ఇన్‌స్పైర్‌ పోటీల్లో కన్నెమడుగు విద్యార్థి ప్రతిభ

ABN , First Publish Date - 2023-03-25T23:04:29+05:30 IST

జాతీయ స్థాయి ఇన్‌స్ఫైర్‌ పోటీలకు తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు ఉన్నత పాఠశాల విద్యార్థి మహమ్మద్‌ సిరాజ్‌ రూపొందించిన మ్యాన్‌ హోల్‌ క్లీనింగ్‌ డివైజ్‌ నమూనా ఎంపికైనట్లు పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడు పీఎల్‌ఎన్‌ శాస్ర్తి తెలిపారు.

ఇన్‌స్పైర్‌ పోటీల్లో కన్నెమడుగు విద్యార్థి ప్రతిభ
విద్యార్థి మహమ్మద్‌ సిరాజ్‌ రూపొందించిన మ్యాన్‌ హోల్‌ క్లీనింగ్‌ డివైజ్‌ నమూనా

జాతీయ స్థాయికి ఎంపికైన మ్యాన్‌ హోల్‌ క్లీనింగ్‌ డివైజ్‌ నమూనా

తంబళ్లపల్లె, మార్చి 25: జాతీయ స్థాయి ఇన్‌స్ఫైర్‌ పోటీలకు తంబళ్లపల్లె మండలం కన్నెమడుగు ఉన్నత పాఠశాల విద్యార్థి మహమ్మద్‌ సిరాజ్‌ రూపొందించిన మ్యాన్‌ హోల్‌ క్లీనింగ్‌ డివైజ్‌ నమూనా ఎంపికైనట్లు పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడు పీఎల్‌ఎన్‌ శాస్ర్తి తెలిపారు. ఈనెల 9, 10 తేదీలలో చిత్తూరులో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఇన్‌స్ఫైర్‌ పోటీలలో పాఠశాల ఉపాధ్యాయులు జి.రమణమ్మ, పీఎల్‌ఎన్‌ శాస్ర్తి మార్గదర్శకంలో విద్యార్థి మహమ్మద్‌ సిరాజ్‌ రూపొందించిన మ్యాన్‌ హోల్‌ క్లీనింగ్‌ డివైజ్‌ నమూనా రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. కాగా ఈ నెల 23, 24 తేదీలలో రాజమండ్రిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో సిరాజ్‌ రూపొందించిన నమూనా ప్రదర్శించడంతో ప్రశంసలు అందుకుని జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికైంది. త్వరలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగే ఇన్‌స్ఫైర్‌ పోటీలలో నమూనా ప్రదర్శనకు చోటు దక్కిందని ఉపాధ్యాయుడు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన నమూనా రూపొందించిన సిరాజ్‌ని ఎంఈవో త్యాగరాజుతో పాటు, కన్నెమడుగు సర్పంచ్‌ శ్యామలమ్మ, పాఠశాల హెచ్‌ఎం సుబ్రమణ్యం, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.

సులభంగా వినియోగించుకునే విధంగా...

మ్యాన్‌ హోల్‌ డివైజ్‌ను పీవీసీ పైపులు, కెమెరా, కట్టర్‌, ప్లక్కర్‌ వంటి పరికరాలు ఉపయోగించి ప్రతి ఒక్కరూ సులభంగా వినియోగించే విధంగా విద్యార్థి సిరాజ్‌ తయారు చేశాడు. మ్యాన్‌ హోల్‌ లోపల చెత్తా, చెదారం గమనించడానికి వీలుగా ఓ కెమెరాను పీవీసీ పైపులతో తయారు చేసిన డివైజ్‌కు అమర్చాడు. ఆ కెమెరాను సెల్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసి ఆపరేటింగ్‌ చేయవచ్చు. ఓ కట్టర్‌ను డివైజ్‌కు అమర్చి మ్యాన్‌ హోల్‌ లోపల చెత్తను కెమెరాతో గమనిస్తూ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించవచ్చు. ఆ చెత్తను ప్లక్కర్‌ సహాయంతో మ్యాన్‌ హోల్‌లో నుంచి సులభంగా బయటకు తొలగించవచ్చునని విద్యార్థి చెబుతున్నాడు. ఈ డివైజ్‌ను అతి సులభంగా ఉపయోగించవచ్చని, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా తీసుకుపోవచ్చని చెబుతున్నాడు. అంతేకాకుండా ఈ డివైజ్‌కు వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను అమర్చి ఇళ్లలో చెత్తను కూడా తొలగించవచ్చునని విద్యార్థి చెబుతున్నాడు.

Updated Date - 2023-03-25T23:04:29+05:30 IST