గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు శ్రీకారం
ABN , First Publish Date - 2023-08-06T22:51:49+05:30 IST
ఎట్టకేలకు కడప-రేణిగుంట నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకి మోక్షం లభించింది. రెండు రోజులుగా రోడ్డు పనులు చేపట్టడానికి భారీ యంత్రాలతో రోడ్డుకు అడ్డంగా ఉన్న కంపచెట్లను తొలగించడం మొదలు పెట్టారు. రోడ్డు పనులు దక్కించుకున్న కంపెనీ భారీ యంత్రాలతో పనులకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల కడప, కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు, తెలంగాణ ప్రజలు సులభతరంగా చెన్నై, తిరుపతి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది.
122.9 కిలోమీటర్లు.. రూ.2254 కోట్లు
కడప నుంచి రేణిగుంటకు నాలుగు లేన్ల రహదారి
రాజంపేట వద్ద భారీ యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం
రాజంపేట, ఆగస్టు 6: ఎట్టకేలకు కడప-రేణిగుంట నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకి మోక్షం లభించింది. రెండు రోజులుగా రోడ్డు పనులు చేపట్టడానికి భారీ యంత్రాలతో రోడ్డుకు అడ్డంగా ఉన్న కంపచెట్లను తొలగించడం మొదలు పెట్టారు. రోడ్డు పనులు దక్కించుకున్న కంపెనీ భారీ యంత్రాలతో పనులకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల కడప, కర్ణాటక, మహారాష్ట్ర, కర్నూలు, తెలంగాణ ప్రజలు సులభతరంగా చెన్నై, తిరుపతి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ప్రస్తుతమున్న కడప-చెన్నై డబుల్‌రోడ్డు వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ వందలాది మంది ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. నిత్యం 10 వేల వాహనాలు ఈ రోడ్డులో ప్రయాణిస్తుంటాయి. ఈ రోడ్డులో భారీఎత్తున మలుపులు ఉండటం, పల్లె ప్రాంతాలన్నీ ఇదే మార్గంలో ఉండటం వల్ల నిత్యం వేలాది వాహనాలు వెళుతూ ఉండటం రోజుకు ఏదో ఒకచోట ప్రమాదాలు జరగడం, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం పనులకు శ్రీకారం చుట్టడంతో త్వరితగతిన గమ్యం చేరడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గి ప్రాణనష్టం తగ్గనుంది. సుమారు రూ.2254 కోట్లకు పైబడి ఖర్చుతో ఎన్‌హెచ్-716 గ్రీన్‌ఫీల్డ్ హైవేకి సంబంధించి రాజంపేట మండలం కూచివారిపల్లె పాలశీతలీకరణ కేంద్రం సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు శనివారం నుంచి శ్రీకారం చుట్టారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే లైజనింగ్ ఆఫ్ అధికారి పట్టాభిరామ్ ఆధ్వర్యంలో భారీ యంత్రాలతో ఈ పనులకు శ్రీకారం చుట్టగా స్థానిక వీఆర్వో జగదీష్, విలేజ్ సర్వేయర్ ప్రవీణ్‌లు ఏర్పాట్లను పరిశీలించి క్లీనింగ్ అండ్ గ్రబ్బింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. త్వరలో రోడ్డుకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ పూర్తయితే అధికారికంగా రోడ్డు పనులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కడప జేఎంజే శివారు నుంచి ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడు వరకు 64 కిలోమీటర్లతో ఒక ప్యాకేజీ, చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు 59 కిలోమీటర్ల మేర రెండవ ప్యాకేజీ కింద రెండు దశల్లో ఈ రోడ్డు పనులు జరగనున్నాయి.
