‘చరిత్ర’ను కాపాడుకుందాం

ABN , First Publish Date - 2023-01-08T02:31:37+05:30 IST

కొత్తగా ప్రారంభించే ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ సబ్జెక్టును ప్రవేశపెట్టి, చరిత్ర సబ్జెక్టును పక్కన పెట్టడం ఆవేదన కలిగిస్తోందని హిస్టరీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బీఆర్‌ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవ్‌ హిస్టరీ నినాదంతో ముందకెళ్లాలని పిలుపునిచ్చారు.

‘చరిత్ర’ను కాపాడుకుందాం

ఇంటర్‌లో సబ్జెక్టు తొలగింపు దారుణం

హిస్టరీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బీఆర్‌ ప్రసాద్‌రెడ్డి

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 7: కొత్తగా ప్రారంభించే ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ సబ్జెక్టును ప్రవేశపెట్టి, చరిత్ర సబ్జెక్టును పక్కన పెట్టడం ఆవేదన కలిగిస్తోందని హిస్టరీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి బీఆర్‌ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవ్‌ హిస్టరీ నినాదంతో ముందకెళ్లాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలోని యోగివేమన యూనివర్సిటీలో శనివారం 45వ ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ రెండురోజుల సదస్సు ప్రారంభమైంది. సదస్సులో బీఆర్‌ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌లో చరిత్ర సబ్జెక్టు లేకపోతే తరువాత డిగ్రీ, పీజీలలోనూ ఉండే అవకాశాన్ని ఊహించలేమన్నారు. చరిత్ర సబ్జెక్టు తీసేయకుండా ప్రతి ఒక్కరూ సేవ్‌ హిస్టరీ నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. సమాజానికి అవసరమైన విలువలు నేర్పే చరిత్ర సబ్జెక్టును ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. చరిత్ర లేకపోతే సమాజం గుడ్డిదనే భావించాలన్నారు. గతం లేనిదే నేడు లేదని, నేడు లేనిదే రేపు లేదన్నారు. వైవీయూ వీసీ మునగాల సూర్యకళావతి మాట్లాడుతూ తెలుగువారి చరిత్ర సుసంపన్నం కావడానికి ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర కాంగ్రెస్‌ సెషన్‌లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రకాంగ్రెస్‌ వ్యవస్థాపక సభ్యులు, ప్రముఖ చరిత్రకారులు ప్రొఫెసర్‌ వకుళాభరణం రామకృష్ణ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల కిందట రూ.220 బ్యాంకు బ్యాలెన్స్‌తో మొదలైన ఆంధ్రపదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ క్రమం తప్పకుండా ప్రతి యేటా సదస్సులు నిర్వహించి తెలుగువారి చరిత్రను గ్రంథస్థం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హిస్టరీ కాంగ్రెస్‌ 44వ సెషన్స్‌ సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ కిరణ్‌క్రాంత్‌ చౌదరి, పలువురు చరిత్ర ఆచార్యులు, పరిశోధకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-08T02:31:37+05:30 IST