సెన్సేషన్‌ కోసమే జగన్‌ పేరు

ABN , First Publish Date - 2023-05-27T03:05:26+05:30 IST

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో సడెన్‌గా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేరు ప్రస్తావించడం సెన్సేషన్‌ కోసమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

సెన్సేషన్‌ కోసమే జగన్‌ పేరు

కౌంటర్‌ అఫిడవిట్‌లో ప్రస్తావన

ఇది చిల్లరగా, పిల్ల చేష్టలాగా ఉంది

సీబీఐ కుట్రపై లోతైన దర్యాప్తు జరగాలి

అవినాశ్‌ను అరెస్ట్‌ చేయడమే టార్గెట్‌

ఆయన కుటుంబాన్ని వేధిస్తోంది: సజ్జల

అమరావతి (ఆంధ్రజ్యోతి)/శంషాబాద్‌ రూరల్‌, మే 26: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో సడెన్‌గా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేరు ప్రస్తావించడం సెన్సేషన్‌ కోసమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీబీఐ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని, అఫిడవిట్‌లో ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చన్నారు. వివేకా హత్య కేసులో జగన్‌ పేరును అకస్మాత్తుగా తీసుకురావడం వెనుక సీబీఐ చేసిన కుట్రపై లోతైన దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఎవరెవరితో మాట్లాడుతుందో, ఎవరి సమన్వయంతో వ్యవహరిస్తూ కుట్ర పన్నుతుందో విచారణ జరగాలన్నారు.

ఈ కేసుతో సంబంధం లేని ఎంపీ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయాలని సీబీఐ టార్గెట్‌గా పెట్టుకుందని విమర్శించారు. విచారణ పేరుతో ఆ కుటుంబాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందన్నారు. ‘‘కేసుకు సంబంధించిన సమాచారం ముందుగా చంద్రబాబుకు, కొన్ని మీడియా సంస్థలకు సీబీఐ లీక్‌ చేస్తోంది. వివేకా హత్య విషయం ఉదయం 6:30 గంటలకు ముందే జగన్‌కు తెలుసని సీబీఐ పేర్కొంది. అంత తప్పుడు ఆరోపణలు ఎలా చేసిందో తెలియాలి. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటో తెలియాలి. లోతైన దర్యాప్తు జరగాల్సిందే’’ అని సజ్జల అన్నారు.

Updated Date - 2023-05-27T06:20:27+05:30 IST