వడగండ్లు.. కడగండ్లు...

ABN , First Publish Date - 2023-03-19T23:11:22+05:30 IST

ఈదురు గాలులు... పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం రైతన్నను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. రాజంపేట, పెనగలూరు, చిట్వేలి మండలాల్లో ఉద్యానవన పంటలకు భారీ నష్టం కలిగింది.

వడగండ్లు.. కడగండ్లు...
రాజంపేట మండలం వరదయ్యగారిపల్లెలో దెబ్బతిన్న అరటి పంట

అకాల వర్షంతో అపారం నష్టం

వందల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

రూ.కోట్లలో పంట నష్టం

రాజంపేట, మార్చి 19 : ఈదురు గాలులు... పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం రైతన్నను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. రాజంపేట, పెనగలూరు, చిట్వేలి మండలాల్లో ఉద్యానవన పంటలకు భారీ నష్టం కలిగింది. శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలుల వల్ల తీవ్ర నష్టం ఏర్పడింది. శనివారం రాత్రి 7 గంటల నుంచి ఒక గంట పాటు ఎడతెరిపి లేని వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులు కూడా వీచాయి. తిరిగి అర్ధరాత్రి వరకు భారీగా వర్షం పడింది. దీంతో ఆకేపాడు, కారంపల్లె, వరదయ్యగారిపల్లె, హస్తవరం, మిట్టమీదపల్లె, బ్రాహ్మణపల్లె, గుండ్లూరు చుట్టుపక్కల గ్రామాల్లో 400 ఎకరాల వరకు అరటిపంట దెబ్బతింది. ఉద్యానవన శాఖాధికారులు ఆదివారం వేసిన ప్రాథమిక అంచనాలను బట్టి 200 ఎకరాల వరకు అరటి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. సోమ, మంగళవారాల్లో ఆయా గ్రామ సచివాలయ పరిధిలోని వ్యవసాయ ఉద్యానవన అధికారుల ద్వారా పంట నష్టాలు అంచనా వేయనున్నారు. అదేవిధంగా బెండ, నూగు, సజ్జ పంటలు మరో 50 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. చిట్వేలి మండలంలోని పలు గ్రామాల్లో భారీ ఈదురుగాలులు, వడగండ్ల వర్షం వల్ల మండలంలో సుమారు 50 ఎకరాల పైబడి మామిడి, అరటి, వరి, నూగు పంటలు దెబ్బతిన్నాయి. నూగు, వరి పంటల్లో నీరు నిలవడం వల్ల పంట నేలకొరిగింది. చేతికొచ్చే పంట నేలకొరగడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. అదే విధంగా పెనగలూరు మండలంలోని వెలగచర్ల, కొండూరు, ఈటిమాపురం చుట్టుపక్కల గ్రామాల్లో వరి, నూగు, సజ్జ పంట దెబ్బతింది. పెనగలూరు మండలంలో కూడా 100 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అరటి ధర ఆకాశాన్నంటింది. కిలో అరటికాయలు 30 రూపాయలు ధర పలుకుతున్నాయి. ఒక్క గెల 600 రూపాయలు రేటు పలుకుతోంది. చేతికొచ్చిన పంట ఈదురుగాలులు, వర్షం వల్ల నేలకొరగడంతో రైతులు నష్టాల పాలయ్యారు.

గుర్రకొండలో...

గుర్రంకొండ, మార్చి 19: ఈదురు గాలులు... పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం రైతన్నను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. టమోటా, మామిడి, బొప్పాయి, కర్బూజ పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు తెగుళ్లతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రస్తుతం అకాల వర్షం కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది. వర్షాలకు వడగండ్లు తోడు కావడంతో రైతులు సాగు చేసిన ఉద్యానవన పంటలైన టమోటా, మామిడి, పూలు, కర్బూజ, బొప్పాయి, మిరప పంటలకు అపార నష్టం తెచ్చిపెట్టింది. శనివారం సాయంత్రం వరకు కళకళలాడుతున్న పంటలు రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి నెలకొరిగాయి. మరికొన్ని చోట్ల పంటల్లో కాయలు పూర్తిగా నెల రాలడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. గుర్రంకొండ మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో రైతులు టమోటా పంటను సాగు చేశారు. ప్రస్తుతం టమోటా పంట చాలా వరకు పూత, పిందె, కోత దశలో ఉన్నాయి. మార్కెట్‌లో టమోటాల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి టమోట పంటలు సగానికి పైగా దెబ్బతిన్నాయి. ఈ వర్షానికి వడగండ్లు తోడు కావడంతో టమోటా తోటల్లో కాయలు దెబ్బతిని నేలరాలాయి. ఎకరం టమోటా పంట సాగు చేయాలంటే రైతన్నకు రూ.2 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ అకాల వర్షంతో పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. మండలంలో రెండు రోజులు కురిసిన వడగండ్ల వర్షానికే టమోటా రైతులు రూ.కోట్లు నష్టపోయారు. అలాగే వేలాది ఎకరాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. వడగండ్ల వర్షంతో పూత, పిందెలు నేలరాలాయి. అలాగే వందల ఎకరాల్లో పూలు, కర్బూజ, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-19T23:11:22+05:30 IST