవ్ర స్థాయిలో అటాక్‌ చేస్తారన్న చర్చ వైసీపీలో ఉంది. మైదుకూరు, బద్వేలు, కమలాపురం, కడప నియోజకవర్గాలు భూకబ్జాలు, ల్యాండ్‌ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందనే విమర్శ ఉంది. ఈ నేపధ్యంలో అక్కడ అక్రమాలపై లోకేశ్‌ ప్రశ్నిస్తే ఎన్నికల్లో డ్యామేజీ అవుతుందనే భయం వైసీపీ నేతలను వేధిస్తున్నట్లు చెబుతున్నారు.

Updated Date - 2023-06-03T01:33:47+05:30 IST