కల్వర్టుల పనులు అంతేనా..?

ABN , First Publish Date - 2023-09-25T23:29:15+05:30 IST

మండలంలో ని వివిద గ్రామాల్లో వాగులపై నిర్మించిన పలు కల్వర్టులు ప్రమాదకరంగా ఉండడంతో వాటి పరిస్థితి అంతేనా? అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కల్వర్టుల పనులు అంతేనా..?
రంగసముద్రం పంచాయతీ బొంతవారిపల్లె సమీపంలో తెగిపోయిన కల్వర్టులకు తాత్కాలిక మరమ్మత్తులు చేసిన దృశ్యం

తాత్కాలిక మరమ్మతులకే పరిమితమైన వైనం

వర్షాకాలం కావడంతో భయపడుతున్న

ఆయా గ్రామాల ప్రజలు

శాశ్విత నిర్మాణ పనులు ఎప్పుడోనంటున్న జనం

పెద్దతిప్పసముద్రం సెప్టెంబర్‌ 25: మండలంలో ని వివిద గ్రామాల్లో వాగులపై నిర్మించిన పలు కల్వర్టులు ప్రమాదకరంగా ఉండడంతో వాటి పరిస్థితి అంతేనా? అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చాలా కల్వర్టులు తెగిపోయి దాదాపు రెండేళ్లు కావస్తున్నా శాశ్విత అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో మళ్లీ వర్షాకాలం రావడంతో తాత్కాలిక మరమ్మతులు తెగిపోయి రాకపోకలకు ఇక్కట్లు మొదలవు తాయని ప్రజలు భయపడుతున్నారు. 2021 అక్టోబర్‌, నవంబర్‌ మా సాల్లో కురిసిన భారీ వర్షాలకు, వరదల ఉధృతికి టి.సదుం పంచా యతీ చెన్నరాయునిపల్లె సమీపంలోని పాపాఘ్నీ నదిపై ఉన్న కల్వర్టు, జంబుగానిపల్లె సమీపంలోని ఇదే పాపాఘ్నీ నదిపై ఉన్న కల్వర్టు, రంగసముద్రం పంచాయతీ బొంతవారిపల్లె వద్ద ఉన్న కల్వర్టులు తెగిపోయాయి. అప్పట్లో 2నెలల పాటు పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ తరువాత తాత్కాలికంగా ఆయా కల్వర్టులకు మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్దరించారు. అయితే గత ఏడాది జూన, జూలై మాసాల్లో, అక్టోబర్‌ నవంబర్‌ మాసాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆ కల్వర్టులు మళ్లీ కొట్టుకుపోయాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలకు మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానిక నాయకులు ఆ కల్వర్టులకు తా త్కాలికంగా మళ్లీ మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరిం చారే తప్ప తెగిపోయిన కల్వర్టులకు శాశ్వతంగా నిర్మాణాలు చేపట్ట లేదు. కల్వర్టులను పునర్నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు అధికా రులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో మళ్లీ వర్షాలు కురిస్తే తాత్కాలిక మరమ్మతులు మళ్లీ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాపాఘ్నీనదిపై ఉన్న కల్వ ర్టు తెగిపోతే అవతల వైపు కర్ణాటక రాష్ట్రం చేలూరుతోపాటు మన రాష్ట్రంలోని గుంటిపల్లె, రేకలగుంటిపల్లె, జంబుగానిపల్లె గ్రామాల ప్రజ లకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అదే రంగసముద్రం గ్రామం బొంతవారిపల్లె వద్ద ఉన్న కల్వర్టు వలన బొంతవారిపల్లె నెటరాయుని పల్లె గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణాలపై దృష్టి సారించి శాశ్వత ప్రాతిపదికన కల్వర్టులను నిర్మించి అభివృధ్ది చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం

వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టుల నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదన లు పంపినట్లు రోడ్లు, భవనాల శాఖ డీఈ శ్రీనివాసులు తెలిపారు. ఈ విషయమై ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఇందులో చెన్నరాయునిపల్లె కల్వర్టుకు రూ.9కోట్లలతో ప్రతిపానలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. జంబుగానిపల్లె కల్వర్టు, బొంత వారిపల్లె కల్వర్టు పంచాయతీరాజ్‌ కిందకు వస్తాయన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలపారు.

Updated Date - 2023-09-25T23:29:15+05:30 IST