ఆకాశంలో సగం.. అవనిలో సగం..

ABN , First Publish Date - 2023-03-08T00:16:58+05:30 IST

ఆమె ఒక తల్లి, కూతురు, చెల్లి, భార్య, వీటన్నింటిని మించి సృష్టికర్త. ఒక పోరాట యోధురాలు. అట్లకాడ చేత పట్టుకోవడం నుంచి నేటి కంప్యూటర్‌ యుగంలో యుద్ధ విమానాలు నడిపే వర కు అన్నింటా రాణిస్తూ ఆమె ఆకాశంలో సగం.. అవనిలో సగం అన్నట్లుగా ముందుకు దూసుకుపోతోంది.

ఆకాశంలో సగం.. అవనిలో సగం..

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ప్రొద్దుటూరు క్రైం /కడప, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆమె ఒక తల్లి, కూతురు, చెల్లి, భార్య, వీటన్నింటిని మించి సృష్టికర్త. ఒక పోరాట యోధురాలు. అట్లకాడ చేత పట్టుకోవడం నుంచి నేటి కంప్యూటర్‌ యుగంలో యుద్ధ విమానాలు నడిపే వర కు అన్నింటా రాణిస్తూ ఆమె ఆకాశంలో సగం.. అవనిలో సగం అన్నట్లుగా ముందుకు దూసుకుపోతోంది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. జిల్లాలో ఇద్దరు ఐపీఎస్‌ మహిళా అధికారులు పనిచేస్తున్నారు. రక్షణ విభాగంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా వారు తమ భావాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

పూజిత నీలం, ఏఎస్పీ : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పాపిడికి చెందిన పూజిత నీలం విద్యాభ్యాసం పుట్టపర్తిలో.. ఉన్నత విద్య బెంగళూరులో అభ్యసించారు. 2012లో గ్రూప్‌-1కు ఎంపికయ్యారు. మొదట ప్రొద్దుటూరు సబ్‌డివిజన్‌లో పనిచేశారు. తద నంతరం అనంతపురం, తెలంగాణలోని సూర్యపేట, హైదరాబాదులో పనిచేశారు. ప్రస్తుతం ఎస్‌ఈబీ ఏఎస్పీగా పనిచేస్తున్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అంటున్నారు.

ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలి

- పూజిత నీలం, ఏఎస్పీ ఎస్‌ఈబీ

మహిళలు ఆత్మస్థైర్యంతో ముం దుకు నడవాలి. అందుబాటులో ఉన్న అవకాశాలను అంది పుచ్చుకోవాలి. మహిళ కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుతుందో సమాజాన్ని కూడా అలాగే చక్కదిద్దే సత్తా ఉంటుంది. ఆధునిక యుగంలో మహిళలు అన్నింటిలో రాణిస్తున్నారు.

ప్రేర్ణకుమార్‌, ఏఎస్పీ : స్వస్థలం ఉత్తరప్రదేశ్‌ గజియాబాద్‌. తల్లిదండ్రులు దీపక్‌కుమార్‌ సుష్మారాణి. దీపక్‌కుమార్‌ వాణిజ్యపన్నుల శాఖ అధికారిగా పనిచేశారు. ప్రేర్ణకుమార్‌ ఇంటర్మీడియట్‌ వరకు గజియాబాద్‌లోనే చదివారు. ఆ తర్వాత రాజస్తాన్‌ బనస్థలి విశ్వవిద్యాలయంలో బీటేక్‌ పూర్తి చేశారు. తండ్రి దీపక్‌కుమార్‌ సూచనలతో ఢిల్లీ వెళ్లి అక్కడ సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. 2017లో సివిల్స్‌ (యుపీఎస్‌సీ) ఎగ్జామ్‌ రాశారు. తొలి ప్రయత్నంలోనే ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఏపీ కేడర్‌కు వచ్చారు. తొలుత మచిలీపట్నంలో ట్రైనీ ఐపీఎస్‌గా శిక్షణ పొందారు. అపై విశాఖపట్టణం గ్రేహౌండ్స్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పనిచేశారు. అక్కడ పనిచేస్తూ బదిలీపై ప్రొద్దుటూరు ఏఎస్పీగా వచ్చారు. విధి నిర్వహణలో బాధ్యతా యుతంగా ఉంటూ శాంతిభద్రతలు పరిరక్షిస్తూ, మహిళ సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

తల్లిదండ్రులు ప్రోత్సహించాలి

- ప్రేర్ణకుమార్‌, ఏఎస్పీ, ప్రొద్దుటూరు

సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. విజయపథంలో నడిచిన మహిళలను స్ఫూర్తిగా తీసుకుని అమ్మాయిలు తాము ఎన్నుకున్న రంగాల్లో ధైర్యంగా రాణించాలి.. ఇందుకు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలి... బేటీ బచావో-బేటీ పడావో కాన్సెప్ట్టును ప్రతి ఒక్కరూ పాటించాలి. ఫ్యామిలీలో మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం సమాజంలో ఉన్నతంగా ఉంటుంది. మహిళలను గౌరవించడం భారతదేశ సంస్కృతి. అందరూ దీనిని పాటించాలి. నేను ఐపీఎస్‌ కావలన్నది నాన్న ఆశయం. బీటెక్‌ పూర్తి చేశాక ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నా. పట్టుదలతో చదివి తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించా.. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఎంపికై నాన్న కోరిక నేరవేర్చా.

Updated Date - 2023-03-08T00:16:58+05:30 IST