కడప-రేణిగుంట మధ్యలో 52కు పైబడి లైట్ వెహికల్ అండర్ పాస్ బ్రిడ్జిలు, 72 మేజర్ అండర్‌పాస్ బ్రిడ్జిలు, 240 కల్వర్టులు, మూడు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఈ మార్గంలో నిర్మించనున్నారు. నాలుగు లేన్ల రహదారిగా ప్రయాణికులకు ఆహ్లాదకరంగా ఉండేటట్లు పచ్చని చెట్లను ఏర్పాటు చేసి ఏ గ్రామంలోనూ ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే వల్ల ఇబ్బందులు లేకుండా నీరు ప్రవహించే ప్రాంతాల్లో కల్వర్టులు, ప్రజలు వెళ్లడానికి అండర్ బ్రిడ్జిలు, వాహనాలు వెళ్లడానికి కావాల్సిన బ్రిడ్జిలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. కడప నుంచి మాధవరం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు, బాలపల్లె మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంట నాలుగు లేన్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రెండు లేన్ల రహదారికి అల్లంతదూరంలో రైల్వేలైన్లకు సుమారు ఆయా ప్రాంతాలను బట్టి కిలోమీటరు నుంచి మూడు కిలోమీటర్ల వెడల్పు పైభాగాన ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు అల్లంత దూరంలో, పంట పొలాలు, కొండ ప్రాంతాలు, కోడూరు నుంచి రేణిగుంట వరకు శేషాచలం అటవీ ప్రాంతాల గుండా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు. 122.9 కిలోమీటర్ల మేర ఏర్పాటయ్యే ఎన్‌హెచ్-716 నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేలో ఇటు రాజంపేట, అటు రైల్వేకోడూరు, అటు నందలూరు, ఒంటిమిట్ట, ఓబులవారిపల్లె, పుల్లంపేట ప్రధాన కూడళ్లకు హైవే రోడ్డుకు అనుసంధానంగా ప్రత్యేక రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు రాజంపేట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని కూచివారిపల్లె నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే వెళ్లడానికి ప్రస్తుతమున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా రాయచోటికి వెళ్లే మార్గం గుండా ఈ జంక్షన్ రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా కోడూరు, ఇతర మండలాలకు ఇతర గ్రామీ ణ ప్రాంతాలకు అనుసంధానంగా ఈ హైవే మీదుగా వెళ్లడానికి అనుసంధానం రోడ్లు ఏ ర్పాటు చేస్తారు. తద్వారా అత్యంత తక్కువ సమయంలో హైవేకు చేరుకుని తాము చేరాలనుకున్న గమ్యస్థానాలకు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తున్నారు. ఇప్పటి వరకు 80 శాతం మంది పైబడి భూసేకరణదారులకు నష్టపరిహారం కూడా అందజేశారు. అక్కడక్కడా భూయజమానులకు సుమారు 20 శాతం వరకు పైకం చెల్లించాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల అవి పెండింగ్‌లో ఉన్నాయి. వారికి పూర్తి స్థాయి నష్టపరిహారం అందజేయడానికి కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి కసరత్తు చేస్తోంది. రెండు నెలల్లో రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కంపచెట్లు, ఇతర అడ్డంకులు, చిన్న చిన్న పల్లపు ప్రాంతాలు, ఎత్తు ప్రాంతాలు కొండలు చదును చేస్తే రెండు నెలల తరువాత పనులు వేగవంతంగా జరగనున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే ఈ రోడ్డుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. టెండర్లను దక్కించుకున్న విజయవాడకు చెందిన లక్ష్మీ ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ రోడ్డు ఏర్పాటుకు జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. ఈ విషయమై గ్రీన్‌ఫీల్డ్ హైవే లైజనింగ్ ఆఫ్ అధికారి పట్టాభిరామ్ విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభిస్తున్న కూచివారిపల్లె సమీపంలో స్థానిక అధికారుల సహాయంతో తొలిసారిగా క్లీనింగ్ అండ్ గ్రబ్బింగ్ పనులు ప్రారంభించామని, రెండు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని ఈ పని పూర్తయిన వెంటనే రెండు ప్యాకేజీలుగా ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. కడప నుంచి చిన్నఓరంపాడు వరకు 64 కిలోమీటర్లు ఒక ప్యాకేజీ మేర, చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు 59 కిలోమీటర్లు రెండవ ప్యాకేజీ మేర ఈ పనులు జరుగుతాయని తెలిపారు.