లిఫ్ట్‌ ఇరిగేషన్‌ భూసేకరణ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2023-05-25T22:43:13+05:30 IST

జిల్లాలోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు జూన్‌ మాసాంతంలోగా భూసేకరణ అవార్డ్స్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు.

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ భూసేకరణ పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా

రైతులకు త్వరగా భూపరిహారం చెల్లించాలి

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి టౌన్‌, మే 25: జిల్లాలోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు జూన్‌ మాసాంతంలోగా భూసేకరణ అవార్డ్స్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లో మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలోని ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భూసేకరణపై సంబంధిత తహసీల్దార్లు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవో, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం వివిధ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. ఇందుకు ఆయా పథకాలకు సంబంధించిన భూసేకరణను త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, సంబేపల్లె, చిన్నమండెంలోని చెరువులకు నీరు నింపేందుకు చేపట్టిన లిఫ్ట్‌ స్కీంకు 137 ఎకరాలు అవసరం కాగా ఇప్పటి వరకు 66 ఎకరాలు భూసేకరణ చేసినట్లు తెలిపారు. మిగిలిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స యూనిట్‌-1 భూసేకరణలో భాగంగా మదనపల్లె, మొలకలచెరువు, పీటీయం, తంబళ్లపల్లెల్లో 186 ఎకరాలు అవసరం కాగా 60 ఎకరాలు, యూనిట్‌-2 ముదివేడు బ్రాంచ్‌ రిజర్వాయర్‌కు సంబంధించి 1075 ఎకరాలకు గానూ 446.50 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. మిగులు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌అహ్మద్‌, డీఆర్‌వో సత్యనారాయణ, ఆర్డీవో రంగస్వామి, ఎస్డీసీలు, ఇరిగేషన్‌ అధికారులు, సంబంధిత తహసీల్దార్‌లు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా రీసర్వే

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని గ్రామ, మండల సర్వేయర్లకు కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో జిల్లాలోని 450 మందికి గ్రామ, మండల సర్వేయర్లకు కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా మెడికల్‌, స్టేషనరీ కిట్లను అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయి రీసర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. రీసర్వేకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రీసర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్వేయర్లు, సర్వే శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలన్నారు. నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దశలో పూర్తయిన గ్రామాలకు సర్వే రాళ్లను యుద్ధప్రాతిపదికన పాతాలన్నారు. అదేవిధంగా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ జయరాజ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా సర్వే అండ్‌ సెటిల్మెంట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రక్రియలో భాగంగా ధర్మామీటర్‌, సెలోవన్‌ యాంటీ బయోటిక్‌ లోషన్‌, పారాసిటమాల్‌ మాత్రలు, బ్యాండేజ్‌ మొదలగు 15 అంశాలు కలిపి మెడికల్‌ కిట్‌తో పాటు ప్రథమ చికిత్స నిమిత్తం కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్వే ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, డిప్యూటీ సర్వే ఆఫ్‌ ఇన్స్‌పెక్టర్లు, గ్రామ, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T22:43:13+05:30 IST